రైతులను దగా చేస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-12-30T06:09:14+05:30 IST

రైతుల పక్షపాతిగా గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆరోపించారు.

రైతులను దగా చేస్తున్న ప్రభుత్వం
బొప్పాయితోటను పరిశీలిస్తున్న నారా లోకేష్‌

యడవల్లిలో పంటలను పరిశీలించిన నారా లోకేష్‌

పెద్ద దోర్నాల, డిసెంబరు 29 : రైతుల పక్షపాతిగా గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని టీడీపీ జాతీయ  ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆరోపించారు. రైతు కోసం కార్యక్రమంలో భాగంగా దోర్నాలలో ఆయన పర్యటించారు. అక్కడ కల్లాల్లో ఆరబోసిన మిరపకాయలను లోకేష్‌ పరిశీలించారు. సగానికి పైగా తాలుకాయలను వేరు చేయడంపై రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ఏమైనా సహాయం అందించిందా, ఎకరం పెట్టుబడి ఎంత అవుతుంది, నష్టం ఎంత తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి రైతులతో మాట్లాడారా..? అని ఆరా తీశారు. తుఫాన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోతే పట్టించుకున్న నాథుడే లేరని రైతులు ఆవేదన వెలిబుచ్చారు. క్వింటా తాలుగాయుల రూ.2 వేలు, ఎరుపు రూ.9 వేలకు మించి కొనడం లేదని  రైతులు వాపోయారు. 90 శాతం తాలు వస్తోందన్నారు. ఎకరాకు లక్ష రూపాయలకు పైగా ఖర్చవుతోందని పెట్టుబడులు కూడా రావడం లేదని పేర్కొన్నారు. అనంతరం సమీపంలో సాగు చేసిన బొప్పాయి తోటను లోకేశ్‌ పరిశీలించారు. వైరస్‌ సోకి పూర్తిగా పంట నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. గతంలో బొప్పాయి సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా రాయితీపై డ్రిప్‌ ఇచ్చేదని, ఇప్పుడు రైతులకు సంబంధించిన రాయితీలన్నీ నిలిపివేశారని గోడు వెల్లబోసుకున్నారు. అనంతరం లోకేశ్‌ మాట్లాడుతూ అన్నదాతలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని విమర్శించారు.  రైతులను ఆదుకునే వరకు పోరాడతామన్నారు. లోకేష్‌కు పలువురు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

టీడీపీ కార్యకర్త కుటుంబానికి పరామర్శ
మండలంలోని యడవల్లి గ్రామంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్త తెల్లమేకల శ్రీనివాసులు కుటుంబాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పరామర్శించారు. ఈ నెల 22న గుండెపోటుతో శ్రీనివాసులు మృతి చెందిన సంగతి తెలిసిందే.. ‘రైతు కోసం’ కార్యక్రమంలో భాగంగా లోకేష్‌ పర్యటించారు. ఈ సందర్భంగా   శ్రీనివాసులు భార్య పోలమ్మను కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీనివాసులు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ముగ్గురు కుమారులను తన కొడుకు దేవాన్ష్‌తో సమానంగా చూస్తామని, ఎంత వరకు చదివితే అంత వరకు చదివిస్తామని అన్నారు. పరామర్శ అనంతరం గ్రామంలోని రైతుభరోసా కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ అధికారులను లోకేష్‌ గత ఏడాది పంట నష్టం వివరాలను అడగ్గా, యడవల్లి పరిధిలో చెరువు ఉండడం వలన ఎలాంటి పంట నష్టం నమోదు కాలేదని తెలిపారు.ఈ ఏడాది నివర్‌ తుఫాన్‌ పంట నష్టం వివరాలను నమోదు చేశామన్నారు. పంట నష్టం ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా..? అని రైతులను అడిగారు. పైసా ఇవ్వలేదని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు నూకసాని బాలాజీ, అద్దంకి, కొండేపి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్‌, డోలా వీరాంజనేయస్వామి, మార్కాపురం, కనిగిరి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, ముక్కు ఉగ్ర నరింహారెడ్డి, జిల్లా మాజీ ఉఫాధ్యక్షులు మన్నె రవీంద్ర,  మైనార్టీ సెల్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి షేక్‌ కరీముల్లా, ఎర్రగొండపాలెంనియోజకవర్గం నాయకులు ఎరీక్షన్‌బాబు, ఆంజనేయులు, కోటయ్య, చౌదరి, మండల అధ్యక్షులు అంబటి వీరారెడ్డి, నాయకులు బట్టు సుధాకర్‌రెడ్డి, మాబు, దొడ్డా శేషాద్రి, తదితరులు పాల్గొన్నారు.

యువనేతకు ఘన స్వాగతం
పెద్దారవీడు :  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు పెద్దారవీడు మండలంలోని హనుమాన్‌ జంక్షన్‌ కుంట  వద్ద పెద్దారవీడు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వెన్న వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వెంట మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, డి.మల్లారెడ్డి, డి.చిన్న కొండారెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

త్రిపురాంతకం : మండలంలో తెలుగుయువత ఆధ్వర్యంలో టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూలమాలలు, శాలువలతో లోకే్‌షను సన్మానించారు. అనంతరం మండలంలో పార్టీని గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టాలని, సీనియర్‌ నాయకుడు మోటకట్ల శ్రీనివాసరెడ్డికి మండల పార్టీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని కోరారు. పరిశీలిస్తామనని లోకేష్‌ కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

Updated Date - 2020-12-30T06:09:14+05:30 IST