కార్డుదారులకు ఊరట
ABN , First Publish Date - 2020-04-01T10:15:00+05:30 IST
జిల్లాలో రేషన్ కష్టాల తీరనున్నాయి. సరుకుల పంపిణీకి సడలింపు ఇస్తూ సర్కారు నిర్ణయం తీసుకొంది.

రేషన్ కష్టాల నుంచి విముక్తి
బయోమెట్రిక్‌కు సడలింపు ఇచ్చిన కమిషనర్
మంగళవారం కూడా పనిచేయని సర్వర్
భౌతికదూరం పాటింపు నిల్
ఒంగోలు (కలెక్టరేట్), మార్చి 31: జిల్లాలో రేషన్ కష్టాల తీరనున్నాయి. సరుకుల పంపిణీకి సడలింపు ఇస్తూ సర్కారు నిర్ణయం తీసుకొంది. మూడోరోజైన మంగళవారం కూడా సర్వర్ పనిచేయక కార్డుదారులకు రేషన్ అందని పరిస్థితి ఏర్పడింది. దీనిపై స్పందించిన పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్డును బయోమెట్రిక్ మిషన్‌లో పరిశీలించి అది ఉన్నట్లు చూపిస్తే వెంటనే రేషన్ ఇచ్చి పంపాలని ఆదేశించారు. ఆమేరకు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో మంగళవారం ఉదయం 11గంటల నుంచి కార్డుదారులకు రేషన్ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేశారు. కార్డుదారుడికి రేషన్ ఇచ్చిన అనంతరం ఆ దుకాణం వద్ద నియమించిన ప్రభుత్వ ఉద్యోగి ఆ కార్డుదారుని బదులు బయోమెట్రిక్ పనిచేసే సమయంలో వేలిముద్రను వేయనున్నారు.
భౌతిక దూరం పాటించని వైనం
రేషన్‌షాపుల వద్ద భౌతికదూరం పాటించని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఒకవైపు భౌతిక దూరం పాటించాలని చెప్తున్నా అచరణలో అమలు కావడం లేదనేందుకు రేషన్ షాపుల వద్ద గుంపులు, గుంపులుగా చేరడమే నిదర్శనం. ఆదివారం నుంచి రేషన్ పంపిణీ జరుగుతుందని ముందుగా తెలిసినా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో రేషన్ షాపుల వద్ద బాక్సులు వేయగా, కొన్ని చోట్ల అసలు కన్పించలేదు.
రేషన్ షాపులను పరిశీలించిన మంత్రి బాలినేని
ఒంగోలులో రేషన్ పంపిణీని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. మంగళవారం ఉదయం సత్యనారాయణపురంలోని రెండు రేషన్ షాపులను ఆయన సందర్శించారు. అప్పటికే అక్కడ భారీగా ప్రజానీకం క్యూలో నిలబడ్డారు. బయోమెట్రిక్ మిషన్ పనిచేయకపోవడాన్ని ఆయన గమనించారు. కార్డుదారులతో మాట్లాడారు. రెండురోజుల నుంచి వస్తున్నామని, మిషన్ పనిచేయడం లేదని చెప్తున్నారని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డి, ఎంఈ సుందరరామిరెడ్డి, వైసీపీ నగర కమిటీ అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు ఉన్నారు.