పెనం నుంచి పొయ్యిలోకి.....

ABN , First Publish Date - 2020-06-23T11:01:23+05:30 IST

లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం జిల్లా ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి పడినట్లైయింది.

పెనం నుంచి పొయ్యిలోకి.....

 లాక్‌డౌన్‌కు 90 రోజులు పూర్తి

 ఒడిదొడుకుల్లోనే జనజీవనం

కోలుకోని వ్యాపార,పారిశ్రామిక రంగాలు

సడలింపులతో కరోనా ఉధృతి

 ఒంగోలు, చీరాలపై తీవ్రప్రభావం


ఒంగోలు, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) : లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం జిల్లా ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి పడినట్లైయింది. ఆయా వర్గాల ప్రజలకు సడలింపుల ఫలితాలు అందడం అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. కరోనా నివారణ కోసం కేంద్రం చేపట్టిన లాక్‌డౌన్‌కు 90 రోజులు పూర్తి కాగా, దానినుంచి పలురంగాలకు సడలింపులు ఇచ్చి 20 రోజులకు పైగా అవుతున్నది. అయినప్పటికీ జిల్లాలో వాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు ఏమాత్రం పుంజుకున్న దాఖలాలు లేవు. దీనికితోడు కరోనా ఉధృతంగా వ్యాప్తి చెందుతున్నది. 


  కరోనా నివారణ కోసం కేంద్రప్రభుత్వం మార్చి 25నుంచి లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. దాదాపు రెండున్నర మాసాలపాటు అత్యధిక శాతం ప్రజలు స్వీయనియంత్రణ పాటించి ఇళ్లకే పరిమితమయ్యారు. అలా జిల్లాలో కరోనావ్యాప్తిని కట్టడిచేయడంలో భాగస్వాములు అయ్యారు. జిల్లాలో మే ఆఖరువరకు కరోనా కేసులు 80 మాత్రమే నమోదయ్యాయి.ఈనెల 1నుంచి కొంతమేర సడలింపులను ప్రభుత్వం ఇచ్చింది. దీంతో సాధారణ జీవనంలోకి తిరిగి వస్తున్నామని అన్నివర్గాల ప్రజలు భావించారు. అన్నీ రంగాలు కుదుట పడుతున్నట్లు కనిపిస్తున్న తరుణంలో జిల్లాలో మరోసారి కరోనా విజృంభించింది. లాక్‌డౌన్‌ సడలింపులతో జిల్లాలోకి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు పెరగడంతో వైరస్‌ వ్యాప్తి ఉధృతమైంది.


ఈరెండు వారాలలోనే దాదాపు 225కు పైగా కేసులు రాగా ఒంగోలు, చీరాలలో అధికంగా వచ్చాయి. ఇప్పటి వరకు ఒక్క కేసుకూడా లేదనుకున్న గిద్దలూరులోనూ ఆదివారం ఒకకేసు నమోదైంది. దీంతో మళ్లీ జిల్లాలో లాక్‌డౌన్‌ విధించాల్చిన పరిస్థితి ఏర్పడింది. తదనుగుణ చర్యలను తీసుకున్న అధికారులు ఒంగోలు,చీరాలల్లో పూర్తిగా ఇతర ప్రాంతాలలో కేసులున్న ఏరియాలలో లాక్‌డౌన్‌ ఆంక్షలను విధించారు. ప్రత్యేకించి జిల్లా కేంద్రమైన ఒంగోలులో రెండు వారాలు లాక్‌డౌన్‌ విధించి అమలు చేపట్టడంతో అన్ని రంగాలు స్తంభించిపోయాయి. ఆ ప్రభావం జిల్లా మొత్తంపై కనిపిస్తున్నది. చీరాలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నిత్యం కేసులు వస్తుండటంతో ఆంక్షలు కఠినం చేశారు. సోమవారం పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో మళ్లీ కేసుల వల్ల అన్నివర్గాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 


జనతా కర్ఫ్యూ సంపూర్ణం

చీరాల : కరోనా కట్టడిలో భాగంగా చీరాలలో సోమవారం అమలు చేసిన జనతా కర్ఫ్యూను ప్రజలు సంపూర్ణంగా పాటించారు. పోలీస్‌, మున్సిపల్‌, రెవెన్యూ అధికారుల సూచనల మేరకు అన్ని వర్గాల ప్రజలు సహకరించారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కన్పించాయి. సోమవారం ఒక్క దుకాణం కూడా తెరుచుకోలేదు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 9 వరకు నిత్యావసరాలు, మెడికల్‌ దుకాణాలు తెరుచుకోవచ్చని అధికారులు తెలిపారు.  

Updated Date - 2020-06-23T11:01:23+05:30 IST