మనీ మాయ

ABN , First Publish Date - 2020-12-07T05:05:35+05:30 IST

జిల్లాలోని మార్కాపురం డివిజన్‌లో మరో గొలుసుకట్టు వ్యాపారం మొదలైంది. గతంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆశలను ఆసరా చేసుకోని వందల కోట్ల రూపాయల మేర ముంచిన హిమ్‌ తరహాలోనే ఓ సంస్థ భారీ ఆర్థిక మోసానికి తెరతీసింది.

మనీ మాయ

మార్కాపురం ప్రాంతంలో

హిమ్‌ తరహాలో మరో మోసం

జోరుగా గొలుసుకట్టు వ్యాపారం

వేలాది మంది నుంచి డిపాజిట్ల సేకరణ

సభ్యులను చేర్పిస్తే అకౌంట్లలో 

రూ.లక్షలు పడతాయని ప్రచారం

పేద, మధ్య తరగతి ప్రజలే లక్ష్యం

రూ. లక్షలు వసూలు చేస్తున్న నిర్వాహకులు

‘కేవలం రూ.2250 చెల్లించండి. 48 నెలల్లో రూ.30 లక్షలు మీ ఖాతాలో వేస్తాం. మీ అదృష్టం బాగుంటే ముందే లక్షాధికారులు కావచ్చు. అందుకోసం చేయాల్సిందల్లా ఒక్కటే. మీరు సభ్యులుగా చేరడంతోపాటు, మరో నలుగురుని చేర్పించండి. వారు చెల్లించే డిపాజిట్‌ మొత్తంలో సగం మీకు వస్తాయి’. ఇదీ మార్కాపురం ప్రాంతంలో ఓ సంస్థ పేరుతో నడుస్తున్న గొలుసుకట్టు వ్యాపారం. పేదలు, మధ్య తరగతి ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆ సంస్థ నిర్వాహకులు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక వ్యక్తిని ప్రతినిధిగా నియమించుకొని అతని ద్వారా గ్రామాల వారీ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. వీరి మాటలు నమ్మి ఇప్పటికే మార్కాపురం, త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు, గుంటూరు జిల్లాలోని మాచర్ల, వినుకొండ ప్రాంతాల్లో వేలాది మంది సభ్యులుగా చేరినట్లు సమాచారం. ఇది ఇలాగే కొనసాగితే హిమ్‌ సంస్థ తరహాలో మరో ఆర్థిక మోసం జరిగి ప్రజలు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. 

మార్కాపురం, డిసెంబరు 6: జిల్లాలోని మార్కాపురం డివిజన్‌లో మరో గొలుసుకట్టు వ్యాపారం మొదలైంది. గతంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆశలను ఆసరా చేసుకోని వందల కోట్ల రూపాయల మేర ముంచిన హిమ్‌ తరహాలోనే ఓ సంస్థ భారీ ఆర్థిక మోసానికి తెరతీసింది. తక్కువ మొత్తం పెట్టుబడితో అధికంగా డబ్బులు సంపాదించవచ్చని సంస్థ ప్రతినిధులు పేదలకు మాయ మాటలు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. రెండు, మూడు నెలల నుంచి ఈ వ్యవహరాన్ని సాగిస్తున్నారు. 

గుంటూరు కేంద్రంగా...

సదరు సంస్థ అమెరికాకు చెందిన వ్యక్తులదని ఏజెంట్లు ప్రచారం చేస్తున్నారు. కానీ గుంటురు చెందినవారే మార్కాపురంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని దీన్ని నడుపుతున్నట్లు సమాచారం. త్రిపురాంతకంలో నివాసముంటున్న పుల్లలచెరువు మండల వాసిని తమ ప్రతినిధిగా ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇతనికి గతంలో నకిలీ పాసు పుస్తకాల తయారీలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. నిర్వాహకులు, సంస్థ ప్రతినిధులు ప్రత్యక్షంగా ఎవరికీ కనబడకుండా ఏజెంట్ల ద్వారా పని చక్కబెట్టుకుంటున్నారు. ముఖ్యులైన వారిని మాత్రం హోటల్‌ళ్లలో కానీ, జూమ్‌ యాప్‌ల ద్వారా కానీ కలుస్తున్నట్లు సమాచారం.

