213 రోజుల తర్వాత.. పట్టాలెక్కిన హుబ్లీ ఎక్స్‌ప్రెస్
ABN , First Publish Date - 2020-10-21T17:53:39+05:30 IST
విజయవాడ-హుబ్లీ రైలు పట్టాలెక్కింది. మంగళవారం నుంచి ఇది నడుస్తోంది. కరోనా కారణంగా మార్చి 22 నుంచి రైళ్ల రాకపోకలు..

దొనకొండ: విజయవాడ-హుబ్లీ రైలు పట్టాలెక్కింది. మంగళవారం నుంచి ఇది నడుస్తోంది. కరోనా కారణంగా మార్చి 22 నుంచి రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. లాక్‌డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైళ్ల రాకపోకల పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గుంటూరు-గుంతకల్లు ప్రధాన రైలు మార్గంలో 213 రోజుల తర్వాత మంగళవారం నుంచి విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు పునఃప్రారంభించారు. విజయవాడలో రాత్రి 7-45 గంటలకు బయల్దేరే ఈ రైలు రాత్రి 10-45 గంటలకు దొనకొండ చేరుకొని మరుసటి రోజు మధ్యాహ్నం 11-25 గంటలకు హుబ్లీ చేరుతుంది. తిరిగి హుబ్లీలో మధ్యాహ్నం 1-30 గంటలకు బయల్దేరి రాత్రి 12-48 గంటలకు దొనకొండకు, ఉదయం 5-15 గంటలకు విజయవాడకు చేరుతుంది. విజయవాడ-హుబ్లీ- విజయవాడ రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ టికెట్లకు అనుమతి లేకుండా మొత్తం రిజర్వేషన్ టికెట్లతో నవంబరు 30వ తేదీ వరకు నడిచేలా అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.