కొండపి వైసీపీలో ముదిరిన ముసలం
ABN , First Publish Date - 2020-10-08T17:35:09+05:30 IST
కొండపి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీలో ముసలం ముదిరింది. మండలం నుంచి గ్రామ స్థాయి వరకూ..

మండలాలు, గ్రామాల్లో గ్రూపులుగా విడిపోయిన నేతలు
నియోజకవర్గ ఇన్‌చార్జి వెంకయ్యపై మంత్రి బాలినేని, వేమిరెడ్డికి అసమ్మతి నేతల ఫిర్యాదులు
కొన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యం లేదంటూ ఆరోపణలు
బాలినేనిని కలిసిన వెంకయ్య
కొందరి నేతల కుట్ర అని వివరణ
ఆంధ్రజ్యోతి, ఒంగోలు: కొండపి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీలో ముసలం ముదిరింది. మండలం నుంచి గ్రామ స్థాయి వరకూ పార్టీ నాయకులు రెండు, మూడు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. పలుచోట్ల పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ వెంకయ్య అనుకూల, వ్యతిరేక వర్గాలుగా నాయకులు చీలిపోయారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌చార్జి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిలకు ఆయా మండలాల నాయకులు ఫిర్యాదులపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో మంత్రి బాలినేని ఆ నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో మంత్రి బాలినేనిని డాక్టర్ వెంకయ్య కలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
వైసీపీ కొండపి నియోజకవర్గ నాయకుల్లో గత సాధారణ ఎన్నికలకు ముందే వర్గ విభేదాలు పొడచూపాయి. అప్పట్లో పార్టీ ఇన్‌చార్జి అశోక్‌కుమార్ వ్యతిరేక, అనుకూల వర్గాలుగా పార్టీ నేతలు విడిపోయారు. వివిధ పరిణామాల నేపథ్యంలో అశోక్ కుమార్‌ని తప్పించి చివర్లో వెంకయ్యను రంగంలోకి తీసుకొచ్చి పార్టీ టిక్కెట్ ఇచ్చారు. ఓటమి అనంతరం వెంకయ్యను పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగించారు. అనంతరం ఆయనకు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పదవిని కూడా అప్పగించారు. అయితే క్రమేపీ నియోజకవర్గ నేతల్లో తిరిగి గ్రూపు రాజకీయాలు మొగ్గ తొడిగాయి. నాలుగైదు నెలల వ్యవధిలోనే అది తార స్థాయికి చేరింది. ప్రస్తుతం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఆ ప్రభావం గ్రామస్థాయికి చేరింది. పార్టీ ఇన్‌చార్జి వెంకయ్య అనుకూల, వ్యతిరేక వర్గాలుగా మారిపోయాయి. ఎన్నికలకు ముందు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న డాక్టర్ అశోక్‌కుమార్ మద్దతుదారులు ఎన్నికల్లో సక్రమంగా సహకరించలేదన్న అపోహ వెంకయ్యలో ఉందన్న ప్రచారం కూడా లేకపోలేదు. క్రమేపీ అలాంటి వారందరినీ పక్కనబెడుతున్నారన్న విమర్శలొచ్చాయి. ఇంకోవైపు తనకు పూర్తి స్థాయిలో సహకరించిన కొందరు నేతల విషయంలోనూ వెంకయ్య గొంతులో మార్పు వచ్చిందన్న ప్రచారం జరిగింది.
వెంకయ్యపై వేమిరెడ్డికి ఫిర్యాదు
కొండపి మండలంలో కె. ఉప్పలపాడుకి చెందిన పిచ్చిరెడ్డి, అలాగే వెంకటాద్రిరెడ్డి తదితర నాయకుల సారథ్యంలో పలు గ్రామాల వారు ఒక గ్రూపుగా ఏర్పడి వెంకయ్య విధానాలను నిరసిస్తూ పనిచేయటం ప్రారంభించారు. వీరంతా పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని కలిసి వెంకయ్యపై ఫిర్యాదులు చేశారు. ప్రత్యేకించి పార్టీకి ఆయువుపట్టుగా ఉన్న ఒక సామాజికవర్గం వారిని దూరం పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. మర్రిపూడి మండలంలో వాకా వెంకటరెడ్డి, రమణారెడ్డి, నాగయ్య తదితరుల సారథ్యంలో ఒకవర్గం.. విజయభాస్కర రెడ్డి, మల్లికార్జునరావుల సారథ్యంలో మరోవర్గం ఏర్పడింది. విజయభాస్కర రెడ్డి ఇటీవల గ్రామగ్రామానా పర్యటించి వెంకయ్యకు వ్యతిరేకంగా నాయకులను సమన్వయం చేసే కార్యక్రమం నిర్వహించారు. తొలి నుంచీ పార్టీలో ఉన్న వారికి వ్యతిరేకంగా వెంకయ్య పనిచేస్తున్నాడంటూ మంత్రి బాలినేనిని కలిసి ఫిర్యాదులు చేశారు. రెండో వర్గం వారు వెంకయ్యకు అనుకూలంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.
