కోయంబేడు టు క్వారంటైన్‌

ABN , First Publish Date - 2020-05-13T10:50:10+05:30 IST

కరోనా కేసులకు కేంద్రమైన చెన్త్నెలోని కోయంబేడు మార్కెట్‌కు పోయిన వారిని గుర్తించి క్వారెంటైన్‌కు

కోయంబేడు టు క్వారంటైన్‌

100మందిని గుర్తించిన వైద్యఆరోగ్యశాఖ

క్వారంటైన్‌కు తరలింపు

జిల్లాలో కొత్తగా నమోదు కాని కేసులు

గమళ్ళపాలెం, కొలచనకోట వాసులకు నెగిటివ్‌


ఒంగోలు నగరం, మే 12: కరోనా కేసులకు కేంద్రమైన చెన్త్నెలోని కోయంబేడు మార్కెట్‌కు పోయిన వారిని గుర్తించి క్వారెంటైన్‌కు పంపించే పనిలో పడ్డారు వైద్యఆరోగ్యశాఖ అధికారులు. చెన్త్నెలో పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన కోయంబేడుకు జిల్లాలోని పలుప్రాంతాల నుంచి వ్యాపారులు పోతుంటారు. జిల్లా నుంచి బత్తాయిలు, జామ, సపోటాలు వంటి వాటిని నిత్యం ఈ ప్రాంతం నుంచి వాహనాల్లో తరలిస్తుంటారు. అయితే కోయంబేడు మార్కెట్‌ కేంద్రంగా కరోనా వ్యాపించింది. ఈ కేంద్రంగానే చెన్త్నెలో కేసులు ఇబ్బందిముబ్బడిగా నమోదయ్యాయి. అయితే మన జిల్లా నుంచి కూడా ఎక్కువమంది ఈ ప్రాంతానికి వెళ్లి వచ్చినట్లు వైద్యఆరోగ్యశాఖకు సమాచారం అందింది. 


దీంతో అధికారులు విచారణ ప్రారంభించారు. కనిగిరి, హెచ్‌ఎంపాడు, మద్దిపాడు తదితర ప్రాంతాల నుంచి లారీడ్రైవర్లు, క్లీనర్లు, వ్యాపారులు కోయంబేడు పోయి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వీరందరినీ క్వారంటైన్‌కు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 100మందిని గుర్తించి వారిలో 78మందిని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌లకు తరలించారు. మిగిలిన వారిని కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరందరికీ ముందు ట్రూనాట్‌పై పరీక్షలు చేయాలని నిర్ణయించారు. బుధవారం నుంచి వీరికి పరీక్షలు చేయనున్నారు ట్రూనాట్‌పై పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి మరోసారి వీఆర్‌డీఎల్‌ మీద పరీక్షలు చేసేందుకు నిర్ణయించారు. 


ఆ రెండూ నెగటివ్‌లే

మూడు రోజుల క్రితం ట్రూనాట్‌ మిషన్‌పై పాజిటివ్‌ కేసులుగా నమోదైన కొత్తపట్నం మండలం గమళ్ళపాలెం, మద్దిపాడు మండలం కొలచనకోటకు చెందిన రెండు కేసులు వీఆర్‌డీఎల్‌పై నెగటివ్‌గా తేలాయి. కొలచనకోటకుచెందిన కేసులు రెండురోజుల క్రితమే నెగటివ్‌గా తేలగా గమళ్ళపాలెం కేసు బుధవారం మధ్యాహ్నానికి వీఆర్‌డీఎల్‌ పరీక్షల్లో నెగటివ్‌ రిపోర్టులు వచ్చాయి. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2020-05-13T10:50:10+05:30 IST