నిధులు వచ్చేనా ... నీళ్లు పారేనా

ABN , First Publish Date - 2020-11-25T04:20:51+05:30 IST

పరవళ్లు తొక్కే నీటితో శతాబ్దాల కాలం క్రితమే వేలాది ఎకరాల భూమిని పచ్చగా కళకళలాడేలా చేసిన ఘనమైన చరిత్ర కంభం చెరువు సొంతం. కానీ నేడు చెరువు అభివృద్ధి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు.

నిధులు వచ్చేనా ... నీళ్లు పారేనా
నిండుకుండలా కంభం చెరువు

అభివృద్ధి చేస్తే అటు సాగుకు, ఇటు పర్యాటకానికి ఊతం

చారిత్రాత్మక కంభం చెరువు అభివృద్ధిపై ఆశలు

విశ్వాసం నింపుతున్నకలెక్టర్‌ మాటలు


 పరవళ్లు తొక్కే నీటితో శతాబ్దాల కాలం క్రితమే వేలాది ఎకరాల భూమిని పచ్చగా కళకళలాడేలా చేసిన ఘనమైన చరిత్ర  కంభం చెరువు సొంతం. కానీ నేడు చెరువు అభివృద్ధి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. వేలాది ఎకరాలను సస్యశ్యామలం చెరువు నేడు ప్రాభవం కోల్పోతోంది. ఈ నేపథ్యంలో చెరువు అభివృద్ధికి రూ.22 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌, ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఇటీవల హామీ ఇచ్చారు. దీంతో రైతులు, స్థానికుల ఆశల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తాత్కలిక మరమ్మతులకు రూ.70 లక్షలు మంజూరు చేసినా పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తే అటు పర్యాటకం, ఇటు వ్యవసాయం రెండిటికి మేలు జరుగుతుంది. 

 కంభం, నవంబరు 24 : ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువుల్లో రెండవదైన కంభం చెరువు శ్రీకృష్ణదేవరాయల సతీమణి వరదరాజమ్మ (సచీదేవి) 500 ఏళ్లక్రితం నిర్మించారు. ప్రస్తుతం ఆ చెరువు కట్ట బలంగానే ఉన్నా, చెరువులో పూడిక, తూముల వద్ద లీకులు, పంట కాలువల ఆక్రమణలు తదితర కారణాలతో చెరువు ప్రభ మసకబారుతోంది. ఇక పర్యాటకం అభివృద్ధికి కూడా చక్కటి అవకాశం ఉన్నా, ఆ దిశగా ఇప్పటి వరకు పాలకులు దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల జిల్లా కల్టెక్టర్‌ చెరవును సందర్శించి అభివృద్ధికి హామీ ఇచ్చారు రూ.22 కోట్ల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపినట్లు తెలిపారు. ఆ నిధులు విడుదలైతే చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకోవచ్చు. 


కనుమరుగవుతున్న పంటలు

కంభం చెరువు ఒక్కసారి నిండితే నాలుగేళ్లపాటు సాగునీటికి కొరత ఉండదు. వరి, చెరకు, పసుపు, అరటి తదితర ప్రధాన పంటలును డోకా లేకుండా పండించుకోవచ్చు. అక్కడక్కడా మిర్చి, పత్తి, కూరగాయలు సాగు ఉంది. ఇక బోర్ల కింద సాగు అధికంగా ఉంటుంది. గతంలో వరి, చెరకు విస్తీర్ణం వేలాది ఎకరాల్లో ఉండేది. కంభం ప్రాంతమంటే ధాన్యాగారంగా భావించేవారు. రైతుకు, రైతు కూలీలకు ఆకలి అంటే తెలియదు. వరి ఎగుమతి జరిగేది. ఇక చెరకు బాగా పండించడంతో బెల్లం బట్టీలు కుప్పలుగా ఉండేవి. ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి లేదు. 


