ఆసుపత్రులు తెరవక..వైద్యం అందక!

ABN , First Publish Date - 2020-04-14T11:05:09+05:30 IST

ఇప్పటివరకు అత్యవసర సేవలన్నీ 90శాతం ప్రయివేట్‌ వైద్యశాలల్లోనే జరుగుతుండేవి

ఆసుపత్రులు తెరవక..వైద్యం అందక!

అత్యవసర సేవలకూ సెలవు

ఇబ్బందులుపడుతున్న రోగులు

ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో సేవలు నిల్‌

ప్రధాన గేట్లకు తాళాలే దర్శనం

ఆర్‌ఎంపీల సేవల బంద్‌ మరీ కష్టాలు


కరోనా దెబ్బతో సామాన్య రోగులు విలవిలలాడుతున్నారు. లాక్‌డౌన్‌తో జిల్లాలోని ప్రయివేట్‌ వైద్యశాలలు సేవలను నిలిపివేశాయి. వైద్యరంగంలో 90శాతం సేవలు ప్రయివేట్‌ రంగంలోనే ఉండగా అవి మూతపడటంతో సాధారణ ప్రజలు లబోదిబోమంటున్నారు. వైద్యులు అత్యవసర సేవలకు కూడా అందుబాటులో ఉండటం లేదు. కొన్ని ఆసుపత్రులు అయితే ప్రధాన గేటుకు తాళం వేసి వైద్యం కోసం వచ్చే రోగులను అటు నుంచి అటే పంపించేస్తున్నారు. గుండెపోటు, ఫిట్స్‌, పక్షవాతం వంటి రోగాలకు అత్యవసర సేవలు అందటం లేదు.


వైద్యం కోసం వస్తున్న వారిని వైరస్‌ ఉందేమోనని అనుమానిస్తూ బయటకు పంపించేస్తున్నారు. ప్రజావైద్యశాల రిమ్స్‌ పూర్తిగా కరోనా ఆస్పత్రిగా మారడంతో ఇతర వైద్యసేవలు అంతంతమాత్రమే. ఇందుకు ఇటీవల మరణించిన ప్రేమ్‌కుమార్‌ ఉదంతమే నిదర్శనం. అలాగే ఈ నెలలో 3వేలమంది గర్భిణీలకు డెలివరీ తేదీలు ఉన్నాయి. వారిలో హైరిస్కు ఉన్నవారికి వైద్యం అత్యవసరం. మరి యంత్రాంగం ఈ వైపు దృష్టిసారించకపోతే మరింత నష్టపోతాం.


ఒంగోలు నగరం, ఏప్రిల్‌ 13: ఇప్పటివరకు అత్యవసర సేవలన్నీ 90శాతం ప్రయివేట్‌ వైద్యశాలల్లోనే జరుగుతుండేవి. ఎలాంటి సీరియస్‌ కేసు అయినా వాటికే తీసుకుపోయేవారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్క రిమ్స్‌లోనే సీరియస్‌ కేసులకు వైద్యం అందుబాటులో ఉండేది. అయితే రిమ్స్‌లో కూడా కార్డియాలజీ, న్యూరాలజీ వంటి కీలక విభాగాల్లో వైద్యం అందుబాటులో లేదు. అయితే ప్రస్తుతం పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. ప్రయివేట్‌ వైద్యశాలల్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయివేట్‌ వైద్యులు 99శాతం మంది ప్రస్తుతం సేవలు అందించేందుకు విముఖత చూపుతున్నారు. కరోనా ఎఫెక్టుకు ముందు క్షణం తీరిక లేకుండా ఉండే ప్రయివేట్‌ వైద్యులు ఎక్కువమంది ప్రస్తుతం ఆసుపత్రులకు తాళాలు వేసి ఇంటికే పరిమితం అయ్యారు.


కొంతమంది అయితే ఆసుపత్రులకే కాదు రోగులను దగ్గరకు కూడా రానివ్వటం లేదు. ఒక్క రిమ్స్‌లోనే సీరియస్‌ రోగులను చేర్చుకుంటున్నారు. రిమ్స్‌లో కూడా కరోనా రోగ లక్షణాలు ఉంటేనే వెంటనే స్పందించి వారిని ఐసోలేషన్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇతర వ్యాధులతో వస్తే షరామామూలేగా అన్నట్లుగానే ఉంది. ఎందుకంటే కరోనాతో తలమునకలై పనిచేస్తున్న రిమ్స్‌ వైద్యులు, సిబ్బంది సాధారణ రోగాలతో ఆసుపత్రికి పోతున్న వారి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటేనే వారిని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుంటున్నారు.


