భూ బకాసురులు

ABN , First Publish Date - 2020-11-25T06:13:25+05:30 IST

అద్దంకిలో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.

భూ బకాసురులు
నామ్‌ రోడ్డు వెంబడి ఆక్రమించి చదును చేసిన భూమి

యథేచ్ఛగా అమ్మకాలు 

పట్టించుకోని అధికారులు 

అద్దంకి : అద్దంకిలో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌ నగర్‌, ఊరచెరువు తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్రభుత్వ భూముల్లో పాగా వేసి అమ్మమకున్న వారు ఇప్పుడు ఏకంగా నామ్‌ రోడ్డు వెంబడి ఉన్న విలు వైన ప్రభుత్వ స్థలాలపై కన్నేశారు. అధికారం ఎటు ఉంటే అటు కండువా లు మార్చి తమ భూదందాను కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో ఇప్పటికే పలువురు పేదలు ఊరచెరువులో కొనుగోలు చేసి నిండా మునిగారు. తాజాగా నామ్‌ రోడ్డు వెంబడి ఉన్న ప్రభుత్వ స్థలాలను విక్రయాల కు పెట్టారు. నామ్‌ రోడ్డుకు తూర్పు వైపున దాల్‌మిల్లుకు సమీ పంలో రెండు విభాగాలుగా  38 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. ప్రస్తుతం మార్కెట్‌ ధర ప్రకారం సెంటు రూ.4లక్షల పైనే ఉంది. ఈ భూమిలో గతంలో రెండున్నర సెంట్ల చొప్పున ముగ్గురు వ్యక్తు లకు పట్టాలు ఇచ్చారు. సుమారు మరో 30సెంట్ల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. ఇప్పటి వరకు చెట్లతో నిండి ఉన్న ప్రభుత్వ  భూమిని గత రెండు రోజులుగా ఆక్రమణదారులు చదును చేయిస్తున్నారు. ఇప్పటికే అమ్మకాలు  ప్రారంభించినట్లు తెలుస్తోంది. 


టైలర్స్‌ కాలనీలోనూ..

టైలర్స్‌ కాలనీలో సుమారు రెండు దశాబ్దాల క్రితం అప్పట్లో పనిచేసిన రెవె న్యూ ఉద్యోగులు ఇళ్ల స్థలాలు తీసుకున్నారు. అప్పట్లో ఇళ్ల స్థలాలు పొందిన ఉద్యోగులు ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో స్థిరపడటంతో ఆ స్థలాలపై భూ బకాసురులు కన్నేశారు. ఏకంగా నకిలీ  పట్టాలు సృష్టించి వేరే వ్యక్తుల కు అమ్మకాలు చేశారు. ఈక్రమంలో ఇప్పటికే ఇళ్ల నిర్మాణానికి కూడా సిద్ధమయ్యారు. ఇది చాలదన్నట్లు వాగును అభివృద్ధి చేసి ఏర్పాటు చేసిన కట్టలను కూడా చదును చేసి అమ్మకాలకు సిద్ధం చేశారు. అడ్డుకోవాల్సిన అధికారులు ఆవైపు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.  దీనిపై తహసీల్దార్‌ ప్రభాకరరావు ను వివరణ కోరగా నామ్‌రోడ్డులో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి ఆక్రమణలకు గుర వుతుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. Updated Date - 2020-11-25T06:13:25+05:30 IST