పర్యాటక కేంద్రంగా మార్చడంలోనూ విఫలం

కంభం చెరువును పర్యాటక కేంద్రంగా మార్చే విషయంలోనూ, ప్రజాప్రతినిధులు, అధికారుల మాటలు కోటలు దాటాయి. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడిన దాఖలాలు లేవు. కంభం ప్రాంతానికి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుపల్లి జనార్థన్‌రెడ్డి, ఎన్‌.టి.రామారావు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కంభం చెరువు అందాలను చూసి పరవశించి పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామీలు ఇచ్చారు. అయితే కట్ట దిగగానే మరచిపోతున్నారు. ప్రస్తుతం కంభం చెరువును చూసేందుకు వచ్చే వేలాది మంది పర్యాటకులకు కట్టపైకి వస్తున్నారు. వీరికి కనీస సౌకర్యాలు లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇటీవల ఇక్కడ పర్యటించిన కలెక్టర్‌ పోలాభాస్కర్‌, ఎమ్మెల్యే అన్నా రాంబాబులు నిండుకుండలా ఉన్న చెరువును చూసి ఇక్కడ రిసార్ట్‌ ఏర్పాటు చేసి, బోటు షికార్లకు అనుమతి ఇస్తామన్నారు. ఈ విషయాన్ని రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. దీంతో పర్యాటకుల్లో ఆశలు చిగురించాయి. కలెక్టర్‌ ఇచ్చిన మాట నిలుపుకుంటారో లేదో తెలియాల్సి ఉంది.


అభివృద్ధి పరిస్తే.. సస్యశ్యామలమే..

కంభం చెరువును అభివృద్ధి పరిస్తే కంభం, పోరుమామిళ్లపల్లి, చిన్నకంభం, సోమవారిపేట, దర్గ, జె.బి.క్రిష్టాపురం, పాపాయిపల్లి, చింతలపాలెం, కాగితాలగూడెం, హజరత్‌గూడెం, ఔరంగబాద్‌, కందులాపురం, నడింపల్లి, సైదాపురం, సూరేపల్లి, లింగోజీపల్లి, గోవిందాపురం, నేకునాంబాద్‌ గ్రామాలలోని బీడుభూములు సస్యశ్యామలం అవుతాయి. పచ్చని పంట పొలాల్లో రైతులు, రైతు కూలీలకు ఉపాధి దొరుకుతుంది.


ప్రతిపాదనలు పంపాం: వెంకటేశ్వరరావు, డీఈ

కంభం చెరువు పర్యాటక అభివృద్ధికి ఇటీవల కలెక్టర్‌ సూచన మేరకు రూ.62 లక్షలతో  ప్రతిపాదనలు పంపాం. చెరువు అభివృద్ధి కోసం ఇప్పటికే తయారు చేసిన తగు అంచనాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి.


కంభం చెరువు వివరాలు

చెరువు వైశాల్యం : 6025 ఎకరాలు

పరివాహక విస్తీర్ణం : 10425 ఎకరాలు

చెరువుకట్ట పొడవు : 325 మీటర్లు

చెరువుకట్ట వెడల్పు : 20 మీటర్లు

చెరువుకట్ట ఎత్తు : 18.45 మీటర్లు

అలుగు వద్ద పొడవు : 88.4 మీటర్లు

చెరువు లోతు : 21 అడుగులు

నీటి నిల్వ సామర్థ్యం : 2.952 టీఎంసీలు

చెరువు పూడిక : 14 అడుగులు


కంభం చెరువు సప్లై ఛానల్స్‌ వివరాలు

పెద్ద కంభం ఛానల్‌ పొడవు : 7.2 కిలోమీటర్లు (చెరువు నుండి కందులాపురం వరకు)

చిన్న కంభం ఛానల్‌ పొడవు : 10. కిలోమీటర్లు (చెరువు నుండి దర్గ వరకు)

చీతిరాల కతువ ఛానల్‌ పొడవు : 10 కిలోమీటర్లు (చెరువు నుండి ఎల్‌.కోట వరకు)

నక్కలగండి ఛానల్‌ పొడవు : 2.5 కిలోమీటర్లు

పాపాయిపల్లి ఛానల్‌ పొడవు : 2.5 కిలోమీటర్లు


ఆయకట్టు వివరాలు

అధికారికంగా ఆయకట్టు 7వేల ఎకరాలు, 

అనధికారికంగా 4వేల ఎకరాలు. 




Updated Date - 2020-11-25T04:20:51+05:30 IST