తూర్పున మాజీ సీఎం.. పశ్చిమాన సీఎం !

ABN , First Publish Date - 2020-02-16T10:01:39+05:30 IST

ఒక్కరోజు వ్యవధిలో ఇరువు రు అగ్రనేతలు జిల్లా పర్యటనకు రాను న్నారు. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈనెల 20న జిల్లా పశ్చిమ ప్రాంతానికి వస్తుండగా అంతకు ఒకరోజు

తూర్పున మాజీ సీఎం.. పశ్చిమాన సీఎం !

ఒక్కరోజు వ్యవధిలో.. జిల్లాకు ఇద్దరు అగ్రనేతలు

19న ప్రజాచైతన్యయాత్రకుచంద్రబాబు నాయుడు

20న వెలిగొండకు వస్తున్న వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి

వెలిగొండ వద్ద మంత్రి సురేష్‌,కలెక్టర్‌ విడివిడిగా సమీక్షలు

అధినేత పర్యటనపై టీడీపీశేణుల దృష్టి


ఒంగోలు(ఆంధ్రజ్యోతి): ఒక్కరోజు వ్యవధిలో ఇరువురు అగ్రనేతలు ప్రకాశం జిల్లా పర్యటనకు రానున్నారు. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈనెల 20న జిల్లా పశ్చిమ ప్రాంతానికి వస్తుండగా అంతకు ఒకరోజు ముందుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 19న తూర్పు ప్రాంతంలో పర్యటించనున్నారు. ఇరువురు ప్రాధాన్యత అంశాలపైనే జిల్లాకు వస్తున్నారు. జిల్లాకు అత్యంత కీలకమైన వెలిగొండ ప్రాజెక్టును సీఎం సందర్శించనుండగా, అమరావతి రాజధాని కొనసాగింపు, ఇతర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ టీడీపీ చేపట్టనున్న 45 రోజుల ప్రజా చైతన్యయాత్రను జిల్లా నుంచే చంద్రబాబు ప్రారంభించనున్నారు.


జిల్లా ప్రజలు ప్రత్యేకించి పశ్చిమ ప్రాంత ప్రజానీకం ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పనులను ఈ ఏడాది జూన్‌కు పూర్తిచేస్తామని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులలో వెలిగొండ కీలక మైనదిగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. తదనుగుణ చర్యలు కూడా ప్రారంభమై పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా ప్రాజెక్టును సందర్శించి పనులు పరిశీలించేందుకు సీఎం జిల్లాకు వస్తున్నారు. తొలుత ఈనెల 19న వస్తారన్న సమాచారం అధికారులకు రాగా 20వతేదీ వస్తారని కలెక్టర్‌ ప్రకటించారు. 


దోర్నాల సమీపంలోని కొత్తూరు వద్ద జరుగుతున్న వెలిగొండ టన్నెల్‌ పనులను శనివారం పరిశీలించిన కలెక్టర్‌ అక్కడ ప్రాజెక్టు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించి సీఎం పర్యటనపై స్పష్టత ఇచ్చారు. ఈనెల 20న ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం 12.30 వరకు వెలిగొండ వద్ద సీఎం కార్యక్రమం ఉంటుందన్న ఆయన పనులు పరిశీలనతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. తదనుగుణంగా ఆయా శాఖల వారీ అధికారులు చేయాల్సిన ఏర్పాట్లపై తగు ఆదేశాలు ఇచ్చారు. అలాగే వెలిగొండ పనులు జరిగే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖ మంత్రి సురేష్‌ శనివారం సాయంత్రం ప్రాజెక్టు వద్దకు వెళ్ళారు. అక్కడి అధికారులతో ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రానున్న నేపథ్యంలో ఈ సమీక్షలు జరిగాయి.


ప్రజాచైతన్యయాత్ర ప్రారంభం..

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 19న జిల్లాకు వస్తుండగా ఆ పార్టీశ్రేణులు కూడా అందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రజాచైతన్యయాత్రలను 45 రోజుల పాటు టీడీపీ చేపట్టనుండగా ఆ కార్యక్రమాన్ని ఈనెల 19న జిల్లా నుంచి ప్రారంభించనున్నారు. పర్చూరు, అద్దంకి, ఎస్‌ఎన్‌పాడు, ఒంగోలు నియోజక వర్గాల పరిధిలో ఈ యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం మార్టూరులోనూ, సాయంత్రం ఒంగోలులోనూ జరిగే సభలలో చంద్రబాబు పాల్గొననున్నారు. మార్టూరులో చంద్రబాబు కార్యక్రమం విజయవంతంపై అక్కడి టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తున్నారు.


అన్ని గ్రామాల నుంచి పార్టీశ్రేణులను తరలించే విధంగా చర్యలు చేపట్టారు. అలాగే, మార్గమధ్యంలో అద్దంకి నియోజకవర్గ పరిధిలోని ఒక చోట చంద్రబాబు సభ ఏర్పాటు యోచనలో ఎమ్మెల్యే రవికుమార్‌ ఉన్నారు. అందుకువీలుగా పార్టీశ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. సంతమాగులూరులో శనివారం పార్టీనేతలతో సమావేశం నిర్వహించారు. అధినేత పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించేందుకు ఈనెల 17న ఒంగోలులో టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ భేటీ కానుంది. ఆ తర్వాత కార్యక్రమంపై పూర్తి స్పష్టత రానుంది. 

Updated Date - 2020-02-16T10:01:39+05:30 IST