పట్టాల పంపిణీలో డిష్యుం..డిష్యుం

ABN , First Publish Date - 2020-12-29T04:40:59+05:30 IST

అద్దంకి మండలంలోని ధర్మవరంలో ఇళ్లపట్టాల పంపిణీలో రసాభాస నెలకొంది. ఇరువర్గాల తోపులాటలో ఒకరికి గాయాలయ్యాయి.

పట్టాల పంపిణీలో డిష్యుం..డిష్యుం
గాయపడ్డ మారం సుబ్బారెడ్డిధర్మవరంలో అర్హులందరికీ ఇవ్వాలని అధికారులను నిలదీసిన ఎస్సీలు
అగ్రవర్ణాలు, ఎస్సీల మధ్య తోపులాట.. మారం సుబ్బారెడ్డికి గాయాలు

అద్దంకి, డిసెంబరు 28 : మండలంలోని ధర్మవరంలో ఇళ్లపట్టాల పంపిణీలో రసాభాస నెలకొంది. ఇరువర్గాల తోపులాటలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికుల కఽథనం మేరకు.. ధర్మవరంలో రెండుచోట్ల ఇళ్ల స్థలాల పంపిణీ లేఅవుట్లు వేశారు. ఎస్సీకాలనీ సమీపంలోని లేఅవుట్‌లో ఎస్సీ లబ్ధిదారులకు, మరోచోట ఇతర సామాజికవర్గాల వారికి ఇళ్లస్థలాల ప్లాట్లు సిద్ధం చేశారు. సోమవారం రాత్రి వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య తొలుత ఎస్సీకాలనీ సమీపంలోని లేఅవుట్‌ వద్ద శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం రెండో లేఅవుట్‌ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభకు హాజరయ్యారు. ఈ నేపఽథఽ్యంలో ఎస్సీకాలనీవాసులు పలువురు సభ వద్దకు వెళ్లి తమ కాలనీలో ఉన్న అర్హులందరికీ ప్లాట్లు మంజూరు చేసే వరకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టరాదని అధికారులను కోరారు. ఆ సమయంలో వేదికపై ఉన్న కృష్ణచైతన్య కలుగజేసుకొని ఇంకా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకుంటే మంజూరుచేస్తామని తెలిపారు. ఈ సమయంలో ఎస్సీకాలనీవాసులు, ఇతర సామాజికవర్గాల మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో మారం సుబ్బారెడ్డికి గాయాలు కావటంతో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనపై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదుచేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-12-29T04:40:59+05:30 IST