యంత్రంతో వెనక్కి.. మనుషులతో ముందుకు

ABN , First Publish Date - 2020-12-20T06:52:53+05:30 IST

వెలిగొండ ప్రాజెక్టు ఈ పేరు చెబితే ఎవరైన అడిగే మొదటి..

యంత్రంతో వెనక్కి.. మనుషులతో ముందుకు
టీబీఎం మిషన్‌ (ఫైల్‌)

వెలుగొండ ప్రాజెక్టు పనుల్లో కీలక పరిణామం
105 మీటర్లు మాత్రమే మిగిలి ఉన్న మొదటి సొరంగం
తవ్వకంలో కీలకమైన టీబీఎం పని ముగిసినట్లే..

పెద్ద దోర్నాల(ప్రకాశం): కరువు ప్రాంతంలో కృష్ణమ్మ గలగలలు వినిపించేందుకు కొద్ది దూరమే మిగిలి ఉంది. అన్నదాతల ఆశల సౌధం పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో మొదటి దశ పనుల్లో అత్యంత కీలకమైన మొదటి సొరంగం  తవ్వకం కేవలం 105 మీటర్లు మాత్రమే మిగిలి ఉంది. మొత్తం సొరంగం 18.830 కిలో మీటర్లు  తవ్వాల్సి ఉండగా  ఇప్పటి వరకూ 17.750 కిలోమీటర్లు టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌  ద్వారా పూర్తి చేశారు. మిగిలిన కొద్ది లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో బోరింగ్‌ మిషన్‌లో తరచూ  సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఇంజనీరింగ్‌ అధికారులు ఆ కొద్ది దూరాన్ని మాన్యువల్‌గా చేస్తున్నారు. అది కూడా కొల్లంవాగు వైపు ఉన్న హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద నుంచి ప్రారంభించారు. దీంతో ఇక టీబీఎం అవసరం తీరిపోయింది. కొద్దిరోజుల్లో సొరంగం నిర్మాణం మొత్తం పూర్తికానున్నప్పటికీ అందులో ఉన్న టీబీఎం (టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌)ను బయటకు తీసుకురావడానికి మాత్రం  కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది.

వెలిగొండ ప్రాజెక్టు ఈ పేరు చెబితే ఎవరైన అడిగే మొదటి ప్రశ్న సొరంగం నిర్మాణం ఎంతవరకు వచ్చింది..? అని అయితే ప్రస్తుతం మొదటి టన్నెల్‌ పనులు దాదాపు పూర్తయ్యాయి. మరో 105మీటర్లు మాత్రమే తవ్వకం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన పనిని మాన్యువల్‌గా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించా రు. దీంతో టన్నెల్‌ 17.750 కిలోమీటర్లను తవ్విన టీబీఎం (టన్నెల్‌ బోరిం గ్‌ మిషన్‌) పని పూర్తయ్యింది. సొరంగంలో లోపల ఉన్న ఈ మిషన్‌ను ఇక శకలాలుగా బయటకు తీసుకురావడానికి అధికారులు నిర్ణయించారు.

ముగిసిన టీబీఎం పని
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సొరంగం ఏర్పాటులో టీబీఎం (టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌) కీలకమని చెప్పుకోవాలి. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రెండు సొరంగాలను సమాంతరంగా దోర్నాల మండలం కొత్తూరు వద్ద నుంచి కృష్ణా నది కొల్లంవాగు వరకు తవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో జర్మనీకి చెందిన హెచ్‌కేటీ సంస్థ నుంచి రూ.105 కోట్లతో టీబీఎంను కొనుగోలు చేసి దిగుమతి చేసుకున్నారు. ఈ టీబీఎం 128 మీటర్ల పొడవుతో 1600 టన్నుల బరువును కలిగి ఉంది. ఈ యంత్రంతో 18.83 కిలోమీటర్ల తవ్వకం చేపట్టాలని మొదట లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 2008 నుంచి ఇక్కడ టన్నెల్‌ పనులు ప్రారంభమయ్యాయి. రోజుకు 20 నుంచి 25 మీటర్ల తవ్వకం లక్ష్యంగా పనులు ప్రారంభించినా 9, 10 మీటర్లకు మించి  చేయలేకపోయారు. 16 నెలలు గడిచే సరికి నిర్మాణ పను ల్లో బురద నీరు ఉబికి వచ్చి టీబీఎం మొరాయించింది. దీంతో ఏడాదిన్నర పాటు పనులు నిలిచిపోయాయి. విదేశీ సాంకేతిక నిపుణుల బృందం వివి ధ రసాయనాలతో బురద నీటిని గట్టి పరిచి తిరిగి 16 డిసెంబరు 2011న పనులు పునఃప్రారంభించారు. అప్పటి నుంచి పనులు సాగుతూ వచ్చాయి. నాటి నుంచి 17.750 కిలోమీటర్ల తవ్వకం టీబీఎం ద్వారానే జరిగింది. 

