-
-
Home » Andhra Pradesh » Prakasam » lokesh toor
-
అన్నదాతలకు ఏదీ భరోసా ?
ABN , First Publish Date - 2020-12-06T05:40:55+05:30 IST
భారీ వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న అన్నదాతలకు భరోసా కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
కారంచేడు, పర్చూరు ప్రాంతాల్లో నష్టపోయిన పంటల పరిశీలన
రైతులతో ముఖాముఖి
కారంచేడు, పర్చూరు, డిసెంబరు 5 : భారీ వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న అన్నదాతలకు భరోసా కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. నివర్ తుఫాన్ వల్ల పంట నష్టం వాటిల్లిన బాపట్ల పార్లమెంట్ పరిధిలోని పంట పొలాలను ఏలూరితో కలసి లోకేష్ శనివారం పరిశీలించారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కారంచేడు వస్తూ మార్గమధ్యంలో రొంపేపు కాలువ వద్దకు చేరుకోగా పెద్ద ఎత్తున రైతులు చేరి రొంపేరులో గుర్రపు డెక్క పెరిగిపోవటం వల్లే సమీప ప్రాంతాల్లోని వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయని లోకేష్ వద్ద మొరపెట్టుకున్నారు. కాలువలను అభివృద్ధి చేయకపోగా కనీసం గుర్రపు డెక్కను తొలగించటంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు వాపోయారు. కారంచేడు చేరుకున్న లోకేష్, ఏలూరికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని ప్రధాన కూడలిలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఓరైతు లోకేష్ వద్ద తన ఆవేదను వ్యక్తం చేశారు. 352 రోజులుగా ఆందోళన బాటపట్టిన అమరావతి రైతులనే పట్టించుకోని ముఖ్యమంత్రి ఐదు రోజులు తుఫాన్‌తో పంటలు నష్టపోయి విలపిస్తున్న రైతులను ఏవిధంగా పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు. లోకేష్ మాట్లాడుతూ బాపట్ల నియోజవర్గంతో పాటు, పర్చూరు నియోజకవర్గంలో తాను స్వయంగా పంటలను పరిశీలించానని, లక్షల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతులను ఆదుకోలేని ప్రభు త్వం వ్యవసాయ పంపుసెట్లకు మోటార్లను ఏర్పాటు చేస్తామనటంలో ఆంతర్యం ఏమిటన్నారు.
అనంతరం స్వర్ణ గ్రామానికి చేరుకుని గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అలాగే లక్ష్మీదేవమ్మ కుంట సమీపంలోని నాలుగురోడ్ల కూడలి వద్ద దెబ్బతిన్న మిరప పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం తిమిడితపాడు మీదుగా పోతినివారిపాలెం చేరుకొని పంటలను పరిశీలించారు. దగ్గుబాడు మీదుగా ఇంకొల్లు రోడ్డులోని మిరప, పొగాకు, పత్తి తదితర పంటలను పరిశీలించారు. పర్చూరు మీదుగా అన్నంబొట్లవారిపాలెం చేరుకున్నారు. ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళిఅర్పించారు. అనంతరం పొగాకు రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి చిలకలూరిపేట వెళ్లారు.
