స్మార్ట్‌ కార్డులు లేవట.. పేపర్లపై లైసెన్సులు ఇస్తారట.. ఇదీ ఒంగోలు ఆర్టీఏ కార్యాలయం తీరు

ABN , First Publish Date - 2020-12-18T05:27:33+05:30 IST

జిల్లాలో వాహనదారులకు స్మార్ట్‌కార్డు చిక్కులొచ్చాయి. రోడ్డెక్కాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆరునెలలుగా దాదాపు పదివేల మంది రకరకాల అవస్థలు పడుతున్నారు. రవాణా శాఖ కార్యాలయంలో వాహనాల రిజిస్ట్రేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ల కోసం వెళితే పోస్టు ద్వారా కార్డులు వస్తాయని చెబుతున్నారు.

స్మార్ట్‌ కార్డులు లేవట.. పేపర్లపై లైసెన్సులు ఇస్తారట.. ఇదీ ఒంగోలు ఆర్టీఏ కార్యాలయం తీరు
ఒంగోలులోని ఉపరవాణా కమిషనర్‌ కార్యాలయం

 రిజిస్ట్రేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ స్మార్ట్‌కార్డులు లేవు

ఆరు నెలలుగా అవస్థలు

పదివేలకుపైగా కార్డులు పెండింగ్‌

రూ. 25లక్షల వరకు వసూలు

అవస్థలుపడుతున్న వాహనదారులు

సరఫరా లేకపోవడంతోనే ఆలస్యం

అవసరమైతే పేపర్లు ఇస్తాం: డీటీసీ


ఒంగోలు(క్రైం), డిసెంబరు 17:  జరిమానాలకు కేరాఫ్‌గా మారిన ప్రస్తుత సర్కారు అందుకు తగ్గట్లుగా వ్యవస్థలను పటిష్టం చేయడంలో మాత్రం వెనకబడింది. రకరకాల మార్గాల్లో వసూళ్ల ద్వారా ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుంది తప్పా సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇందుకు రవాణాశాఖ సేవలే నిదర్శనం. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా రోడ్డెక్కితే రూ.5వేలు, ఇన్సూరెన్స్‌ లేకుంటే రూ.2వేలు, వాహన పత్రాలు లేకుంటే రూ.10వేలు అంటూ రకరకాలుగా ఫైన్లు వేస్తున్న అధికారులు, అందుకు అవసరమైన స్మార్ట్‌కార్డులను ఇవ్వడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఆరునెలలుగా లైసెన్స్‌దారులకు, వాహనదారులకు కార్డులు అందడం లేదు. జిల్లావ్యాప్తంగా దాదాపు 10వేల కార్డులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో వాహనదారులు తనిఖీల సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా వసూళ్లపైనే దృష్టిపెట్టిన రవాణాశాఖ అధికారులు సరఫరా లేకపోవడంతోనే కార్డులు అందజేయలేక పోతున్నామంటూ తాపీగా సమాధానమిస్తున్నారు. అయితే సిఫార్సులు ఉన్నవారికి, కాస్తంత చేతులు తడిపే వారికి మాత్రం వెంటనే స్మార్ట్‌కార్డులు అందడం కొసమెరుపు.  


