వైద్యవేదన

ABN , First Publish Date - 2020-11-20T04:06:51+05:30 IST

కొండపి సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ) వైద్య వేదనతో అల్లాడిపోతోంది. చిన్నా, చితకా అవసరాలనూ తీర్చుకోలేక అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో వైద్య సేవలు అందక పేద రోగులు అల్లాడిపోతున్నారు.

వైద్యవేదన
సీహెచ్‌సీలోని 30 పడకల విభాగం


సీహెచ్‌సీకి డెవల్‌పమెంట్‌ కమిటీ లేక ఇబ్బందులు

ఏడాదిన్నరగా కలెక్టర్‌ వద్ద పెండింగ్‌ 

మూడుసార్లు ప్రతిపాదనలు పంపినా నిష్ప్రయోజనం 

స్టేషనరీ, ఇతర చిన్నపాటి ఖర్చులకు డబ్బులు తీయలేని దుస్థితి

వైద్యసేవలు అందక అల్లాడుతున్న పేద రోగులు

జీతాలు ఇవ్వకపోవడంతో మానుకున్న టెంపరరీ ఉద్యోగిని 

టీడీపీ ఎమ్మెల్యే కావడంతో రాజకీయ కక్షతోనే ఏర్పాటు చేయని కమిటీ

కొండపి సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ) వైద్య వేదనతో అల్లాడిపోతోంది. చిన్నా, చితకా అవసరాలనూ తీర్చుకోలేక అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో వైద్య సేవలు అందక పేద రోగులు అల్లాడిపోతున్నారు. ప్రస్తుత కొవిడ్‌ నేపథ్యంలో వైద్యులకూ రక్షణ పనిముట్లు కొనే పరిస్థితి లేదు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర నుంచి సీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ ఏర్పాటుకి మోకాలొడ్డుతూనే ఉన్నారు. ఇప్పటికి మూడుసార్లు జిల్లా కలెక్టర్‌ వద్దకు కమిటీ ప్రతిపాదనలు వెళ్లినా వాటి ఊసే లేదు. రాజకీయ కక్షలతో కమిటీ ఏర్పాటును అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. రాజకీయ వైషమ్యాల కారణంగా సీహెచ్‌సీలో వైద్య అవసరాలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని దీనస్థితి నెలకొంది. చేసేదేమీ లేక డాక్టర్లే ప్రతి నెలా సొంత డబ్బులు వేసుకుని కొన్ని పరికరాలను కొని రోగులకు వైద్య సేవలు అందిస్తుండడం గమనార్హం.


కొండపి, నవంబరు 19 : స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఏడాదిన్నరగా హాస్పటల్‌ డెవల్‌పమెంట్‌ కమిటీని నియమించలేదు. కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఉంటారు. ఆయన ఆధ్వర్యంలోనే వైద్యశాల డ్రాయింగ్‌ ఆఫీసర్‌తోపాటు మరో ఐదారుగురు వివిధ వర్గాలకు చెందిన సామాజిక స్పృహ, సే వాభావం కలిగిన వారు కమిటీలో సభ్యులుగా ఉంటారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వైద్యశాల కమిటీలకు చైర్మన్‌లుగా ఎమ్మెల్యేలనే కొనసాగించింది. వీరి ఆధ్వర్యంలోనే వైద్యశాల డెవల్‌పమెంట్‌ కమిటీలను ఏర్పాటు చేసి అంతటా వైద్యశాలల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కొండపి వైద్యశాలకు కమిటీ ఇంతవరకు ఏర్పడలేదు. ఇప్పటికే మూడుసార్లు జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు వెళ్లాయి. కమిటీకి కలెక్టర్‌ నుంచి ఆమోదం రాలేదు. కమిటీ ఏర్పడకపోవడంతో వైద్యశాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయి. చిన్నపాటి అవసరాలనూ తీర్చుకోలేని దుస్థితిలో సిబ్బంది అల్లాడిపోతున్నారు. కొవిడ్‌ పరిస్థితుల్లో కూడా మాస్క్‌లు, ఇతర కిట్లను కూడా కొనలేని గడ్డు స్థితిలో వైద్యశాల నడుస్తోంది. డాక్టర్‌లే ప్రతి నెలా రెండు మూడు వేల రూపాయలు సొంత డబ్బులతో అవసరా లు తీర్చుకుంటున్నారు. రోజువారీ వేతనం మీద ఇద్దరు మహిళలు పనిచేస్తుండగా, వీరిలో ఒకరు ఎంతకీ జీతం రాకపోతుండటంతో ఒకరు తప్పుకున్నారు. మరో మహిళ జీతం వస్తుందన్న ఆశతో 13 నెలలుగా ఎదురు చూస్తూ పనిచేస్తోంది.

జీతం వస్తుందా అయ్యా..? 

నాకు జీతం వస్తుందా... అయ్యా..? అని వైద్యశాలలో గర్భిణులకు సాయంగా పనిచేసే రోజువారీ వేతన ఉద్యోగిని సునందమ్మ ‘ఆంధ్రజ్యోతి’ని ప్రశ్నించింది. 13 నెలలుగా జీతం రావడం లేదు. ఇక్కడే గతం నుంచి పనిచేస్తున్నా.. ఇపుడు ఎక్కడికో వెళ్లి పనిచేయలేను. అందువల్లనే జీతం వస్తుందని ఆశతో పనిచేస్తున్నా. నాతోపాటు చేరిన మహిళ మూడు నెలల క్రితం మానుకుంది. జీతం లేకుండా ఎన్నాళ్లు పనిచేస్తానని ఆమె వేరే పనికి వెళ్లింది. జీతం వస్తదని డాక్టర్లు చెబుతున్నారు. అందువల్లనే పనిచేస్తున్నా.

స్టేషనరీ కూడా లేదు

వైద్యశాలలో లక్షా ఇరవై వేల రూపాయలు ఫండ్‌ ఉన్నది. కమిటీ లేదు. అవి వాడేందుకు అవకాశం లేదు. రోజువారీ వేతనాలకు పనిచేసే ఇద్దరు మహిళలకు జీతాలతోపాటు స్టేషనరీ, రక్త పరీక్షల కెమికల్స్‌, నెట్‌ చార్జీలు, ఇతర అత్యవసర వస్తువులను ఈ నిధులతో కొనుగోలు చేసుకుని అవసరాలు తీర్చుకోవచ్చు. కమిటీ ఏర్పడని కారణంగా చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితి ఉందని సిబ్బంది తెలిపారు. కమిటీ ఏర్పడితే ప్రతి నెలా సమావేశాలతోపాటు వైద్యశాలకు అవసరమైన వసతులను కూడా దాతల సాయంతో తీర్చుకోవచ్చు. ఆ అవకాశమూ లేదు. ప్రస్తుతం రక్త పరీక్షలు చేయడానికి అవసరమైన చిన్న, చిన్న పరికరాలతోపాటు కెమికల్స్‌ లేక షుగర్‌ పరీక్షలు చేయడం లేదు. మూత్ర పరీక్షలు మాత్రమే చేస్తున్నారని, రక్తం ద్వారా పరీక్షలు చేయడం లేదని షుగర్‌ రోగులు ఆంధ్రజ్యోతికి తెలిపారు. వైద్యశాలకు కలెక్టర్‌ స్పందించి కమిటీని ఆమెదించాలని రోగులు కోరుతున్నారు.  

Updated Date - 2020-11-20T04:06:51+05:30 IST