భూముల సమగ్ర సర్వేకు శ్రీకారం

ABN , First Publish Date - 2020-12-11T05:03:12+05:30 IST

జిల్లాలో భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రప్రభుత్వ విభాగమైన సర్వే ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో 324గ్రామాల్లో వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష పథకాన్ని అమలు చేయనున్నారు.

భూముల సమగ్ర సర్వేకు శ్రీకారం
డ్రోన్లతో చేస్తున్న సర్వే (ఫైల్‌)

జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో 324 గ్రామాల్లో సర్వే

ఈనెల 21న మూడు గ్రామాల్లో ప్రారంభించనున్న ప్రక్రియ

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 10: జిల్లాలో భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రప్రభుత్వ విభాగమైన సర్వే ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో 324గ్రామాల్లో వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష పథకాన్ని అమలు చేయనున్నారు. ఈనెల 21న ఈ పథకాన్ని సీఎం ప్రారంభించనుండటంతో అందుకు అనుగుణంగా జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లల్లో ఒక్కొక్క గ్రామంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒంగోలు డివిజన్‌లో మల్లేశ్వరపురం, కందుకూరు డివిజన్‌లో కండి కందుకూరు, మార్కాపురం డివిజన్‌లో శివరాంపురం గ్రామాల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అందుకు అనుగుణంగా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. 

జనవరి 1 నుంచి మండలంలో ఒక గ్రామంలో ప్రారంభం

జిల్లాలో 56 మండలాలు ఉండగా ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామంలో జనవరి 1 నుంచి ఈ సర్వే ప్రారంభించనున్నారు. ఆ విధంగా జిల్లావ్యాప్తంగా భూ సర్వే చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై సీఎం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు ఆదేశాలిచ్చారు. ముందుగా డ్రోన్‌ కెమెరాల సహకారంతో శాటిలైట్‌ సర్వే చేస్తారు. ఆ తర్వాత ఒక మ్యాపును తయారు చేసి ఆ గ్రామంలోని భూములను రీసర్వే చేస్తారు. ఆ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు.

రేపు తహసీల్దార్లు, సర్వేయర్లతో కలెక్టర్‌ సమావేశం

ఈనెల 21న జిల్లాలో లాంఛనంగా సమగ్ర భూసర్వే ప్రారంభం కానుండటంతో క్షేత్రస్థాయి అధికారులతో కలెక్టర్‌ పోలా భాస్కర్‌ శనివారం ఒంగోలులో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆయా గ్రామాల్లో సర్వే నిర్వహించే విధానంపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. 


Updated Date - 2020-12-11T05:03:12+05:30 IST