వైద్యో నారాయణులు.. ఏరీ!

ABN , First Publish Date - 2020-07-22T11:00:46+05:30 IST

కరోనా బాధితులే కాకుండా రిమ్స్‌ సాధారణ రోగులు, అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగుల వార్డులు కూడా ఉన్నాయి.

వైద్యో నారాయణులు.. ఏరీ!

కొవిడ్‌ చికిత్సకు డాక్టర్ల కొరత

వందల సంఖ్యలో బాధితులు

రిమ్స్‌లో చికిత్స కోసం క్యూ 

ఇప్పటికే ఆరుగురు వైద్యులకు పాజిటివ్‌

అవసరం 200 మంది.. పనిచేస్తోంది 55మందే

రిమ్స్‌లో విధులకు ప్రయివేట్‌ వైద్యులు


జిల్లాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజుకు వందల సంఖ్యలో వైరస్‌ బారినపడుతున్నారు. వారందరికీ చికిత్స అందించటానికి ఏకైక దిక్కుగా రిమ్స్‌ ఆసుపత్రే ఉంది. ఒంగోలులోని మూడు ప్రయివేట్‌ వైద్యశాలలు సిద్ధమైనా కొద్దిమందిని మాత్రమే చికిత్స కోసం చేర్చుకుంటున్నారు. రిమ్స్‌లో మాత్రం వందలమంది రోజూ వచ్చి చేరుతున్నారు. డిశ్చార్జి అయ్యే వారు మాత్రం ఆ స్థాయిలో ఉండటం లేదు. రిమ్స్‌లో ప్రస్తుతం 700మంది కరోనా బాధితులు ఉన్నారు. అన్ని గదులు నిండిపోయాయి. వీరందరికీ చికిత్స అందించేందుకు తగినంతమంది వైద్యులు ఉన్నారా అంటే ఆశ్చర్యం కలిగించే సమాధానం వస్తోంది. నాలుగు వంతుల్లో ఒక్క వంతు మాత్రమే రిమ్స్‌లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం రిమ్స్‌లో ఉన్న బాధితుల సంఖ్యను బట్టి చూస్తే 200నుంచి 250 మంది దాకా వైద్యులు అవసరం. ఉన్నది 55 మందే.


ఒంగోలు నగరం, జూలై 21 : కరోనా బాధితులే కాకుండా రిమ్స్‌ సాధారణ రోగులు, అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగుల వార్డులు కూడా ఉన్నాయి. వీటిలో కూడా రోగులు ఉన్నారు. వీరితో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఐసీయూలో చికిత్స అందించాలి. ఐసీయూలో డ్యూటీ డాక్టర్లు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాల్సిం దే. కొవిడ్‌ వార్డుల్లో డ్యూటీలు, అత్యవసర విభాగాల్లో విధులు, సాధారణ రోగుల వార్డుల్లో విధులు, ఓపీలో సేవలు, ఇన్ని వార్డుల్లో డ్యూటీలు, వందలసంఖ్యలో వస్తున్న బాధితులకు వైద్యం అందించాలి. ఇంతమందికి 24గంటలూ అందుబాటులో ఉండి వైద్యం అందించేందుకు రిమ్స్‌లో ఉన్న వైద్యులు 55మందే. వీరే మూడు నెలలుగా కొవిడ్‌ బాధితులకు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం 250మంది దాకా వైద్యుల అవసరం ఉంది. 


కళాశాల, ఆసుపత్రి కలిపి మొత్తం 90మంది వైద్యులే

రిమ్స్‌ వైద్య కళాశాల, రిమ్స్‌ ఆసుపత్రిలో మొత్తం కలిపి 90మంది వైద్యులు ఉన్నారు. వీరిలో 17మంది 60 ఏళ్ల వయస్సు దాటిన వారు. 10మంది వైద్యులు ఇక్కడ వేతనాలు తీసుకుంటూ ఇతర జిల్లాల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు.  వీరు కాక అనాటమీ, ఇతర రెండు విభాగాల్లో పనిచేసే వైద్యులు కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించేందుకు పనికిరారు. వీరందరూ పోనూ ఆసుపత్రిలో 55వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. వీరితోనే కొవిడ్‌ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. 


