అధికారం మనదే.. ఆక్రమించెయ్‌..!

ABN , First Publish Date - 2020-08-11T15:43:24+05:30 IST

మార్కాపురం ఇలవేల్పు శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థాన భూముల..

అధికారం మనదే.. ఆక్రమించెయ్‌..!

జోరుగా చెన్నుడి భూముల కైంకర్యం

అధికారపార్టీ అండతో రియల్టర్‌ దందా

దేవుని మాన్యంలో ఇళ్ల పాట్లు

గజం రూ.4వేల చొప్పున విక్రయాలు

అడ్డుకోవడానికి అధికారుల ససేమిరా


మార్కాపురం(ప్రకాశం): మార్కాపురం ఇలవేల్పు శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థాన భూముల కైంకర్యం కొనసాగుతోంది. గత నెలలో వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ సమీపంలో శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానానికి చెందిన భూములను ఆక్రమించి లారీ వేబ్రిడ్జి నిర్మాణం చేశారు. ఈ విషయంపై ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. అప్పట్లో హడావుడి చేసి తర్వాత వదిలేశారు దేవదాయశాఖ అధికారులు. ఇదే అదునుగా తీసుకున్న ఒక రియల్టర్‌ అధికారపార్టీ నాయకుని అండతో దేవస్థానానికి చెందిన ఎకరా భూమిని ఆక్రమించాడు. అందులో 26 ఇళ్లప్లాట్లు వేసి విక్రయిస్తున్నాడు. గజం రూ.3,500 నుంచి రూ.4వేల వరకూ విక్రయిస్తున్నాడు. ఈ అక్రమాన్ని అడ్డుకోవాల్సిన దేవాదయశాఖాధికారులు ఆ వైపునకు కూడా కన్నెత్తి చూడటం లేదు. దీనివెనక ఏదో మతలబు ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా ఉన్నతాధికారులు అడిగితే ఆపమని చెప్పామని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారే తప్ప ఆక్రమణలను అడ్డుకునేందు ఉపక్రమించడం లేదు. 


రియల్టర్‌ కన్ను

మార్కాపురం పట్టణంలోని నాగులవరం రోడ్డులో గుండ్లకమ్మ ఒడ్డున సర్వే నెంబర్‌ 273/3లో 13.38ఎకరాల సర్వీస్‌ మాన్యం ఉంది. ఈ భూమిని స్వామివారికి నిత్యపూజలు నిర్వహించే పెద్ద అర్చకత్వానికి ఇనాం భూములుగా వందల ఏళ్ల క్రితం కేటాయించారు. కాలక్రమంలో 13.38 ఎకరాలలో 9.90 ఎకరాల భూమిని రెవెన్యూశాఖ వారు దేవస్థానం వారికి నష్టపరిహారం చెల్లించి తీసుకున్నారు. 2.41 ఎకరాల భూమి గుండ్లకమ్మలో కలిసిపోయింది. ఇక మిగిలింది ఎకరా భూమి. ఆ భూమిపై పట్టణంలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో ఆరితేరిన, కులవృత్తినే ఇంటిపేరుగా మార్చుకున్న శ్రీనివాసుడు చాలా ఏళ్ల కిత్రం కన్నేశాడు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అతని ఆగడాలకు అడ్డుకట్ట పడింది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిందో లేదో తన చెన్నుడి భూఆక్రమణ పర్వానికి శ్రీకారం చుట్డాడు.


తన కుటుంబసభ్యులు గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మునిసిపల్‌ కౌన్సిలర్‌ పదవిని అలంకరించడం, నాటి నాయకుడు వెంటనే ప్రస్తుత అధికారపార్టీలోకి మారడం వంటి అంశాలు అతనికి కలిసొచ్చాయి. దీంతో ఆయన ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామికి చెందిన మాన్యం ఎకరా భూమిని చదును చేశాడు. ప్లాట్లుగా విభజిస్తూ రాళ్లను పాతాడు. ప్లాట్లను గజాల చొప్పున విక్రయిస్తున్నాడు. ఇంత జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూసే అధికారి కరువయ్యాడు. సంబంధిత అధికారి ఆక్రమణలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెబుతున్నప్పటికీ వారు సైతం దేవుని భూమి ఆక్రమణలను అడ్డుకున్న పాపానపోలేదు. దీంతో ఆ రియల్టర్‌ తాను అనుకున్న పనిని యథేచ్చగా చేసుకెళ్తున్నాడు.


ఆక్రమణ విషయమై పోలీసులకు పిర్యాదు చేశాం: ఇ.చెన్నకేశవరెడ్డి, ఈవో, శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానం

దేవస్థాన భూమి ఆక్రమణ విషయం మాకు తెలిసింది. ఈ విషయంపై వారంరోజుల క్రితమే పోలీసులకు పిర్యాదు చేశాం. దీనిపై ఉన్నతాధికారులకు కూడా నివేదించాం. దేవస్థాన భూములను కాపాడటానికి చర్యలు చేపట్టేందుకు విధానపరమైన ఆదేశాలు ఉన్నతాధికారుల నుంచి వస్తే వెంటనే అమలు చేస్తాం. 


Updated Date - 2020-08-11T15:43:24+05:30 IST