ఐపీఎల్ హోరు.. బెట్టింగ్ జోరు..
ABN , First Publish Date - 2020-10-04T17:12:30+05:30 IST
జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మళ్లీ జోరందుకుంది. కరోనాతో కొంతకాలంగా నిలిచిపోయిన..
జిల్లాలో రోజుకు రూ.కోట్లలో వ్యవహారం
మళ్లీ రెచ్చిపోతున్న పందెంరాయుళ్లు
బంతిబంతికీ రేటు .. ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు
డిపాజిట్లు చెల్లిస్తేనే అవకాశం
పట్టణాల నుంచి పల్లెలకూ పాకిన జాడ్యం
ప్రాంతాల వారీ ఏజెంట్ల ద్వారా వ్యవహారం
ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలు
ఒంగోలు: జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మళ్లీ జోరందుకుంది. కరోనాతో కొంతకాలంగా నిలిచిపోయిన ఈ వ్యవహారం ఐపీఎల్ ధనాధన్ టోర్నమెంట్ మొదలవడంతో రెక్కలు తొడిగింది. బుకీలు జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా వ్యవహారం నడుపుతున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా నగదు లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే సాగిస్తున్నారు. ఇందుకోసం ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని భారీగానే జీతాలు చెల్లిస్తున్నారు. అంతేకాకుండా కొందరు ప్రత్యేక యాప్‌లను రూపొందించి వాటి ద్వారా యువతను టార్గెట్ చేసుకొని బెట్టింగ్ నడుపుతున్నారు. ఇందుకోసం బెట్టింగ్‌లో పాల్గొనే వ్యక్తి వద్ద కొంత మొత్తం డిపాజిట్‌గా తీసుకొంటున్నారు. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ జాడ్యం ఇప్పుడు పల్లెలకూ విస్తరించింది. దీంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.
దుబాయ్ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కావడంతో మళ్లీ బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. బుకీలు గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఎక్కడా నేరుగా డబ్బు మార్పిడి లేకుండా జాగ్రత్త పడుతున్నారు. వ్యవహారాన్నంతా ఆన్‌లైన్, ఫోన్‌లలోనే సాగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకు రూ. కోట్లలో పందెం జరుగుతోంది.
రెండు రకాలుగా బెట్టింగ్
జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ రెండు రకాలుగా జరుగుతోంది. అందు లో ఒకటి యాప్‌ల ద్వారా కాగా, మరొకటి ఏజెంట్ల ద్వారా నడుస్తోంది. కొంతమంది యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుని ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడుతున్నారు. ఇందులో ఏజెంట్ల ద్వారా జరిగే బెట్టింగే అధికం. క్రికెట్ బుకీలు ఏజెంట్లుగా నమ్మకస్థులను నియమించుకొంటున్నారు. వారు పోలీసులకు దొరికినా తమ పేరు చెప్పకుండా ఉండేందుకు ఇలా వ్యవహరిస్తున్నారు. అందుకు ఒక్కో ఏజెంటకు కనీసం రూ. లక్షకు తగ్గకుండా జీతం కూడా చెల్లిస్తున్నారు. కొన్నిచోట్ల స్థానికంగా ఉండే యువకులు గ్రూపులుగా ఏర్పడి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. నగదు చెల్లింపులు గ్రూపునకు నాయకత్వం వహించిన యువకుడి ద్వారా జరుగుతోంది.
డిపాజిట్లు చెల్లిస్తేనే అవకాశం
యాప్‌ల ద్వారా పందెం వేయాలంటే దాన్ని నిర్వహించే వారి ఖాతాలో సదరు వ్యక్తి రూ. 10వేలు డిపాజిట్ చేయాలి. అలా అయితేనే అవకాశం ఉంటుంది. ఏజెంట్ల ద్వారా అయితే ఇంకోరకం. వీరు పందెం రాయుళ్ల వద్ద రూ. 10వేల నుంచి రూ. 10లక్షల వరకూ డిపాజిట్ల రూపంలో వసూలు చేస్తారు. ఆ సమయంలో బెట్టింగ్ రాయుళ్ల సెల్‌ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. ఆట ప్రారంభమయ్యే ముందుగా ఫలానా నెంబరులో తామున్నామంటూ సమాచారం ఇస్తారు. ఆ రోజుకి ఆ నెంబర్లతోనే ఫోన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తారు. అలా ప్రతి రోజూ మారుస్తుంటారు. పందెం కాసే వారి డిపాజిట్ సొమ్ము అయిపోతే మళ్లీ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రెండు విధాలుగా జరుగుతున్నాయి.