విశ్రాంతి లేకుండా డాక్టర్లు, సిబ్బంది విధుల నిర్వహణ

ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా వైద్యులకూ వైరస్‌ సోకే అవకా శం ఉంది. పైగా పీపీఈ కిట్లు విప్పేసి వార్డుల నుంచి బయటకు వచ్చి కాస్త విశ్రాంతి తీసుకుందామన్నా కుదరని పరిస్థితి. పీపీఈ కిట్టు విప్పి మళ్లీ కొత్తది వేసుకోవాలంటూ కనీసం అరగంట పడుతోంది. ఇందులో కొందరైతే పూర్తిగా వార్డులకే పరిమితమై బాహ్యప్రపంచాన్ని మరిచిపోయారు. వార్డు విడిచిపోతే మరో డ్యూటీ డాక్టర్‌ అందుబాటులో దొరకని పరిస్థితి రిమ్స్‌లో నెలకొంది.  


ఆరుగురు వైద్యులకు కరోనా.. 14 రోజుల తర్వాత విధుల్లోకి

రిమ్స్‌లో కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులు కూడా వైరస్‌ బారినపడుతున్నారు. ఇప్పటికి నలుగురు జూనియర్‌ డాక్టర్లు, ఇద్దరు సీనియర్లు ఈ వైరస్‌ బారినపడ్డారు. వీరు ఐసోలేషన్‌లో ఉండి చికిత్సపొందుతున్నారు. వీరు 14రోజులు పూర్తిస్థాయిలో చికిత్స తీసుకుని ఏమాత్రం భయపడకుండా తిరిగి మళ్లీ కరోనా వార్డుల్లో డ్యూటీలకు హాజరవుతున్నారు. ఇం కా కొంతమంది వైద్యం తీసుకుంటూనే ఉన్నారు. 


విధులకు ప్రయివేట్‌ వైద్యులు

వైద్యుల కొరత తీవ్రం గా ఉన్న నేపథ్యంలో ప్రయివేట్‌ వైద్యుల సేవలను  వినియోగించుకోవాలని జిల్లా అధికార యం త్రాంగం చర్యలు ప్రా రంభించింది. గతంలో కూడా కొవిడ్‌ సేవలకు కొంతకాలం ప్రయివేట్‌ వైద్యుల ను ఉపయోగించుకున్న ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులు చేజారిపోయే అవకాశం ఉన్నందున వెంటనే జిల్లాలోని ప్రయివేట్‌ వై ద్యుల సేవలను కూడా రిమ్స్‌ లో వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కలెక్టర్‌  భాస్కర్‌, జేసీ చేతన్‌, రిమ్స్‌ సూపరింటెండెంట్‌ శ్రీరాములు ఆదివారం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ నాయకులతో సమావేశమై చర్చించారు. వెంటనే వైద్యులను గుర్తించి వారిని కొవిడ్‌ సేవలకు పంపించాలని ఐఎంఏ నాయకులను కోరారు.  


కొవిడ్‌ ఆసుపత్రిగా మార్కాపురం జిల్లా వైద్యశాల

మార్కాపురం జిల్లా వైద్యశాలను కొవిడ్‌ ఆసుపత్రిగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం నుంచి కరోనా బాధితులను ఒంగోలు తరలించకుండా ఇక్కడే ఉండేందుకు వైద్యాధికారులు ఏర్పాట్లు చేశారు. తొలుత ఆసుపత్రిలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 40 పడకలను సిద్ధం చేశా రు. మొదటి అంతస్తును గర్భిణులకు కేటాయించారు. కరోనా బాధితుల సంఖ్య అధికంగా ఉండటంతో గర్భిణుల వార్డును తొలగించి ఆ వార్డునూ కరోనా బాధితులకు కేటాయించారు. గర్భిణులను స్థానిక కందుల ఓబులరెడ్డి వైద్యశాలకు తరలించారు. కొవిడ్‌ వైద్యశాలగా మార్పు చేసిన తొలిరోజే 53 మంది చేరారు. ఇక్కడా వైద్య సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఇందులో పెట్టే అన్నం తినలేని విధంగా ఉంటుందని కరోనా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 


సిబ్బంది కోసం ప్రతిపాదనలు పంపాం: డాక్టర్‌ విజయలక్ష్మి, సూపరింటెండెంట్‌

సిబ్బంది కొరత ఉన్న విషయం వాస్తవమే. డాక్టర్లు, సిబ్బంది నియామకానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.మెనూ ప్రకారం భోజన ఏర్పాటు చేయిస్తాం.


Updated Date - 2020-07-22T11:00:46+05:30 IST