దొనకొండలో కోతుల బెడద

ABN , First Publish Date - 2020-12-08T05:21:28+05:30 IST

మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కోతుల బెడద తీవ్రమైంది. దొనకొండ రైల్వేస్టేషన్‌లో అధికసంఖ్యలో కోతులు స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.

దొనకొండలో కోతుల బెడద
కోతుల దాడిలో గాయపడిన రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి

వృద్ధుడిని గాయపరిచిన వానరాలు

బెంబేలెత్తుతున్న  స్థానికులు

దొనకొండ, డిసెంబరు 7 : మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కోతుల బెడద తీవ్రమైంది.  దొనకొండ  రైల్వేస్టేషన్‌లో అధికసంఖ్యలో కోతులు స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. పగటి సమయాల్లో బజార్లలో క్యారీ బ్యాగు కనబడితే మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురై వారు కొనుగోలు చేసుకున్న వస్తువులు వదిలి పరుగులు తీస్తున్నారు. బస్టాండ్‌ సెంటర్‌లో తోపుడుబండ్లపై చిరువ్యాపారాలు చేసుకునే వారు ఆదమరిస్తే అధికంగా పండ్లు, వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇళ్లలోకి వెళ్లి లోపల చేతికందిన వస్తువులను తీసుకెళ్తున్నాయి. గతంలో ఒబ్బాపురంలో ఒక మహిళ మిద్దెమీదకు వచ్చిన కోతులను తరిమేందుకు వెళ్లగా అవి ఒక్కసారిగా పైకిరావటంతో మెట్లపైనుంచి కిందపడి గాయాలపాలయ్యాయి. తాజాగా దొనకొండలోని రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి లాప్రీ తన ఇంటిపై కోతుల గుంపు రావటంతో కర్రపట్టుకొని వెళ్లగా అతనిపై దాడిచేసి కరిచి గాయపర్చాయి. కోతుల వలన దొనకొండ, సిద్దాయిపాలెం మరికొన్ని గ్రామాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. కోతుల బెడద సమస్యను పరిష్కరించేందుకు గ్రామ పంచాయతీ పాలకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నివారణ చర్యలు  చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-12-08T05:21:28+05:30 IST