రిమ్స్‌లో దాహం.. కరోనా బాధితులను వేధిస్తున్న నీటి కష్టాలు

ABN , First Publish Date - 2020-10-03T20:33:42+05:30 IST

జిల్లాలోనే పెద్దాసుపత్రి అయిన రిమ్స్‌లో నీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. పూర్తిస్థాయి కొవిడ్‌ వైద్యశాల అయిన ఇందులో రోజుల తరబడి వార్డుల్లో నీరు రాకపోవడంతో

రిమ్స్‌లో దాహం.. కరోనా బాధితులను వేధిస్తున్న నీటి కష్టాలు

రోజుల తరబడి పరిష్కారంకాని సమస్య

అధ్వానంగా మరుగుదొడ్లు.. పట్టించుకోని అధికారులు 


ఒంగోలు (కార్పొరేషన్‌) : జిల్లాలోనే పెద్దాసుపత్రి అయిన రిమ్స్‌లో నీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. పూర్తిస్థాయి కొవిడ్‌ వైద్యశాల అయిన ఇందులో  రోజుల తరబడి వార్డుల్లో నీరు రాకపోవడంతో కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు దొరక్క గగ్గోలు పెడుతున్నారు.  కనీసం మరుగుదొడ్లకు కూడా వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నారు. 


వందల కోట్లు వెచ్చించి నిర్మించిన రిమ్స్‌ను ఆది నుంచి నీటి సమస్య వేధిస్తోంది. కరోనా కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో రిమ్స్‌ను పూర్తిస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిగా మా ర్చారు. ప్రస్తుతం సుమారు 800 మందికిపైగా కరోనా బాధితులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. వారికి సహాయకులుగా మరో 500 మంది వరకూ ఉంటున్నారు. వీరితోపాటు విధుల్లో పాల్గొనే ఆసుపత్రి సిబ్బంది కలుపుకొని సుమారు రెండువేల మంది వరకూ ఉన్నారు. అయితే వారికి అవసరమైన కనీస సౌకర్యాల కల్పనలో అధికారులు అలసత్వం  చూపుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆసుపత్రికి వస్తున్న రోగులకు కనీసం తాగేందుకు గుక్కె డు నీరు కూడా దొరకని దుస్థితి నెలకొంది. వార్డుల్లో కొళాయి ల నుంచి చుక్క నీరు రాక అవి అలంకారప్రాయంగా మారాయి. బయటకు వెళ్లి కొనుగోలు చేసుకోవాలన్నా కరోనా బాధితులు కావడంతో అందుకు అవకాశం లేకుం డా పోయింది. దీంతో ఆసుపత్రిలోని ఒకటి, రెండు, మూడు, అంతస్తుల్లో వైద్యం పొందుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. నీరు రాకపోవడంతో అత్యవసరమైనా వాటిలోకి వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.


కరోనా కాస్త తగ్గుముఖం..కొత్తగా 308 పాజిటివ్‌లు

ఒంగోలు జిల్లాలో కరోనా కాస్త తగ్గు ముఖం పట్టింది. పది రోజుల క్రితం వరకూ వేలల్లో వెలుగు చూసిన కేసులు ఇప్పుడు వందల్లో నమోదవుతున్నాయి. శుక్రవారం కొత్తగా 308 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. అందులో ఒంగోలులో 43, చీరాలలో 25, కందుకూరులో 18, అద్దంకిలో 10, మార్కాపురంలో 8 ఉన్నాయి. మొత్తం 1230 మంది కరోనా బాధితులు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అందులో ఆక్సిజన్‌ బెడ్‌పై 584 మంది, వెంటిలేటర్‌పై 78 మంది  ఉన్నారు. కరోనా నుంచి కోలుకొని 92 మంది డిశ్చార్జ్‌ కాగా ఇద్దరు మృతి చెందారు. 

Updated Date - 2020-10-03T20:33:42+05:30 IST