తుఫాన్‌ నష్టాలతో... రుణా భారంతో అన్నదాత ఇంట మృత్యుగంట

ABN , First Publish Date - 2020-12-21T05:12:34+05:30 IST

జిల్లాలో రైతుల పరిస్థితి మరోసారి ఆందోళనకరంగా కనిపిస్తోంది. నివర్‌ తుఫాన్‌ దెబ్బ నుంచి వారు కోలుకోలేకపోతున్నారు. ప్రధాన పంటలైన మిర్చి, పొగాకు, వరి, మినుము, పత్తి, కంది తదితర పంటలకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేక, అప్పులు తీర్చే మార్గం కన్పించక ఆత్మహత్యల బాట పడుతున్నారు.

తుఫాన్‌ నష్టాలతో... రుణా భారంతో  అన్నదాత ఇంట   మృత్యుగంట
ఆదివారం మృతి చెందిన రైతు సాంబిరెడ్డి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రమేష్‌ గుండెపోటుతో మృతి చెందిన రైతు సింగయ్య

నిండా ముంచిన నివర్‌ తుఫాన్‌ 

తుడిచిపెట్టుకుపోయిన పంటలు 

పెరిగిన రుణభారం 

మనోధైర్యం కోల్పోపోతున్న కర్షకులు

వారంలో ఉసురు తీసుకున్న ఇద్దరు

పంట పొలంలోనే కుప్పకూలిన మరొకరు

ముగ్గురూ మిర్చి సాగు చేసిన కౌలు రైతులే


 ఒంగోలు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) :  రైతుల ఇంట మళ్లీ మృత్యుగంట మోగుతోంది. నివర్‌ తుఫాన్‌ దెబ్బకు నిండా మునిగిన వారికి భరోసా కరువైంది. దీంతో మనోధైర్యం కోల్పోతున్నారు. ఆత్మహత్యల బాట పడుతున్నారు. పర్చూరు మండలంలో వారం వ్యవధిలో ఇద్దరు పురుగు మందు తాగి ఉసురు తీసుకున్నారు. అంతకు ముందు ఇంకొల్లు మండలంలో ఓ రైతు పంట పొలంలోనే కుప్పకూలిపోయాడు. తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు పంటలకు జరిగిన పూర్తి నష్టం బయటపడుతుండగా దాన్ని ఏరకంగా పూడ్చుకోవాలో ఆర్థంకాని పరిస్థితుల్లో అత్యధిక శాతం మంది కొట్టుమిట్టుతున్నారు. ముఖ్యంగా మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే భారీగా అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన వారు తీవ్రంగా నష్టపోయారు. ఈనెలలో మృతి చెందిన ముగ్గురూ మిర్చి సాగు చేసిన కౌలు రైతులే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో వారిలో మనోధైర్యం కల్పించాల్సిన ప్రభుత్వం నుంచి ఆదిశగా తీసుకున్న చర్యలు మృగ్యమయ్యాయి. 


జిల్లాలో రైతుల పరిస్థితి మరోసారి ఆందోళనకరంగా కనిపిస్తోంది. నివర్‌ తుఫాన్‌ దెబ్బ నుంచి వారు కోలుకోలేకపోతున్నారు. ప్రధాన పంటలైన మిర్చి, పొగాకు, వరి, మినుము, పత్తి, కంది తదితర పంటలకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేక, అప్పులు తీర్చే మార్గం కన్పించక ఆత్మహత్యల బాట పడుతున్నారు. జిల్లాలో వాస్తవానికి ఈ ఏడాది వ్యవసాయ సీజన్‌ ఆశాజనకంగానే కనిపించింది. ఖరీ్‌ఫలో ఇంచుమించు పూర్తి స్థాయి విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. రబీలోనూ అలాంటి వాతావరణమే తొలుత కనిపించింది. 


ఆరుగాలం కష్టం నివరార్పణం

ఖరీఫ్‌ పంటలు కోత, పూత, పిందె దశలోనూ, రబీ పైర్లు ఎదుగుదల దశలో ఉన్న సమయంలో నవంబరు ఆఖరులో సంభవించిన నివర్‌ తుఫాను వ్యవసాయ రంగాన్ని అతాలకుతలం చేసింది. రైతులను నిండా ముంచింది.  కేవలం నాలుగు రోజుల వ్యవధిలో సగటున 40నుంచి 66 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. అప్పటికే సుమారు రెండు లక్షల హెక్టార్లలో పంటలు ఉండగా అధికారిక అంచనాల ప్రకారమే దాదాపు లక్షా 20వేల మంది రైతులకు చెందిన  90వేల హెక్టార్లలో 33శాతానికి పైగా పంట నష్టం జరిగింది. అందుకు సంబంధించి వంద కోట్లు పరిహారం ఇవ్వాల్సి వస్తుందని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. అయితే ఆయా ప్రాంతాల నుంచి అందుతున్న క్షేత్రస్థాయి పరిస్థితుల ప్రకారం చూస్తే జిల్లాలో లక్ష నుంచి లక్షా 20వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిని ఇప్పటి వరకు ఆయా పంటలకు పెట్టుబడుల రూపంలో పెట్టిన దాదాపు రూ. 500 కోట్లకు పైగా రైతులు నష్టపోయారు. మినుము పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మిర్చి, వరి, పొగాకు తదితర పంటలకు భారీగానే నష్టం జరిగింది. 