టీబీఎంతో జరగాల్సింది ఇలా.... జరిగిందిలా...
టీబీఎం ముందుభాగాన ఉన్న హెడ్‌కు 58 కట్టర్లు ఉంటాయి. ఇవి కొండను తొలుచుకుంటూ వెళ్తాయి. ఆ వచ్చిన వ్యర్థాన్ని కన్వేయర్‌ బెల్టు ద్వారా సొరంగం బయటకు తరలిస్తారు. కొన్ని మీటర్లు పూర్తయ్యాక టన్నెల్‌లో సెగ్మెంట్లను అమరుస్తారు. సెగ్మెంట్లకు కొండకు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని సిమెంటు, ఇసుక, కంకర మిశ్రమంతో నింపుతారు. ఈ నిర్మాణంలో అరిగిపోయిన కట్టర్లను తొలగించి తిరిగి కొత్తవి అమరుస్తారు. కన్వేయర్‌ బెల్టు తెగినప్పుడు తిరిగి పునరుద్ధరిస్తారు. ఇలాగే  17.750 కిలో మీటర్ల తవ్వకం చేశారు.  సొరంగం మొత్తం పూర్తయిన తర్వాత టీబీఎంను విడిభాగాలు చేసి నదిలో నుంచి పడవల ద్వారా బయటకు తీసుకురావాలని తొలుత భావించారు. అయితే ఇప్పుడు మిషన్‌ మొరా యించింది. దీంతో మ్యాన్యువల్‌ విధానంలో చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. 

హెడ్‌ రెగ్యులేటరీ సంస్థకు సెగ్మెంట్ల పని
హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు, సొరంగం నిర్మాణం పనులు వేర్వేరు సంస్థలకు అప్పగించారు. దీంతో ఎవరికి వారు పనులు చేసుకుంటూ వెళ్లారు. ఒక వైపు ఒక సంస్థ టీబీఎం ద్వారా  సొరంగం తవ్వుకుంటూ సెగ్మెంట్లను అమర్చుతూ ముందుకు వెళ్లింది. దీంతో అనివార్యంగా ముందున్న టీబీఎం పనులు పూర్తి చేస్తేనే వెనకున్న సెగ్మెంట్లను ఏర్పాటు చేసుకుంటూ పోవాల్సి ఉంది. ఇక ముందున్న టన్నెల్‌ వ్యాసం వెనకున్న సెగ్మెంట్ల వ్యాసం కంటే ఎక్కవగా ఉంది. దీంతో టీబీఎం పని ప్రారంభించిన నాటి నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. అనివార్యంగా ముందుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం దాదాపు పనులు పూర్తయ్యాయి. మిగిలిన 105 మీటర్ల దూరాన్ని రెండో వైపు కొల్లంవాగు సమీపం నుంచి ప్రారంభిస్తున్నారు. దీంతో సెగ్మెంట్లను అమర్చే పనిని హెడ్‌రెగ్యులేటరీ నిర్మిస్తున్న సంస్థకే అప్పగించినట్లు సమాచారం. మొత్తం మీద టీబీఎం పని ఇక పూర్తిగా మిగిసినట్లే. ఈ టీబీఎంను బయటకు తీయడం పెద్ద ప్రహాసనంతో కూడుకున్న పని దీన్ని విడిభాగాలుగా మార్చి టన్నెల్‌ ద్వారా బయటకు తీసుకురానున్నారు. దీంతో దశాబ్దకాలం పాటు సొరంగం పనుల్లో పాల్గొన్న ఈ టీబీఎం శకలాలు వెనక్కు రానున్నాయి. 

Updated Date - 2020-12-20T06:52:53+05:30 IST