మనుగడ కష్టమే..!

ABN , First Publish Date - 2020-12-28T05:03:34+05:30 IST

కేంద్రం తీసుకొచ్చిన వన్‌ నేషన్‌-వన్‌ మార్కెట్‌ చట్టం వ్యవసాయ మార్కెట్‌ యార్డుల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. ఒకప్పుడు ఆర్థిక పరిపుష్టితో కళకళలాడిన ఏఎంసీలు నేడు సిబ్బంది జీతాలకు కూడా నిధులు లేని దుస్థితిలో కొట్టుమిట్టాడే పరిస్థితిని కల్పించింది.

మనుగడ కష్టమే..!
వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఫైల్‌)

కొత్తచట్టంతో సంక్షోభంలో మార్కెట్‌ కమిటీలు

చెక్‌పోస్టుల ఎత్తివేతతో ఆదాయానికి గండి

ఏడాదికి రూ.15కోట్ల మేర నష్టం

సిబ్బంది జీతాలకే నానా అగచాట్లు


ఒంగోలు (జడ్పీ), డిసెంబరు 27 : కేంద్రం తీసుకొచ్చిన వన్‌ నేషన్‌-వన్‌ మార్కెట్‌ చట్టం వ్యవసాయ మార్కెట్‌ యార్డుల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. ఒకప్పుడు ఆర్థిక పరిపుష్టితో కళకళలాడిన ఏఎంసీలు నేడు సిబ్బంది జీతాలకు కూడా నిధులు లేని దుస్థితిలో  కొట్టుమిట్టాడే పరిస్థితిని కల్పించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యార్డులకు అనుబంధంగా ఉన్న చెక్‌పోస్టుల్ని ఎత్తివేయడంతో ఆదాయానికి భారీగా కోత పడింది. వ్యవసాయ పంట ఉత్పత్తులపై మార్కెట్‌ ఫీజు వసూళ్లతో ఏఎంసీలు నిర్వహణ కొనసాగించేవి. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రత్యక్ష కొనుగోళ్ల విధానంతో ఇక పంట ఉత్పత్తులపై ఎలాంటి ఫీజు వసూలు చేయడానికి వీలులేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఏళ్లపాటు రైతులకు సేవలందించిన మార్కెట్‌ కమిటీలు నిర్వీర్యమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి


రూ. 15 కోట్ల మేర ఆదాయానికి గండి

జిల్లాలో 15 వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పరిధిలో 33 చెక్‌పోస్టులు ఉండేవి. వీటి వద్ద వసూలు చేసే సెస్‌ రూపంలో ఏఎంసీలకు ఆదాయం సమకూరేది. ఇది సంవత్సరానికి దాదాపు రూ. 15 కోట్ల వరకూ ఉండేది. వీటితోనే సిబ్బందికి జీతభత్యాలు, రైతులకు యార్డుల్లో సదుపాయాలు కల్పించేవారు. కానీ కేంద్రం తెచ్చిన కొత్త చట్టంతో చెక్‌పోస్టులను ఎత్తివేశారు. దీంతో దాదాపు రూ. 15కోట్ల మేర ఏఎంసీల ఆదాయానికి కోత పడింది. ప్రస్తుతం ఆదాయమార్గం లేకపోవడంతో నిర్వహణ భారంగా మారిందని అధికారులు వాపోతున్నారు


వ్యాపారుల ఇష్టారాజ్యం

కొత్త విధానం వల్ల పంటల కొనుగోళ్లు, ఇతర వ్యవహారాల నుంచి మార్కెట్‌ కమిటీలు పూర్తిగా వైదొలుగుతాయి. పాన్‌కార్డు ఉన్న వ్యాపారులు దేశంలో ఎక్కడనుంచైనా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. దీంతో పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడుతుంది. అంతేకాకుండా పంటల కొనుగోళ్లపై సంబంధిత శాఖల నియంత్రణ కొరవడడం వలన వ్యాపారులకు కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రైతులను విస్తృత విపణిలోకి తేవాలన్న లక్ష్యంతో రూపొందించిన ఈ చట్టం అంతిమంగా రైతులకు నష్టం చేకూర్చి, బడా వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోందని ఇప్పటికే వివిధ రైతు సంఘాలు ఘోషిస్తున్నాయి. రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయాన్ని విస్తారం చేయడం ఎంత అవసరమో, వారు వ్యాపారుల చేతిలో దగాకు గురికాకుండా పటిష్ట కార్యాచరణ రూపొందించి చట్టంలో పొందుపరచడం కూడా అంతే అవసరం.

Updated Date - 2020-12-28T05:03:34+05:30 IST