మిర్చి సాగుదారులకు కోలుకోలేని దెబ్బ

జిల్లాలో నష్టం జరిగిన పంటల్లో మిర్చి ప్రధానంగా ఉంది. పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో రైతులు ఈ ఏడాది కౌలుకు ఎక్కువ పొలం తీసుకొని విస్తారంగా మిర్చి సాగు చేశారు. పర్చూరు, మార్టూరు, అద్దంకి, కందుకూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి తదితర వ్యవసాయ సబ్‌ డివిజన్ల పరిధిలో విస్తృతంగా మిర్చి నాటారు. పర్చూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఎటుచూసినా మిర్చి పంటే కనిపించింది. చాలా ప్రాంతాల్లో ఆయా గ్రామాల్లో ఉన్న మొత్తం వ్యవసాయ భూమిలో  మూడొంతులు మిర్చి పంటే వేశారు. సగటున హెక్టారుకు రూ. లక్ష నుంచి 2 లక్షల వరకూ ఇప్పటికే ఖర్చు చేశారు. ఈసమయంలో నివర్‌ తుఫాను కురిసిన భారీ వర్షంతో ఆ ప్రాంత రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. వేలాది హెక్టార్లలో మిర్చి పంట నిలువునా ఉరకెత్తి ఎండిపోయింది. 


మనో నిబ్బరం కోల్పోతున్న రైతులు

కొంత మేర మొక్కలు ఎండిపోయిన రైతులు మళ్లీ నాటుకుంటున్నారు. ఎక్కువ మొక్కలు పోయిన మిర్చి రైతులు ఆ భూమిలో మళ్లీ ఏపంట వేయాలో అర్థంకాక అయోమయంలో ఉన్నారు. అలాంటి వారు మనోనిబ్బరం కోల్పోతున్నారు. ఈక్రమంలో ఈనెలలో ఇప్పటికే ముగ్గురు రైతులు మృత్యువాత పడ్డారు. వారిలో ఒకరు పంట పరిస్థితి చూసి కుదేలై గుండెపోటుతో మృతి చెందగా, మరో ఇద్దరు రైతులు ఏకంగా పురుగుల మందు తాగి బలన్మరణం చెందారు.  ఈనెల 1న ఇంకొల్లు మండలం సుబ్బారెడ్డిపాలెంకు చెందిన కౌలు రైతు కుంచెపు సింగయ్య (55) ఎండిపోయిన మిర్చి పంటను చూసి పొలంలోనే కుప్పకూలిపోయాడు. ఇరుగు పొరుగు రైతులు ఆయన్ను గ్రామంలోకి చేర్చేసరికే మృతిచెందాడు. పంగులూరు మండలం కోటపాడుకు చెందిన సింగయ్య గత కొన్నేళ్లుగా సుబ్బారెడ్డిపాలెంలో పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. అలాగే ఈ ఏడాది కూడా పది ఎకరాలు మిర్చి సాగు చేయగా నివర్‌ తుఫాన్‌తో దెబ్బతింది. దాన్ని  చూసి సింగయ్య నిలువునా కూలిపోయాడ. మరో వైపు పర్చూరు మండలం చిననందిపాడు గ్రామానికి చెందిన సాదినేని రమేష్‌ (53) అనే రైతు ఈనెల 14న తన పొలంలో పురుగుల మందు తాగి బలన్మరణం చెందారు. ఆయన కూడా మిర్చి సాగు చేసిన కౌలు రైతే. భారీగా పెట్టుబడులు పెట్టిన పంట ఇక ఎందుకు పనికిరాదన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. 


నూతలపాడులో మిర్చి  రైతు ఆత్మహత్య 

పర్చూరు మండలం నూతలపాడుకు చెందిన సాంబిరెడ్డి (58) అనే రైతు బలన్మరణం చెందారు. రెండు  ఎకరాల స్వంత భూమి ఉన్న సాంబిరెడ్డి మరో నాలుగు ఎకరాలు కౌలుకుతీసుకొని మిర్చి సాగు చేశాడు. అనంతరం అతి వర్షాలకు పంటకు కొంత మేర నష్టం వాటిల్లింది. ఇటీవల నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. కళ్ల ముందే పంట ఎండిపోతోంది. దీంతో కొద్దిరోజులుగా సాంబిరెడ్డి తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. అదేసమయంలో పంటల కోసం తెచ్చిన అప్పులు రూ. 5లక్షల వరకూ ఉన్నాయి. వాటిని తీర్చేమార్గం కనిపించక మనోవేదన చెందుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తన మిద్దె పైకి ఎక్కి పురుగుమందు తాగాడు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయన్ను పర్చూరులోని ఓప్రైవేటు వైద్యశాలకు, అనంతరం గుంటూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన వారు బోరున విలపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అనేక మంది రైతులు తీవ్ర మానోవేదనలో ఉన్నారు. ఒకవైపు పంటలు దెబ్బతి, మరోవైపు అప్పులు తీర్చేమార్గం కన్పించక క్షోభపడుతున్నారు.  ప్రభుత్వం  తక్షణం రైతులకు ఉపశమనం కలిగించే రీతిలో చర్యలు చేపట్టకపోతే జిల్లాలో మరోసారి అన్నదాతల అత్మహత్యలపరంపర కొనసాగే అవకాశం ఉంది. 


Updated Date - 2020-12-21T05:12:34+05:30 IST