ఆక్రమించుకో... అమ్ముకో.. దర్జాగా చెరువుల కబ్జా..

ABN , First Publish Date - 2020-10-03T20:26:05+05:30 IST

అద్దంకి ప్రాంతంలో చెరువులు ఆక్రమణల చెరలో చిక్కాయి. వేలాది ఎకరాలు పరులపరమయ్యాయి. చెరువులను దర్జాగా కబ్జా చేస్తున్న వారు ఆ భూమిని మరొకరికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఆక్రమించుకో... అమ్ముకో.. దర్జాగా చెరువుల కబ్జా..

వేల ఎకరాలు పరులపరం.. ఇష్టానుసారం విక్రయాలు 

ఇప్పటికే పలువురు చేతులు మారిన వైనం 

భవనాసిలో ఏకంగా చేపల చెరువులు

ఏటికేడు తగ్గిపోతున్న నీటి నిల్వ.. పట్టించుకోని అధికారులు 


అద్దంకి(ప్రకాశం): అద్దంకి ప్రాంతంలో చెరువులు ఆక్రమణల చెరలో చిక్కాయి. వేలాది ఎకరాలు పరులపరమయ్యాయి. చెరువులను దర్జాగా కబ్జా చేస్తున్న వారు ఆ భూమిని మరొకరికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారు. దీంతో  చెరువులు చిక్కిపోయాయి. నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోయింది. గత టీడీపీ హయాంలో నీరు-చెట్టు పథకం అమలుతో కొన్ని చెరువులకు ఆక్రమణల నుంచి మోక్షం లభించింది. కానీ ఇప్పుడు అవి కూడా కొన్ని చోట్ల అన్యాక్రాంతమవుతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు ఆ వైపు తీసుకుంటున్న చర్యలు మృగ్యమయ్యాయి. ఆక్రమణదారుల నుంచి అమ్యామ్యాలు ముట్టడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


అద్దంకి ప్రాంతంలో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే పాగా వేస్తున్నారు. చెరువులను చెరబట్టిన వీరు దర్జాగా కబ్జా చేసి అమ్ముకుంటున్నారు. అద్దంకి పట్టణంలోని ఊరచెరువును ఆక్రమంచిన కొందరు ఏకంగా ప్లాట్లుగా మార్చి అమ్మకాలు చేస్తున్నారు. భవనాసి చెరువులో కొంత భాగాన్ని చేపల చెరువులగా మార్చేశారు. వీటితోపాటు మరికొన్ని చెరువులు కూడా పరులపరమయ్యాయి. 


సగానికిపైగా ఊరచెరువు ఆక్రమణ

అద్దంకి ఊరచెరువు సు మారు వంద ఎకరాల్లో ఉంది. ఇందులో సగానికిపైగా కబ్జాకు గు రైంది. కొందరు చెరువులో మెరక  ప్రాంతంలో ప్లాట్లు వేసి అమ్మకాలు చేస్తున్నారు. ఊర చెరువుకు వర్షపు నీరు వచ్చే మార్గాలు కూడా ఆక్రమణలకు గురయ్యాయి. స్థలానికి విలువ పెరగడంతో ఆక్రమణలు జోరందుకుంటున్నాయని ప్రజలు చెబుతున్నారు.


రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం: మధుసూదనరావు, ఏఈ, ఇరిగేషన్‌, అద్దంకి

చెరువుల ఆక్రమణలపై సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని రెవెన్యూ అధికారులను కోరాం. ఇప్పటికే పలు చెరువులు ఆక్రమణలకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించాం. రెవెన్యూ అధికారుల సహకారంతో ఆక్రమణలు తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. అద్దంకి ఊర చెరువులో ఆక్రమణలు పెరిగిపోతున్న నేపథ్యంలో రెవెన్యూ, నగరపంచాయతీ అధికారులతో  ఇటీవల సమావేశం నిర్వహించాం. చెరువు అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.


చోద్యం చూస్తున్న అధికారులు

ఏటికేడు ఆక్రమణలు పెరిగిపోతున్నా అటు ఇరిగేషన్‌ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా వందల చెరువులలో ఆక్రమణలు పెద్ద ఎత్తున ఉన్నాయి.  గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నీరు-చెట్టు పనుల కింద కొన్ని చెరువులలో ఆక్రమణలు తొలగించి పూడిక తీత పనులు చేశారు. మిగిలిన చెరువులలో కనీసం సర్వే కూడా చేయకుండానే పూడిక తీత పనులు చేపట్టారు. దీంతో ఆక్రమణదారులు దర్జాగా ఆక్రమించి అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించి చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.


ముఖ్యమైన చెరువుల ఆక్రమణలు ఇలా..

సంతమాగులూరు చెరువు 900 ఎకరాలు కాగా సుమారు 150 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఏల్చూరు చెరువు 325 ఎకరాలు కాగా సుమారు 40 ఎకరాలు, కుందుర్రు చెరువు 150 ఎకరాలు కాగా 20 ఎకరాలు, పరిటాలవారిపాలెం చెరువు 120 ఎకరాలు కాగా 30 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైనట్లు తెలుస్తోంది. ఇక మక్కెనవారిపాలెం చెరువు 300 ఎకరాలుగా రెవెన్యూ రికార్డులలో ఉండగా, క్షేత్రస్థాయిలో 50 ఎకరాలు కూడా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పంగులూరు మండలం అలవలపాడు చెరువులో 30 ఎకరాలు ఆక్రమణలకు గురైంది.


భవనాసిలో వంద ఎకరాలు..

వెయ్యి ఎకరాల వరకు ఉండాల్సిన భవనాసి చెరువు పరీవాహక ప్రాంతం కూడా ఆక్రమణలకు గురైంది. సుమారు వంద ఎకరాల వరకు ఆక్రమించి ఉంటారని అంచనా. వీటిలో కొందరు ఏకంగా చేపల చెరువులు కూడా తవ్వారు. యథేచ్ఛగా సాగు చేస్తున్నారు. రిజర్వాయర్‌గా మార్పు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్న సంతమాగులూరు, ఏల్చూరు చెరువులు కూడా ఆక్రమణలకు గురయ్యాయి.

Updated Date - 2020-10-03T20:26:05+05:30 IST