సొంతూరికి చేర్చండి మహాప్రభో!

ABN , First Publish Date - 2020-05-08T09:32:35+05:30 IST

‘‘పొట్టకూటి కోసం ఆమాడదూరం కూలికెళ్లి ఇరుక్కుపోయిన మమ్మల్ని పట్టించుకోకపోవడంతో ఆకలితో

సొంతూరికి చేర్చండి మహాప్రభో!

తమిళనాడులోని వలస కూలీల ఆర్తనాదాలు

ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కూలీలు ఆరోపణ


పుల్లలచెరువు, మే 7 : ‘‘పొట్టకూటి కోసం ఆమాడదూరం కూలికెళ్లి ఇరుక్కుపోయిన మమ్మల్ని పట్టించుకోకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నాం. సొంతూరికి తరలించండి మహాప్రభో’’ అని తమిళనాడులో ఇరుక్కుపోయిన జిల్లాకు చెందిన కూలీలు వేడుకుంటున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సొంతూరికి రాలేక, ఉన్న చోట పనుల్లేక ఆకలికేకలు పెడుతున్నారు. పుల్లలచెరువు మండలం మల్లాపాలెం పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో 30 కుటుంబాలకు చెందిన 80 మంది గతేడాది నవంబరులో చెరుకు కోతకు తమిళనాడు రాష్ట్రంలోని తిరవళూరు జిల్లా, ఉతుకోట మండలం, వెల్లతుకోట గ్రామానికి వలస వెళ్లారు. మార్చి చివరి వారంలో పనులు ముగించుకుని సొంతూరికి చేరుకోవాల్సిన కూలీలు క రోనా లాక్‌డౌన్‌తో అక్కడే ఉండిపోయారు.


పనులు ముగిసినా అక్కడ పొ లాల్లో తాత్కాలికంగా పట్టలతో గుడారాలు వేసుకుని ఉంటున్నారు. లాక్‌డౌన్‌తో అక్కడ నిత్యావసర సరుకులు తెచ్చుకొనేందుకు కూడా వీల్లేకుండా గ్రామాల చుట్టూ కంపలు వేశారు. వీరి బాధలు ఆలకించే అధికారులూ లేరు. ఇప్పటికే పలుమార్లు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు, ఏపీ ఉన్నతాధికారులకు వివిధ రూపాల్లో తమ బాధలు చెప్పుకున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. తిండి దొరక్క చిన్నపిల్లలతో పస్తులు ఉంటున్నామని వాపోయారు.


అలాగే మరో చోట తమిళనాడులోని పుడుపతి జిల్లా కంధరకోటలో కూలి పనులకు మల్లాపాలేనికి చెందిన 7 కుటుంబాలతోపాటు ఎర్రగొండపాలెం మండలం నర్సాయిపాలేనికి చెందిన 100 కుటుంబాల వారు వెళ్లారు. వారు కూడా తమను ఇళ్లకు చేర్చాలని  వేడుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సొంతూరులో ఉన్న తమ తల్లిదండ్రలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి తమను సొంత గ్రామానికి చేర్చాలని విన్నవించుకున్నారు.


ఇళ్లకు తీసుకురావాలి..మంగినపల్లి సుధాకర్‌, ముఠామేస్త్రి, మల్లాపాలెం

మేము గతేడాది నవంబరులో తమిళనాడుకు చెరుకు కోతకు వెళ్లాం. లాక్‌డౌన్‌ వల్ల పనులు ఆపేశారు. ఉంటున్న ఊళ్ల చుట్టూ కంప వేశారు. చేతుల్లో డబ్బులు అయిపోయాయి. తిండికి ఇబ్బంది పడుతున్నాం. తమిళనాడు ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా పట్టించుకోవడంలేదు. ఆంధ్ర అధికారులకు నిరంతరం ఫోన్‌ ద్వారా తమ ఇబ్బందులను చెబుతున్నా ఎటువంటి భరోసా ఇవ్వలేదు. ప్రభుత్వం మమ్మల్ని వెంటనే ఇళ్లకు పంపించాలి.


స్వస్థలాలకు వెళ్లేందుకు అధికారుల..చుట్టూ వలస కార్మికుల ప్రదక్షిణలు 

అద్దంకి : స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కూలీలు అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఉన్న పనుల్లేక, పూట గడవక అల్లాడిపోతున్నారు. ఛత్తీ్‌సఘడ్‌కు చెందిన కూలీలు అద్దంకి మండలంలోని ధర్మవరం, మార్టూరు మండలంలోని జంగమేశ్వరపుర అగ్రహారాల వద్ద ఉన్న మెటల్‌ క్రషర్‌లలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌తో అవి మూతేశారు. స్వస్థలాలకు వెళ్లేందుకు కనికరించాలని అధికారులను వేడుకున్నారు. దీంతో గురువారం తహసీల్దార్‌ సీతారామయ్య ధర్మవరం గ్రామం వెళ్లి వివరాలు సేకరించారు. అద్దంకి ప్రాంతంలో ఇటుక బట్టీలలో పనిచేసేందుకు కాకినాడ నుంచి వచ్చిన కూలీలు తమను స్వస్థలాలకు పంపించాలని సీపీఎం నాయకులు గంగయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్‌ సీతారామయ్య, ఎస్సై మహే్‌షలను కలిశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి స్వస్థలాలకు పంపించే విధంగా కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.


నంద్యాలకు చెందిన రాఘవాచారి అద్దంకిలోని ఓ హోటల్‌లో పనిచేస్తూ ఆ సమీపంలోనే కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. రాఘవాచారి పిల్లల పుట్టెంట్రుకలు తీసే శుభకార్యం ఉండటంతో నంద్యాలకు చెందిన రెండు కుటుంబాలకు చెందిన 10 మంది బంధువులు అద్దంకి వచ్చారు. లాక్‌డౌన్‌ ప్రకటించటంతో వారు ఇక్కడే నిలిచిపోయారు. దీంతో హోటల్‌ మూసివేయటంతో పనిలేక ఉంటున్న రాఘవాచారికి 10 మంది బంధువులు రోజుల తరబడి ఉండటంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. తమను స్వస్థలాలకు పంపే ఏర్పాటు చేయాలని రాఘవాచారి బంధువులు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

Updated Date - 2020-05-08T09:32:35+05:30 IST