మార్కాపురం మున్సిపాలిటీలో పోటీనా? రాజీనా?

ABN , First Publish Date - 2020-03-15T11:21:43+05:30 IST

మార్కాపురం పురపాలక సంఘ ఎన్నికలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నాయకులు రాజీ పడ్డారని, రాజీ ఒప్పందంలో

మార్కాపురం మున్సిపాలిటీలో పోటీనా? రాజీనా?

పట్టణ నాయకులతో నేడు సమావేశం


మార్కాపురం, మార్చి 14: మార్కాపురం పురపాలక సంఘ ఎన్నికలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నాయకులు రాజీ పడ్డారని, రాజీ ఒప్పందంలో భాగంగా వైసీపీ 25 వార్డులు, టీడీపీ 10 వార్డులు పంపిణీ చేసుకుంటున్నారని ఆంధ్రజ్యోతి ప్రకాశం ఎడిషన్‌లో శనివారం కథనం ప్రచురితమైంది. ఈ విషయాన్ని ఖండిస్తూ అధికార వైసీపీ కానీ, ప్రతిపక్ష టీడీపీ కానీ ఎటువంటి ప్రకటనలు చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా నిర్వహిస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంటామని ప్రకటించడానికి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సైతం ఆ విషయాన్ని నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డి ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.


మార్కాపురం నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు టీడీపీ తరపున అభ్యర్థులు దూరంగా ఉండాలన్న నిర్ణయాన్ని నియోజకవర్గ పార్టీ అధిష్టానం శనివారం ప్రకటించింది. మరి మార్కాపురం పురపాలక సంఘ ఎన్నికల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న పట్టణంలోని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలలో తలెత్తింది. టీడీపీకి కంచుకోట అయిన మార్కాపురం పట్టణంలో నామినేషన్ల సమయంలో నాయకులు వ్యవహరించిన తీరుకు కొందరు నాయకులు, కార్యకర్తలు విస్మయం చెందారు. పార్టీ నాయకులు ఇలా చేయడం సరికాదన్న అభిప్రాయాన్ని బహిరంగంగా వెలిబుచ్చారు. మున్సిపల్‌ ఎన్నికలలో అన్నీ తానై వ్యవహరించాల్సిన వ్యక్తి అసలు నామినేషన్‌ దాఖలు చేయకపోవడానికి గల కారణాలపై రాజకీయవర్గాల్లో చర్చసాగుతోంది. 


నామినేషన్‌ దాఖలు చేయని వక్కలగడ్డ

మార్కాపురం పురపాలక సంఘం ఓసీ(జనరల్‌)కు రిజర్వయిన తర్వాత చైర్మన్‌ పదవికి బరిలో నిలిచేందుకు టీడీపీ తరపున వినిపించిన ఒకే ఒక పేరు వక్కలగడ్డ మల్లికార్జున్‌. ఆర్థిక పరమైన ఇబ్బందులు లేని వ్యక్తిగా, ఆర్యవైశ్య సామాజిక వర్గంలో ప్రముఖునిగా అతని గుర్తింపు ఉండటంతో అందరూ అతని పోటీని అంగీకరించారు. పట్టణ కార్యకర్తల సమావేశంలో అధిష్టానం నిర్ణయమే నాకు శిరోధార్యం అని వక్కలగడ్డ మల్లికార్జున్‌ ప్రకటించాడు కూడా.  మరి ఉన్నట్టుండి ఏమి జరిగిందో అతను చెప్పడం లేదు కానీ చైర్మన్‌ పదవిని చేపట్టేందుకు అవసరమైన కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు అసలు నామినేషన్‌  దాఖలు చేయలేదు. దీంతో పార్టీ తరపున పోటీ చేసేందుకు నామినేషన్‌ చేసినవారు, నాయకులు, కార్యకర్తలు విస్మయం చెందారు. అసలేం జరిగిందనే విషయంపై పట్టణంలో చర్చ జరిగింది. 


అధికారపార్టీ బెదిరింపులే కారణమా?

మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీలో దిగాలనుకున్న వ్యక్తి అసలు కౌన్సిలర్‌కు నామినేషన్‌ దాఖలు చేయకపోవడానికి అధికారపార్టీ నాయకుల బెదిరింపులే కారణమని ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు మల్లికార్జున్‌ను వైసీపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినప్పటికీ ససేమిరా అన్నాడని, చివరకు జిల్లా మంత్రులలో ఒకరు మల్లికార్జున్‌కు వ్యక్తిగతంగా ఫోన్‌లో బెదిరించారని కూడా చెబుతున్నారు. అంతేకాక గత టీడీపీ ప్రభుత్వ కాలంలో మల్లికార్జున్‌ చేసిన పనులకు సంబంధించి రూ.9 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, పోటీలో నిలుచుంటే ఒక్క రూపాయి కూడా రాదని బెదిరింపులు అందినట్లు చెబుతున్నారు. 


టీడీపీ నాయకుల్లో విస్తృత చర్చ

ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులను ప్రలోభాలకు, దౌర్జన్యాలకు, బెదిరింపులకు గురిచేస్తున్న తరుణంలో అధికారపార్టీతో రాజీ పడాలా? లేదా ఎన్నికలలో పోటీ చేయాలా? అన్న దానిని టీడీపీ నాయకులలో విస్తృత చర్చ సాగుతోంది. నామినేషన్లు దాఖలు చేసిన వారికి నచ్చ చెప్పి అధికారపార్టీ నాయకులు చేసిన రాజీ ఫార్ములా 25:10ని అంగీకరించాలా? ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో వ్యవహరించిన తీరుగా ఎన్నికలకు దూరంగా ఉండాలా? లేదా ధైర్యంగా ఎన్నికల బరిలో దిగాలా? దానికి శనివారం రాత్రి సమావేశం నిర్వహించి నిర్ణయించాలని తొలుత టీడీపీ నాయకత్వం భావించింది. కానీ అనివార్య కారణాల వలన ఈ సమావేశాన్ని ఆదివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా టీడీపీకి పట్టణంలో పూర్వ వైభవం తీసుకురావాలంటే బరిలో నిలబడాలని కార్యకర్తలు తమ వాదనను నాయకత్వానికి వినిపించడానికి సిద్ధమౌతున్నారు.


Updated Date - 2020-03-15T11:21:43+05:30 IST