పారదర్శకంగా సచివాలయ పోస్టుల భర్తీ
ABN , First Publish Date - 2020-11-03T17:30:46+05:30 IST
గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీని పారదర్శకంగా..
6 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
అధికారులకు కలెక్టర్ భాస్కర్ ఆదేశం
ఒంగోలు: గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీని పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. పరీక్షలో ఉద్యోగాలకు అర్హత సాధించిన వారి సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 6 నుంచి ప్రారంభించాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి గందరగోళానికి తావివ్వకుండా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 19 విభాగాల్లో ఖాళీగా ఉన్న 1185 పోస్టులను మెరిట్, రోస్టర్, రిజర్వేషన్ ప్రాతిపదికన భర్తీ చేయాలన్నారు. పాయింట్ల కేటాయింపు విషయంలో ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అర్హత సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవాలని ఆదేశించారు. అభ్యర్థుల మొబైల్ నెంబర్లకు సంబంధిత సమాచారం చేరవేయాలని, వారికి కేటాయించిన వేదికల వివరాలను కూడా ముందుగా వారికి తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు జె. వెంకటమురళి, టి.ఎస్. చేతన్, జడ్పీ సీఈవో కైలాస్ గిరీశ్వర్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.