అద్దంకిలో సంపన్నులకు ఇళ్లస్థలాలు

ABN , First Publish Date - 2020-07-03T10:35:05+05:30 IST

వడ్డించే వాడు మనవాడైతే చాలు బంతి చివర్లో కూర్చున్నా పుష్కలంగా అందుతాయన్న సామెత అద్దంకిలోని ఇళ్ల స్థలాల మంజూరులో నిజమైంది.

అద్దంకిలో సంపన్నులకు ఇళ్లస్థలాలు

సొంతిళ్లు ఉన్నా నోప్రాబ్లమ్‌ అంటూ మంజూరు

ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వలంటీర్లు

ఇళ్ల ప్లాట్లు కేటాయింపు తర్వాత వెలుగులోకి అక్రమాలు

250మంది వరకు అనర్హులున్నట్లు గుర్తించిన అధికారులు

మరో 200మందికిపైగా ఉండవచ్చన్న అనుమానం


అద్దంకి, జూలై 2 : వడ్డించే వాడు మనవాడైతే చాలు బంతి చివర్లో కూర్చున్నా పుష్కలంగా అందుతాయన్న సామెత అద్దంకిలోని ఇళ్ల స్థలాల మంజూరులో నిజమైంది. ఇళ్లస్థలాల అర్హుల జాబితాను ప్రాథమిక స్థాయిలో తయారుచేసే సమయంలో లోపాలను అధికారులు సైతం సరిదిద్దకుండా గుడ్డిగా ఓకే చెప్పారు. దీంతో ఇళ్ళస్థలాల జాబితా తయారు కావటంతో పాటు ఏకంగా లేఅవుట్‌లలో ప్లాట్ల కేటాయింపు కూడా జరిగిపోయింది. అద్దంకి పట్టణంలోని ఇళ్లు లేని పేదలకు ఇళ్లస్థలాల కేటాయింపు కోసం ఉత్తర అద్దంకి పరిధిలో 32.46 ఎకరాల భూమి, దక్షిణ అద్దంకి పరిధిలో 21.12 ఎకరాల భూమిని రైతులు, ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి కొనుగోలు చేశారు.


రెండుచోట్ల కలిపి 1,864 మందికి ప్లాట్ల కేటాయింపు కూడా జరిగింది. అయితే కేటాయించే సమయంలో పలువురు సంపన్నులకు కూడా ఇవ్వడం చూసి పట్టణవాసులు నివ్వెరపోయారు. పట్టణంలోని నామ్‌ రోడ్డు, బంగ్లా రోడ్డుల్లో విలువైన భవనాలు అద్దెలకు ఇచ్చిన కుటుంబాలకు కూడా ఇళ్లస్థలం వచ్చింది. ఇలా 250 మంది అనర్హులకు మొదట విడత ఇళ్లస్థలాల పంపిణీ లో ప్లాట్ల కేటాయింపు జరిగినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేటతెల్లమైంది. మరో 200మంది కూడా అనర్హులు ఉండవచ్చన్న అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.


వలంటీర్లు ఇచ్చారు.. అధికారులు చేశారు

 ఇళ్లస్థలాల కోసం జాబితా తయారుచేసే సమయంలో వార్డు వలంటీర్లు కనీస పరిశీలన, విచారణ కూడా చేయకుండా జాబితా తయారుచేశారన్న విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో వలంటీర్‌గా విధులు నిర్వహించే వ్యక్తులు స్థానికులే కావటంతో తమకు ఉన్న బంధుత్వాలు, పరిచయాలతో అనర్హులకు కూడా అవకాశం కల్పిస్తూ జాబితాలు తయారుచేసినట్లు తెలుస్తుంది. ఇక అధికారులు కూడా కనీస విచారణ కూడా చేయకుండానే జాబితా మొత్తం అప్‌లోడ్‌ చేయటం, అర్హుల జాబితా మంజూరు, ప్లాట్ల కేటాయింపు చకచకా జరిగిపోయాయి.


మొదటి ఫేజ్‌లో అనర్హులకు స్థలాల కేటాయింపు జరిగినట్లు తెలుసుకున్న రెవెన్యూ, నగరపంచాయతీ అధికారులు రెండవవిడతలో మాత్రం క్షుణ్ణంగా పరిశీలన చేయటంతో పలు దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 800కు పైగా దరఖాస్తులు రాగా 473మంది మాత్రమే అర్హులుగా గుర్తించారు. అయితే కొందరికి అర్హత ఉన్నా అధికారులు పట్టించుకోకుండా అనర్హులుగా తేల్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా మొదటి ఫేజ్‌లో కేటాయించిన 1,864మంది లబ్ధిదారుల వివరాలను అధికారులు ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటుచేసి విచారణ చేయాలని పలువురు కోరుతున్నారు. 


విచారణ చేసి అనర్హుల ను తొలగించటం జరుగుతుంది: సీతారామయ్య, తహసీల్దార్‌, అద్దంకి

ఇళ్లప్లాట్ల కేటాయింపు జరిగినప్పటికి ఇంకా పట్టాలు అందజేయనందున అనర్హులుగా గుర్తించిన వారిని రద్దుచేస్తాం. ఇళ్లస్థలాల పట్టాలు లబ్ధిదారులకు ఇచ్చేలోపు ఎప్పుడైనా అనర్హులుగా తేలితే రద్దుచేసే అవకాశం ఉంది. ఇప్పటికి 250మంది అనర్హులు ఉన్నట్లు విచారణలో తేలింది. ఇంకా ఎవరైనా ఉన్నట్లు స్థానికులు గుర్తిస్తే విచారించి రద్దు చేస్తాం.


Updated Date - 2020-07-03T10:35:05+05:30 IST