 జిల్లాలో వాహనదారులకు స్మార్ట్‌కార్డు చిక్కులొచ్చాయి. రోడ్డెక్కాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆరునెలలుగా  దాదాపు పదివేల మంది రకరకాల అవస్థలు పడుతున్నారు. రవాణా శాఖ కార్యాలయంలో వాహనాల రిజిస్ట్రేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ల కోసం వెళితే పోస్టు ద్వారా కార్డులు వస్తాయని చెబుతున్నారు. ఆరునెలలుగా ఇదే తంతు. పలుకుబడి ఉంటేనే కార్డు.. లేకుంటే లేదు అన్నట్లు పరిస్థితి తయారైంది. సామాన్యులకు మాత్రం పోలీసు, రవాణా శాఖ తనిఖీల్లో జేబులు ఖాళీ అవుతున్నాయి. లైసైన్సు పొందినప్పటికి కార్డు లేకపోవడంతో ఫైన్‌లు వేస్తున్నారని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వాహనాల ఇన్సూరెన్స్‌, కోర్టు అవసరాలకు వాహన రిజిస్ట్రేషన్‌ తదితర అవసరాలకు డ్రైవింగ్‌ లైస్సైన్సుల కార్డులు లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. లైసెన్స్‌కు దరఖాస్తు సమయంలో, వాహనాలు కొనుగోలు సమయంలో స్మార్ట్‌కార్డు చార్జీల పేరుతో రూ.200, పోస్టల్‌ చార్జీల పేరుతో రూ.35 వసూలు చేస్తారు. ఈ విధంగా జిల్లాలో ఆరునెలలుగా ఆరు వేల వాహనాలు రిజిస్ట్రేషన్లు కాగా, నాలుగు వేల డ్రైవింగ్‌ లైసెన్స్‌లు మంజురు చేశారు. వెరసి 10వేల స్మార్ట్‌కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. అందుకోసం వాహనదారుల నుంచి రూ.20లక్షలు స్మార్ట్‌కార్డు చార్జీలు, రూ.3.5 లక్షలు పోస్టల్‌ చార్జీల కోసం ప్రభుత్వం వసూలు చేసింది. 


పలుకుబడి ఉంటే స్మార్ట్‌కార్డులు 


రవాణాశాఖ సిబ్బంది కాస్త పలుకుబడి ఉన్నవారికి మాత్రం స్మార్ట్‌కార్డులు అందజేస్తున్నారు. సామాన్యులకు మాత్రం అందడం లేదు. కార్డు కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫార్సులు కావాల్సి వస్తుంది. అంతేకాదు కొంతమంది సిబ్బంది కార్డుల కోసం చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికారులు దృష్టిసారించిన ధాఖలాలు కనబడటం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే స్మార్ట్‌కార్డు వ్యాపారంగా మారే పరిస్థితి ఉంది. ఆరునెలలుగా స్మార్ట్‌కార్డుల సరఫరా లేదని, అందువల్లే సమస్య తలెత్తిందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా సెల్‌ఫోన్‌ లేనివారికి కనీసం మెసేజ్‌లు కూడా రావు. అలాంటివారి పరిస్థితి మరింత దయనీయం. కొంతమంది తన కుటుంబసభ్యుల ఫోన్‌ నంబర్లు ఇస్తున్నారు. దీంతో కార్డు మెసేజ్‌లు వారికి వస్తాయి. అలాంటి సమయంలో రహదారులపై, పట్టణాల్లో తనిఖీ అధికారులు, పోలీసులకు వాహనదారులు ఆ మెసేజ్‌లు చూపించే పరిస్థితి ఉండదు. ఇలాంటి వారికి కార్డు కష్టాలు వర్ణనాతీతం.


స్మార్ట్‌కార్డు కష్టాలు


డ్రైవింగ్‌ లైసెన్స్‌కు సంబంధించి కార్డు అందుబాటులో లేకపోవడంతో వాహనాల తనిఖీల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాను డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందానని కార్డు రవాణా శాఖ వారు ఇవ్వలేదని చెప్పినప్పటికి అధికారులు వినకుండా జరిమానా విధిస్తున్నారు. కార్డు ఖచ్చితంగా దగ్గర ఉంచుకోవాలనే నిబంధన ఉందని పోలీసులు ఫైన్‌ వేస్తున్నారు. అంతేకాకుండా కోర్టు కేసులకు సంబంధించి కార్డు ఖచ్చితంగా ఉండాలి. అందుకోసం నానా అవస్థలు పడి రవాణాశాఖ కార్యాలయం చుట్టూ తిరిగి అనేక సిఫార్సులతో కార్డు తీసుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. కొందరైతే రవాణాశాఖ సిబ్బంది చేతులు తడిపి కార్డులు సంపాదిస్తున్నారు. రవాణాశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు వెంటనే కార్డులు అందించాలంటూ వాహనాదారులు వేడుకుంటున్నారు. 

Updated Date - 2020-12-18T05:27:33+05:30 IST