స్కూలుకు వెళ్లాలంటే భయపడిపోతున్న చిన్నారులు.. కారణమేంటని ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2020-03-04T10:52:20+05:30 IST

వాళ్లంతా చిన్న పిల్లలు. ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న..

స్కూలుకు వెళ్లాలంటే భయపడిపోతున్న చిన్నారులు.. కారణమేంటని ఆరా తీస్తే..

హెచ్‌ఎం వికృత చేష్టలు

చిన్నారుల పట్ల అసభ్య ప్రవర్తన

భయపడి స్కూల్‌కు వెళ్లేందుకు  బాలికల నిరాకరణ

అతని చేష్టలను తండ్రికి చెప్పిన ఓ విద్యార్థిని

పాఠశాల వద్ద ఆందోళన 

అదుపులోకి తీసుకున్న పోలీసులు 


చీరాల(ప్రకాశం): వాళ్లంతా చిన్న పిల్లలు. ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న బాలికలు. అలాంటి వారితో అప్యాయంగా మాట్లాడి.. వారికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రధానోపాధ్యాయుడే వేధించడం ప్రారంభించాడు. వికృత చర్యలకు పాల్పడుతున్నాడు. ఇతని చేష్టలకు భయపడి స్కూలుకు వెళ్లనని మారాం చేసిన ఓ బాలికను తండ్రి దగ్గరకు తీసుకొని అడగ్గా విషయం చెప్పింది. దీంతో అయ్యవారి బండారం బయటపడింది. అందిన సమాచారం మేరకు..


ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం పరిధి పద్మనాభునిపేటలోని ఎలిమెంటరీ స్కూలు ప్రధానోపాధ్యాయుడిగా నాగభూషణం పని చేస్తున్నాడు. ఆయన మరి కొన్నేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. స్కూలుకు వచ్చే మనుమరాలి వయసు ఉన్న చిన్నారులను మురిపెంగా చూసుకోవాల్సిన ఆయన ఉన్మాదిలా మారాడు. వారిని శారీరకంగా హింసిస్తున్నాడు. ఇతని చేష్టలకు భయపడిన పిల్లలు స్కూలు వెళ్లమంటూ కొద్ది రోజులుగా ఇంట్లో మారాం చేస్తున్నారు. విషయం తెలియని తల్లిదండ్రులు పిల్లలకు సర్దిచెప్పి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఓ చిన్నారి స్కూలుకు వెళ్లనంటూ ఇంట్లోనే ఏడుస్తూ కూర్చుంది.


తల్లిదండ్రులు సర్దిచెప్పినా ససేమిరా అంది. దీంతో తండ్రి ఆ బాలికను అప్యాయంగా దగ్గరకు పిలిచి అడగడంతో ప్రధానోపాధ్యాయుడి క్రూరమైన చర్యల గురించి వివరించారు. దీంతో ఆగ్రహించిన ఆయన మిగిలిన పిల్లల తల్లిదండ్రులకు విషయం చెప్పి వారితో కలిసి పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగాడు. ప్రధానోపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న ఈపూరు పాలెం పోలీసులు పాఠశాల వద్దకు చేరుకొని ప్రధానోపాధ్యాయుడు నాగభూషణంను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. దీంతో బాలికలకు తల్లిదండ్రులు శాంతించారు.


గతంలో నాగభూషణం తిమ్మసముద్రం, పావులూరు, ఆదిపూడిలో పని చేశారు. తిమ్మసముద్రంలో పని చేసిన సమయంలో కూడా ఇతను చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో గ్రామస్థులు దేహశుద్ధి చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మధ్యాహ్నం చీరాల డీఎస్పీ జయ రామసుబ్బారెడ్డి, ఎంఈవో నాగేశ్వరరావు పాఠశాలకు చేరుకొని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులను విచారించారు. 


Updated Date - 2020-03-04T10:52:20+05:30 IST