-
-
Home » Andhra Pradesh » Prakasam » mogligundala balancing reservoir
-
మొగిలిగుండాల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు.. శాపంగా మారిన అధికార పార్టీలోని వర్గపోరు!
ABN , First Publish Date - 2020-12-10T07:02:08+05:30 IST
మండలంలోని శివరామపురం వద్ద నిర్మించతలపెట్టిన..

పోటీపడి పోగొట్టారు!
మొగిలిగుండాల ప్రాజెక్టు నిర్మాణం ‘రివర్స్’
టీడీపీ హయాంలో ప్రారంభం.. వైసీపీ రాగానే రద్దు
ప్రక్రియ మరోసారి మొదలు
టెండర్ దక్కించుకోవడం కోసం వైసీపీ నేతల పోటీ
రివర్స్ టెండరింగ్‌లో భారీ లెస్‌కు వేయాల్సిన పరిస్థితి
పనులు ప్రారంభించని కాంట్రాక్టర్
వెంటనే మొదలుపెట్టాలని మూడుసార్లు నోటీసులు
రెండోసారి రద్దుకానున్న టెండర్..?
తాళ్లూరు(ప్రకాశం): మండలంలోని శివరామపురం వద్ద నిర్మించతలపెట్టిన మొగిలిగుండాల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు అధికార పార్టీలోని వర్గపోరు శాపంగా మారింది. గత టీడీపీ హయాంలో పురుడు పోసుకున్న ఈ ప్రాజెక్టు పనులు టెండర్ వరకూ నడిచాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి టెండర్ రద్దు చేశారు. ఆ తర్వాత మళ్లీ టెండర్ ప్రక్రియలో భాగంగా రివర్స్‌లో లెస్ అమౌంట్‌కు పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు ఎంతకీ ప్రారంభించలేదు. దీంతో మరోసారి ఈ టెండరు రద్దయినట్లు తెలుస్తోంది. వైసీపీలో రాజకీయ విభేదాల నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టుకు గ్రహణం పట్టినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
40గ్రామాలకు తాగునీరు
ప్రధానంగా నాగంబొట్లపాలెం వాగు వరదనీటిని, రామభద్రాపురం వాగును శివరామపురం వద్ద చెరువుకు మళ్లించి దాన్ని మినీ రిజర్వాయర్‌గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. విశేషంగా సాగు విస్తీర్ణం లేకపోయినా తాళ్లూరు, చీమకుర్తి, మద్దిపాడు, అద్దంకి మండలాల్లో సుమారు 40 గ్రామాలకు తాగునీరు అందించడంతోపాటు, చెరువు పరిధిలో సాగు విస్తీర్ణం 450 ఎకరాలకు పెంచాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. ఇక ఈ ప్రాంతంలో నీటిని నిల్వ ఉంచితే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి పరిసర ప్రాంతాలు సస్యశ్యామలం కావాలనే సదాశయంతో ప్రాజెక్టును రూపొందించారు.
కార్యరూపం ఇలా..
శివరామపురం వద్ద చెరువు పరిసరాల్లో 74 ఎకరాల్లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా నిర్మించనున్న ఈ ప్రాజెక్టు టీడీపీ హయాంలో పట్టాలెక్కింది. నాటి మంత్రి శిద్దా రాఘరావు భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అప్పటికి అంచనాల ప్రకారం ఆ ప్రాజెక్టుకు రూ.10.20కోట్లు కేటాయించారు. అనంతరం ఎన్నికలు రావడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటికి ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభించకపోవడంతో నాటి టెండర్ రద్దయింది. 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన టెండర్లను రద్దు చేస్తూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
మరోమారు టెండరు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి టెండర్ ప్రక్రియ తెరపైకి వచ్చింది. అన్నివర్గాల ప్రజల నుంచి కూడా ఈ ప్రాజెక్టు నిర్మించాలని బలమైన ఆకాంక్ష ఉంది. దీంతో ఈ పర్యాయం ప్రభుత్వం మళ్లీ టెండర్ పిలిచింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, వైసీపీ నేత బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వర్గీయుల మధ్య టెండర్ దక్కించుకోవడం కోసం పోటీ పెరిగింది. అధికార పార్టీకే చెందిన ఏడుగురు కాంట్రాక్టర్లు పోటీపడ్డారు. రివర్స్ టెండరింగ్‌లో ప్రాజెక్టు వ్యయం అమాంతం తగ్గింది. 30.65శాతం లెస్‌కు ఎమ్మెల్యే వర్గం మద్దతు ఉన్న కాంట్రాక్టర్ టెండర్ కోడ్ చేసి పనులు దక్కించుకున్నాడు.
ప్రారంభం కాని పనులు
ఈ రివర్స్ టెండర్‌తో ప్రభుత్వానికి ఖర్చు ఆదా అవుతున్నట్లు కనిపిస్తున్నా నేటికీ పనులు మొదలు కాలేదు. నిర్మాణ వ్యయం పెరగడంతోపాటు, నాణ్యత కూడా తగ్గే అవకాశం ఉండటం తదితర కారణాలతో ఈ పర్యాయం కాంట్రాక్టరు పనులు ప్రారంభించ లేదు. దీంతో అధికారులు ఆ కాంట్రాక్టరుకు మూడు పర్యాయాలు నోటీసులు ఇచ్చారు. అయినా స్పందన కరువైంది. ఈ నేపథ్యంలోనే అధికారపార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఒక్కొక్కరు ఒక్కో రీతిగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. మొత్తం టెండర్ ప్రకియను తిరిగి ప్రారంభించాలని ఒక నేత పట్టుబడుతున్నారు. ముందున్న కాంట్రాక్టర్ పనిచేయనందున ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి, ఆ తర్వాత కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని మరోనేత పట్టుబడుతున్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పర్యాయం కూడా టెండర్ రద్దయినట్లు తెలిసింది.
మళ్లీ ముడిపడేనా...?
రైతులకు, ప్రజలకు తాగునీటికి అవసరమైన ఈ ప్రాజెక్టు శివరామపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు వరమనే చెప్పాలి. అన్ని వేళల్లో నీరు అందుబాటులో ఉంటూ.., కుడి, ఎడమ కాలువల ద్వారా అవసరమైన చోటుకు నీరు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. నేతల మధ్య సఖ్యత, కాంట్రాక్టర్ చొరవ ఉంటే రెండేళ్లలోనే పూర్తిస్థాయిలో ప్రాజెక్టును నిర్మించవచ్చు. ప్రభుత్వం నిధులు కూడా మంజూరుచేసిన నేపథ్యంలో ఉన్నతాధికారులైన చొరవ చూపి ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
మూడు నోటీసులు ఇచ్చాం: ఎం.సుబ్బారావు, ఇరిగేషన్ ఏఈ
వెంటనే పనులు ప్రారంభించాలని టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థకు ఇప్పటికే మూడుసార్లు నోటీసులు ఇచ్చాం. కానీ వారు ఇంతవరకూ ముందుకు రాలేదు. ఈ విషయాన్ని ఇరిగేషన్ ఎస్‌ఈ దృష్టికి తీసుకెళ్లాం. పనులు రద్దు అయిన విషయం తెలియదు. అదంతా పైఅధికారులు చూస్తున్నారు.