కరోనాపై పోరులో ‘కందుకూరు’ ఆదర్శం

ABN , First Publish Date - 2020-04-21T07:32:48+05:30 IST

కరోనా నివారణ, సహాయ కార్యక్రమాలలో కందుకూరు నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తోంది. ‘చేయిచేయి కలుపుదాం.. మన ప్రాంతాన్ని కాపాడుకుందాం’ అంటూ ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి...

కరోనాపై పోరులో ‘కందుకూరు’ ఆదర్శం

పర్యవేక్షణ, అమలులో మహీధర్‌రెడ్డి రూటే సపరేటు 

కందుకూరు, ఏప్రిల్‌ 20 : కరోనా నివారణ, సహాయ కార్యక్రమాలలో కందుకూరు నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తోంది. ‘చేయిచేయి కలుపుదాం.. మన ప్రాంతాన్ని కాపాడుకుందాం’ అంటూ ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి ఇచ్చిన పిలుపునకు అందరూ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.


లక్షల రూపాయల విరాళాలు సేకరణ 

నియోజకవర్గంలో 25 రోజులుగా దాతలు రూ.70 లక్షలకు పైగా విరాళాలు అందించటం గమనార్హం. తొలుత పలు కార్యక్రమాలను ఎమ్మెల్యే తన స్వంత నిధులతో ప్రారంభించగా, మరుసటి రోజు నుంచే దాతలు స్పందించారు. కేవలం నగదు, చెక్కుల రూపంలోనే కాక అనేకమంది మాస్క్‌లు, శానిటైజర్లు, ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు, కూరగాయల పంపిణీ చేశారు. కందుకూరులో రెండు క్వారంటైన్‌ కేంద్రాలలో బాధితులకు ఉదయం, సాయంత్రం టిఫిన్‌, రోజూ గుడ్డు, రోజు మార్చి రోజు మాంసాహారం, శాఖాహారులకు నట్స్‌, డ్రైఫ్రూట్స్‌ అందించటంతో పాటు రోజుకి మూడుసార్లు టీ ఇస్తున్నారు. అలాగే కరోనాపై పోరులో నిర్విరామంగా శ్రమిస్తున్న ఉద్యోగులందరికీ నాణ్యమైన భోజనం అందిస్తున్నారు.   


10వేలకు పైగా కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ

కందుకూరు పట్టణంలో రెడ్‌జోన్‌లుగా ప్రకటించిన మూడు ప్రాంతాలలో నివసిస్తున్న 4 వేలకు పైగా కుటుంబాలకు నిత్యావసరాలు అందజేయటమే గాక నిత్యం వేలాది కుటుంబాలకు ఆహారం అందిస్తున్నారు.  వివిధ సంఘాల వారు నిత్యం వందలాది మందికి ఆహార ప్యాకెట్లు త యారు చేసి పంచిపెడుతున్నారు. మాలకొండ దేవస్థానం ఆధ్వర్యంలో వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాల్లోని 4వేల నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీని ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ప్రారంభించారు. పారిశుధ్య పనులనూ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. గ్రామాలన్నింటికీ 2వేల బస్తాల బ్లీచింగ్‌ తెప్పించి పంపిణీ చేశారు. పకడ్బందీగా అమలవుతున్న కార్యక్రమాల వల్లే కరోనా కట్టడి సాధ్యమవుతోందన్న సంతృప్తి ప్రజల్లో వ్యక్తమవుతోంది. 

Updated Date - 2020-04-21T07:32:48+05:30 IST