బంతి బంతికీ, పరుగు పరుగుకూ పందెం
గతంలో క్రికెట్ బెట్టింగ్ గెలుపోటములపై ఎక్కువగా నడిచేది. కానీ ఇప్పుడు బంతి బంతికీ.. పరుగు పరుగూ ఒక రేటు ఉంటోంది. ఈ బంతి బౌండరీ దాటుతుందని, ఫలానా ఆటగాడు ఇంత స్కోర్ చేస్తాడని, బౌలర్ వికెట్ తీస్తాడని ఇలా రకరకాలుగా పందేలు కాస్తున్నారు. అం దుకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఫేవర్, అన్‌ఫేవర్ అనే రెండు ఆ ప్షన్లు ఉంటాయి. ఫేవర్ అని ఆప్షన్ చేసిన వారికి వారు చెప్పినట్టు జరిగితే అతను వేసిన పందెంపై మూడు రెట్లు అదనంగా వస్తుంది. ఏజెంట్ల ద్వారా జరిగే బెట్టింగ్‌లు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయి. ఇందులో బెట్టింగ్ కాసిన వ్యక్తి గెలిస్తే అతనికి రెండు రెట్లు అదనంగా చెల్లిస్తారు.
ఒంగోలులోనే కీలక వ్యక్తులు
ఒంగోలు కేంద్రంగా గతంలో క్రికెట్ బెట్టింగ్ విచ్చలవిడిగా నడిచింది. అప్పట్లో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన బుకీ ఒంగోలులోనే ఉంటూ బెట్టింగ్ వ్యవహారం నడిపించాడు. ఇప్పుడు కూడా ఇదే తరహాలో కొందరు దీన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని గద్దలగుంటలో శుక్రవారం రాత్రి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, అతను క్రికెట్ బెట్టింగ్ సూత్రధారి అని తెలుస్తుండటం అందుకు ఊతం ఇస్తోంది. ఇంకా అనేక మంది బెట్టింగ్‌ల వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇస్లాంపేటలో ఓ యువకుడు బెట్టింగ్ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు సమాచారం. జిల్లాలో చిన్నా, పెద్ద బుకీలే 15 మంది వరకు ఉన్నట్లు అంచనా.
జిల్లాలో అధికంగా బెట్టింగ్ జరిగే ప్రాంతాలు ఇవే..
జిల్లా కేంద్రంతోపాటు, గిద్దలూరు, మార్కాపురం, అద్దంకి, దర్శి, కందుకూరు, మార్టూరు, చీరాల ప్రాంతాల్లో ఎక్కువగా బెట్టింగ్ జరుగుతోంది. ఒంగోలులోని మస్తాన్‌దర్గా సెంటర్‌లో ఓ టీ కొట్టు, అంజయ్యరోడ్డులో ఓ కూల్‌డ్రింక్ షాపు, నెల్లూరు బస్టాండ్ వద్ద ఓ టీస్టాల్‌తో పాటు మంగమూరు జంక్షన్ రోడ్డు, శ్రీనివాస థియేటర్ సెంటర్ తదితర ప్రాం తాలు కేంద్రాలుగా ఈ వ్యవహారం నడుస్తోంది. పంగులూరు, మార్టూరు మండలాల్లో ఎక్కువగా బెట్టింగ్‌లు వేస్తున్నారు. మార్కాపురం పట్టణ శివారులోని ఓ కల్యాణ మండపం సమీప ప్రాంతం బెట్టింగ్ ముఠాకు కేంద్రంగా మారింది. గిద్దలూరు పరిసర ప్రాంతాలతోపాటు దర్శి నియోజకవర్గంలోని కురిచేడు, గుడ్లూరు మండలాల్లోనూ బెట్టింగ్ జోరుగా నడుస్తోంది.
ఎక్కువగా యువతే బానిస
క్రికెట్ బెట్టింగ్‌కు ఎక్కువ యువకులు బానిసవుతున్నారు. స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండడంతో ఈ ఉచ్చులో చిక్కుకుని బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. కూలినాలి చేసుకునే వారు సైతం అత్యాశతో ఈ ఊబిలోకి దిగుతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు. గతంలో అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసులు ఈ విషయంపై దృష్టి సారించి బెట్టింగ్‌ను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.