ప్రభుత్వ పరంగా నడుస్తున్న పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా వైద్యశాలల్లో కూడా అంతంతమాత్రంగానే సేవలు అందుతున్నాయి. ప్రభుత్వ వైద్యులు ఎక్కువగా కరోనా రోగులను గుర్తించటం, వారికి పరీక్షలు నిర్వహించటం, వారి వివరాలను ప్రభుత్వానికి అప్‌లోడ్‌ చేయటం, వారిని క్వారెంటైన్‌లో  ఉంచటం, లక్షణాలు అధికంగా ఉంటే వారికి రిమ్స్‌కు పంపించటంపైనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. వారు ఉదయం లేస్తే కరోనా విధుల్లోనే బిజిబిజీగా తిరుగుతున్నారు. దీంతో ఇతర రోగాలతో వచ్చే రోగులను పట్టించుకునే పరిస్థితే లేకుండా పోయింది. 


కాన్పులు కూడా చేయని ప్రయివేట్‌ వైద్యశాలలు

జిల్లాలో ప్రతినెలా మూడొంతుల ప్రసవాలు ప్రయివేట్‌లోనే జరిగేవి. కాని నేటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రసవాలకు ప్రభుత్వ వైద్యశాలలే దిక్కవుతున్నాయి. రిమ్స్‌లోని గైనిక్‌ విభాగం, మాతాశిశు వైద్యశాలల్లో అధికంగా ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రయివేట్‌ వైద్యశాలకు పోతే నో అని చెప్పేస్తున్నారు. కాన్పు చేసే మాట దేవుడెరుగు గర్భవతికి పరీక్షలు చేసేందుకు కూడా ఎక్కువశాతం వైద్యులు ముందుకు రావటం లేదు. జిల్లాలోని ఒకటి రెండు ప్రయివేట్‌ వైద్యశాలల్లోనే కాన్పులు జరుగుతున్నట్లు సమాచారం.


రోగులకు పరీక్షలు చేసి చికిత్స అందించాలంటే ఆసుపత్రి సిబ్బంది అంతా విధులకు హాజరు కావాలి. ఇలా హాజరైతే వారికి తగిన రక్షణ చర్యలు ఉండాలి. రోగి వెంట బందువులు వస్తారు. వారి నుంచి కూడా సిబ్బందికి, వైద్యులకు వైరస్‌ వ్యాపించే అవకాశం ఉంది. ప్రయివేట్‌ ఆసుపత్రుల్లో పీపీఈ కిట్లు గాని, ఇతర రక్షణ పరికరాలు గాని లేవు. ఈ కారణాలతో వైద్యం పూర్తిగా ఆపేశామని అంటున్నారు.


ఓపీ చూడాల్సిందే అంటున్న ప్రభుత్వం

కరోనా కాకుండా ఇతర వ్యాధులతో బాధపడుతున్న రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తాజాగా ప్రయివేట్‌ వైద్యశాలలకు ఆదేశాలు జారీచేసింది. ప్రతిరోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీలు చూడాల్సిందేనని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాలు ఎంతమేర అమలు చేస్తారో చూడాల్సిందే. 


గ్రామీణ వైద్యులు సేవలకు ముకుతాడు

గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా సేవలు అందిస్తున్న ఆర్‌ఎంపీలు కరోనా లక్షణాలు కనిపిస్తే వైద్యం చేయవద్దంటూ ప్రభుత్వ ఆదేశాలు. ఒకవైపు ప్రయివేట్‌ వైద్యశాలలు ఓపీ విధులను బంద్‌ చేయటంతో  గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వీరి వద్దకు వెళ్లే వారు చిన్న చిన్న రోగాలతోనే వెళుతుంటారు. జలుబు, దగ్గు, జ్వరం, నొప్పులు వంటి ల క్షణాల వారికే వీరు వైద్యం చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ లక్షణాలు కరోనా వైరస్‌ సోకిన వారిలో కనిపిస్తుండటంతో వీరు ఈ వ్యాధులకు వైద్యం చేసే వీలులేకుండా పోయింది.  దీంతో క రోనా కాకుండా ఇతర వ్యాధులతో బాధపడుతున్న రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. 

Updated Date - 2020-04-14T11:05:09+05:30 IST