పొన్నలూరులో విడివిడిగా కార్యక్రమాలు
మండల కేంద్రమైన పొన్నలూరులో ఒకవైపు మాజీ సర్పంచ్ ప్రసాదు, మరో వైపు పార్టీ మండల మాజీ కన్వీనర్ బెజవాడ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్యక్రమాలు విడివిడిగా నిర్వహిస్తున్నారు. జరుగుమల్లి మండలంలో పార్టీ నాయకుల మధ్య విభేదాల వ్యవహారం గుంభనంగా సాగుతోంది. సింగరాయకొండ మండలంలో ఇటీవల వర్గపోరు పెరిగిపోయింది. సింగరాయకొండ మండల పార్టీ కన్వీనర్ తాండ్ర రామమూర్తి, చిమటా శ్రీను, మాదాల శంకర్, సామంతుల రవికుమార్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఓ వర్గం వెంకయ్యకు వ్యతిరేకంగా పనిచేస్తోంది.
ఓర్పు, నేర్పు అవసరం
డాక్టర్ వెంకయ్య చెప్పిన విషయాలన్నింటినీ విన్న మంత్రి బాలినేని రాజకీయాల్లో ఓర్పు, నేర్పు అవసరమని తొందరపడి మాట్లాడటం ప్రమాదకరమని అన్నట్లు తెలిసింది. కిందిస్థాయి నేతలను సమన్వయం చేసుకోవటం, సామాజిక వర్గాలకు అతీతంగా పనిచేయటం ముఖ్యమని కూడా బాలినేని సూచించినట్లు సమాచారం. కొండపి సమస్య ముఖ్యమంత్రి జగన్ దృష్టికి కూడా వెళ్లిందని ఎ లాంటి నిర్ణయం తీసుకున్నా వాటిని అమలు చేయటమే మా బాధ్యత అని కూడా చెప్పినట్లు తెలిసింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇటు పీడీసీసీ బ్యాంకు, అటు నియోజకవర్గ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించాలని వెంకయ్యకు సూచించినట్లు సమాచారం.
టంగుటూరు మండలంలో మూడు గ్రూపులు
టంగుటూరు మండలంలో పార్టీలో ప్రస్తుతం మూడు గ్రూపులు ఏర్పడ్డాయి. ఆరంభంలో వెంకయ్యను భుజాన వేసుకుని మోయడంతోపాటు తొలినుంచీ పార్టీలో ఉన్న అయ్యవారయ్య, మండల పార్టీ కన్వీనర్ సూదనగుంట హరిబాబు తదితరుల నాయకత్వంలోని బలమైన గ్రూపు ఒకవైపు ఉంది. కారుమంచి విజయభాస్కర్ రెడ్డి, బొట్ల రామారావు తదితరుల నాయకత్వంలో మ రో గ్రూపు ఇటీవల చురుగ్గా వ్యవహరిస్తోంది. మధ్యలో టంగుటూరు మాజీ సర్పంచ్ వెంకటరావు ఆధ్వర్యంలో ఇంకో గ్రూపు ప్రారంభమైంది. రాజశేఖరరెడ్డి వర్ధంతి, జయంతి కార్యక్రమాలు కూడా అక్కడ విడివిడిగా జరుగుతున్నాయి. ఎస్‌ఐతోపాటు ఇద్దరు మండల స్థాయి అధికారుల బదిలీల విషయంలోనూ విభేదాలు పెరిగిపోయాయి. మంత్రి బాలినేని వద్ద అన్ని గ్రూపుల వారు వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఇన్‌చార్జ్ వెంకయ్య వైఖరే అసలు కారణ మంటూ ఫిర్యాదులు చేశారు.
మంత్రి బాలినేనినితో వెంకయ్య భేటీ
ఈ నేపథ్యంలో డాక్టర్ వెంకయ్య బుధవారం హైదరాబాద్ వెళ్లి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారు. ఆయన పార్టీ ఇన్‌చార్జి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కూడా భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బాలినేనిని కలిసిన సమయంలో వెంకయ్య నియోజకవర్గంలోని పరిస్థితులను సవివరంగా చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టంగుటూరు మండలంలో నెలకొన్న పరిస్థితులపై తన అభిప్రాయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇటీవల సింగరాయకొండ మండలంలో ఒక కింది స్థాయి నాయకుడు త్వరలో నియోజకవర్గ ఇన్‌చార్జిగా జూపూడి ప్రభాకరరావు రాబోతున్నాడంటూ వ్యాఖ్యానించటం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడాన్ని కూడా వెంకయ్య బాలినేని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.