పేద, మధ్య తరగతి వర్గాలే లక్ష్యం

ఈ స్కీంలో అందరినీ చేర్చుకోవడం లేదని తెలుస్తోంది. నిరక్ష్యరాసులు, పేదవారిని మాత్రమే ఎంచుకుంటున్నారు. తమకు ఇప్పటికే కమీషన్ల రూపంలో రూ.లక్షలు వస్తున్నాయని, మీరు కూడా సంపాదించుకోవచ్చని వారిపై ఆశల వల విసురుతున్నారు. అంతేకాక తమకు ఆర్‌బీఐ అనుమతులు ఉన్నాయని మాయమాటలతో మభ్యపెట్టి స్కీంలో చేర్పిస్తున్నారు. 

ఇప్పటికే భారీగా చేరిక 

సదరు సంస్థ ఏజెంట్ల మాటలకు ఆకర్షితులై పలువురు పేదలు, మధ్య తరగతి ప్రజలు డిపాజిట్లు చెల్లిస్తున్నారు. తమకు తెలిసిన వారు, బంధువులను కూడా చేరుస్తున్నారు. ఇప్పటికే మార్కాపురం డివిజన్‌లోని మార్కాపురం, త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు, గుంటూరు జిల్లాలోని మాచర్ల, వినుకొండ ప్రాంతాల్లో వేలాది మంది సభ్యులుగా చేరినట్లు సమాచారం. తాము ఎంతమందిని చేర్పించినా తమ ఖాతాల్లో నగదు జమ కాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులను ప్రశ్నిస్తే అవిగో... వస్తాయి.. ఇవిగో వస్తాయి అంటున్నారని చెప్తున్నారు. 

గతంలో హిమ్‌ భారీ మోసం

నెల్లూరు కేంద్రంగా గతంలో నడిచిన హిమ్‌ అనే సంస్థ ఇదే తరహాలో గొలుసుకట్టు వ్యాపారం చేసింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పేదల నుంచి రూ. వెయ్యి కోట్ల మేర వసూలు చేసి వారిని ముంచింది. అందులో మన జిల్లాలోనే రూ. 600 కోట్ల వరకూ ఉంటుందని అప్పట్లో అంచనా వేశారు. జిల్లాలోని కనిగిరి, మార్కాపురం, పొదిలి, ఎర్రగొండ ప్రాంతంలో వేలాది మంది ఆ సంస్థలో సభ్యులుగా చేరి మోసపోయారు. అప్పట్లో సదరు సంస్థ పాస్టర్లను ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకొని ఈ వ్యవహారాన్ని నడిపింది. ప్రస్తుతం అదే తరహాలో మరో సంస్థ పక్కా ప్రణాళికతో ఈ తతంగం నడుపుతోంది. గ్రామాల్లో ప్రజలకు నమ్మకంగా ఉండే వారిని ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వసూళ్ల పర్వం సాగిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే మరోసారి పేదలు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. 

చట్టం ఏం చెప్తుందంటే..

ఆర్‌బీఐ 2018 నుంచి గొలుసుకట్టు వ్యాపారాన్ని పూర్తిగా నిషేధించింది. ఎవరైనా అలా చేస్తే నేరాన్ని బట్టి 10 సంవత్సరాల వరకూ జైలు శిక్ష విధించవచ్చు. ఏదైనా సంస్థ గొలుసు కట్టు వ్యాపారం కాకుండా ఎవరి నుంచైనా డిపాజిట్‌ తీసుకుంటే కంపెనీ మూలధనంలో 50 శాతం వరకూ ఆర్‌బీఐ వద్ద ఉంచాలి. పైగా డిపాజిట్లను రుణాల రూపంలో మరొకరికి ఇవ్వాలి. అంతేకాక డిపాజిట్‌దారుడి ద్వారా మరికొంత మందిని చేర్పించడం ఎట్టి పరిస్థితిల్లోనూ చేయకూడదు. కానీ ప్రస్తుతం మార్కాపురం డివిజన్‌లో ఓ సంస్థ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. గొలుసుకట్టు వ్యాపారం పేరుతో వసూళ్ల పర్వం సాగిస్తోంది. 

Read more