వైభవంగా కార్తీక పూజలు

ABN , First Publish Date - 2020-12-01T05:50:58+05:30 IST

కార్తీక మాసంలో మూడో సోమవారం పూజలను మండలంలోని భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు.

వైభవంగా కార్తీక పూజలు
త్రిపురాంతక క్షేత్రాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు

త్రిపురాంతకం నవంబరు 30 : కార్తీక మాసంలో మూడో సోమవారం పూజలను మండలంలోని భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. కార్తీక మాసంలోని మూడవ సోమవారం కావడంతో భక్తులు ఉదయాన్నే పుణ్యస్నానాలు ఆచరించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో ప్రదక్షణలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్ల కింద, చామరకర్ణ రససిద్ధి గణపతి వద్ద దీపాలను వెలిగించారు. అనంతరం త్రిపురాంతకేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిపురాంతకేశ్వరుడు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయానికి అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్తీక సోమవారం సందర్భంగా ఒంగోలు ఏఎస్పీ చౌడేశ్వరి ఆలయాల్లో హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు విశ్వం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీబాలా త్రిపురసుందరీదేవి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు చినమస్తాదేవికి, అమ్మవారికి పూజలు నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయాలు కిటకిటలాడాయి.


శివాలయాల కిటకిట

రాచర్ల : కార్తీక పౌర్ణమి, సోమవారం సందర్భంగా మండలంలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. రామాపురంలోని సిద్దిభైరవేశ్వర ఆలయం, రాచర్ల, అనుమలవీడులోని శివాలయాలు, సురభేశ్వరకోనలోని శివాలయం, సత్యవోలులోని అత్యంత ప్రాచీనమైన రామలింగేశ్వర ఆలయాలలో సోమవారం వేకువ జాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


గిద్దలూరు టౌన్‌ : కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం శైవక్షేత్రాలు భక్తులతో మారుమోగాయి. తెల్లవారుజాము నుంచి దేవాలయాల్లో భక్తులు బారులుతీరి కనిపించారు. పట్టణంలోని ప్రసిద్ధ శ్రీపాతాళ నాగేశ్వరస్వామి దేవాలయంలో భక్తులు కిటకిటలాడారు. తెల్లవారుజాము నుంచే పట్టణంతోపాటు సమీప గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కేఎస్‌పల్లి సమీపంలో ఎగువ భీమలింగేశ్వర దేవాలయం, ముండ్లపాడులోని శివాలయం, పాపులవీడు శివాలయం, వివిధ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దేవాలయాల ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు.


పెద్ద దోర్నాల : కార్తీక పౌర్ణమి సోమవారం పూజలు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.ఆలయాలల్లో కార్తీకదీపాల వెలుగులు కాంతులీనాయి. స్థానిక లక్ష్మీనరసింహాస్వామి దేవాలయంలో, యడవల్లి వద్ద ఉన్న తిరుమలనాథ దేవాలయంలో, అయ్యప్పస్వామి దేవాలయంలో, మోట్ల మల్లికార్జునస్వామి దేవాలయంలో, శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో కోటి దీపోత్సవాలు నిర్వహించారు. మహిళలు దీపాలు వెలిగించి స్వామివార్లను సేవించారు.

Updated Date - 2020-12-01T05:50:58+05:30 IST