గంపులు...గుంపులు..!

ABN , First Publish Date - 2020-04-05T10:02:25+05:30 IST

అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు నిబంధనలను పట్టించుకోవడం లేదు.

గంపులు...గుంపులు..!

సాయం పంపిణీ పేరుతో నేతలు పర్యటనలు

పలుచోట్ల ఎన్నికల ప్రచారం కూడా

భౌతిక దూరానికి తిలోదకాలు

వైరస్‌ విస్తరిస్తున్న పట్టించుకొని వైనం

అధికారుల్లోనూ అజాగ్రత్త


అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు నిబంధనలను పట్టించుకోవడం లేదు. జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతూ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న వేళ ప్రజలను మరింత అప్రమత్తం చేయాల్సిన వారే అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. తమ వెంట గుంపులుగుంపులు జనాన్ని వేసుకొని వెళ్ళి ప్రభుత్వ సాయం, వ్యక్తులు అందించే సాయం పంపిణీ పేరుతో పలువురు అధికారపార్టీ నేతలు జనంలోకి వెళ్తున్నారు.


‘స్థానికం’ అభ్యర్థులు సాయాన్ని పంపిణీ చేస్తున్నారు. నగదు ఇస్తున్నది ప్రభుత్వపరంగానే అయినప్పటికి కొందరు ఆ మొత్తాలను తమ చేతలు మీదుగా అందిస్తూ తామే ఇస్తున్నంతగా ప్రచారం చేసుకోవడం కనిపించింది. భౌతిక దూరం పాటించడం లేదు. ఆపద, విపత్కాల సమయాల్లో ఏ రూపంలో అయినా ప్రజల మధ్య అలా నిలవడం అభినందించదగిన విషయమే.. కానీ ప్రస్తుతం వచ్చిన కరోనా నివారణ చర్యలకు అలా జనంలో తిరగడం పూర్తి విరుద్ధం. జనమంతా లాక్‌డౌన్‌ను పాటిస్తుండగా వీరు మాత్రం ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఒంగోలు, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): నిబంధనలు ప్రజలకే.. మాకు కాదన్నట్లు ప్రవర్తిస్తున్నారు కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అమలు ఉండటంతో జనం బయటకు రావడం లేదు. అయితే అధికారపార్టీ నేతలు, అధికారులు గుంపులుగుంపులుగా తిరుగుతూ ప్రజల మధ్యకు వెళ్లి యథేచ్ఛగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కనీసం భౌతిక దూరం కూడా పాటించడం లేదు. ప్రజలంతా గుమికూడిన, కలిసిమెలసి తిరిగితే అందులో ఒకరికి వైరస్‌ ఉన్న అందరికి అంటుకునే ప్రమాదం ఉంది.


అందుకోసం సామూహిక జనసంచార నిషేధాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నాయి. ప్రజలంతా రోజులు తరబడి స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్ళకే పరిమితం అవుతుండగా నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో శనివారం పలు ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించింది. 


సాయం పంపిణీ పేరుతో..

కరోనా వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ ఇబ్బందిపడే పేదలకు ఊరట కోసం ప్రభుత్వం ఆర్థికసాయం ప్రకటించిన విషయం విదితమే. కేంద్రం ప్రకటించిన ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమచేస్తుండగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన తెల్లరేషన్‌ కార్డుదారునికి రూ.వెయ్యి నగదు సాయం శనివారం చేపట్టారు. గ్రామ, వార్డు వలంటీర్లు ఇళ్లకు వెళ్ళి ఆ మొత్తాలను పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. అయితే కొన్నిచోట్ల అందుకు విరుద్ధంగా పలువురు కీలక ప్రజాప్రతినిధులు, మరికొన్ని చోట్ల ప్రభుత్వ పరంగా ఎలాంటి అధికారిక బాధ్యత, హోదా లేకపోయినా కేవలం అధికారపార్టీ నేతలుగా ఉండటమే అర్హతగా వీటి పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 


బహిరంగంగా తిరగకూడదు

సాయం పంపిణీ సందర్భంగా వారి వెంట పెద్దసంఖ్యలో ఆయా ప్రాంతాల స్థానిక అధికారపార్టీ ముఖ్యనేతలు, ఆయా గ్రామాల్లోని పార్టీ కార్యకర్తలు మరికొన్నిచోట్ల అధికారులు కూడా పాల్గొన్నారు. అలా గుంపులుగుంపులుగా జనంతో నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణా చర్యలలో వ్యాధి లక్షణాలు ఉన్నవారిని, వారు కలిసిన ఇతరులను క్వారంటైన్‌లకు తరలించడం ఎంత ముఖ్యమమో, ప్రజలు బహిరంగంగా తిరగకుండా ఉండటం కూడా అంతేముఖ్యం. అందుకే లాక్‌డౌన్‌ అమలు చేస్తూ ప్రజలను నియంత్రిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని వచ్చినా కనీసం ఒక మీటరు భౌతికదూరం ఉండాలని ప్రభుత్వం అదేశించింది. కూరగాయాల కొనుగోలు, మెడికల్‌ షాపులు, నిత్యవసర దుకాణాలు, రేషన్‌ పంపిణీ వద్ద కూడా అలా అమలు చేస్తున్నారు. 


భౌతిక దూరం పాటించం

జిల్లాలో శనివారం జరిగిన నగదు పంపిణీ, ఇతర సహాయక చర్యలలో కీలక ప్రజాప్రతినిధులు అధికారపార్టీ నేతలు పాల్గొన్న చోట భౌతిక దూరం పాటింపునకు తిలోదకాలు ఇచ్చారు. ఎక్కడ నేతలు ఆ విషయం గురించి పట్టించుకున్న దాఖాలాలు లేకపోగా వారున్న చోట గుంపులుగుంపులు జనం కనిపించారు. మరోవైపు పలుచోట్ల మునిసిపల్‌ కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు పోటీలో ఉన్నవారు ఏకంగా నగదు సాయం అలాగే మాస్కులు, శానిటైజర్లు పంపిణీ ప్రక్రియను ఏకంగా తమ ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారు. నగదు ఇస్తున్నది ప్రభుత్వ పరంగానే అయినప్పటికి జిల్లాలోని కొన్నిచోట్ల అధికార పార్టీ నేతలు ఆ మొత్తాలను తమ చేతలు మీదుగా అందిస్తూ తామే ఇస్తున్నంతగా ప్రచారం చేసుకోవడం కనిపించింది.


మరోవైపు భౌతిక దూరం పాటింపు విషయంలో బాధ్యతగల అధికార యంత్రాంగం కూడా నిర్లక్ష్యంగానే ఉంటున్నది. ఒంగోలు ప్రకాశం భవన్‌ అవరణలో శనివారం గుంపులు, గుంపులుగా అభ్యర్థులు కనిపించడం అందుకు నిదర్శనం. కరోనా నివారణా చర్యల కోసం అత్యవసరంగా ఏఎన్‌ఎంలు, జీఎన్‌ఎం పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. వాటి కోసం వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది ప్రకాశం భవన్‌లోని స్పందన భవన్‌ వద్దకు రాగా అక్కడ అధికారులు కనీస ముందస్తు చర్యలు చేపట్టలేదు. దీంతో ఆ భవనం వద్ద వారంతా గంటల తరబడి తిరగడం కనిపించాయి. 

Updated Date - 2020-04-05T10:02:25+05:30 IST