‘రికార్డు’ స్థాయిలో గోల్‌మాల్‌

ABN , First Publish Date - 2020-06-06T09:40:22+05:30 IST

రెవెన్యూ రికార్డుల క్రమబద్ధీకరణలో చోటుచేసుకుంటున్న అక్రమాలు అన్నీఇన్నీ కావు.

‘రికార్డు’ స్థాయిలో గోల్‌మాల్‌

దర్శి మండలంలో భూముల క్రమబద్ధీకరణలో అక్రమాలు

ఒకరి ఆస్తులు మరొకరి పేరున మార్పు

రెవెన్యూ అధికారుల కక్కుర్తితో రైతుల గగ్గోలు

కోర్టు సైతం తప్పుబట్టినా లెక్కచేయని వైనం


‘ఇది నా భూమి’ అన్ని మొత్తుకున్నా.. సంబంధిత అసలు పత్రాలన్నీ చూపించినా దర్శి రెవెన్యూ అధికారులు ఏమాత్రం లక్ష్యపెట్టరు. వారు ఏం చేయాలనుకున్నారో దాన్ని చేసేశారు. ఎవరెమనుకుంటారోనన్న జంకూ లేదు. భూరికార్డుల క్రమబద్ధీకరణలో చేతివాటం, నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. ఒకరి పేరున ఉన్న రిజిస్టర్‌ భూమిని సైతం మరొకరి పేరును అత్యంత సులువుగా ఎక్కించారు. దీంతో బాధితులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని కేసుల్లో కోర్టు ఆదేశాలను సైతం పెడచెవిన పెట్టడం వారికే చెల్లింది.


దర్శి, జూన్‌ 5 : రెవెన్యూ రికార్డుల క్రమబద్ధీకరణలో చోటుచేసుకుంటున్న అక్రమాలు అన్నీఇన్నీ కావు. గత ప్రభుత్వ హయాంలో రైతుల పేరున ఉన్న భూమిని ఆన్‌లైన్‌లో స్థిరీకరించేందుకు పకడ్బందీగా చేట్టిన కార్యక్రమాన్ని స్థానిక మండల అధికారులు తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కాలం గడిచేకొద్దీ వారు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొంతమంది అధికారులు సిబ్బంది ఉద్దేశపూర్వకంగా ఆమ్యామ్యాలు పుచ్చుకుని ఒకరి ఆస్తులను మరొకరి పేరున రికార్డుల్లో ఎక్కించారు. దీంతో బాధితులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. మరికొంతమందివి ఉద్దేశపూర్వకంగా పెండింగ్‌లో ఉంచడంతో రికార్డులు క్రమబద్ధీకరించుకునేందుకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. రికార్డుల క్రమబద్ధీకరణలో జరుగుతున్న అక్రమాలపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


సామంతపూడి గ్రామంలోని 281/2 సర్వేనెంబర్‌లో 5.82 ఎకరాల భూమి రికార్డుల ప్రకారం రావిపాటి వెంకటేశ్వర్లు హక్కు కలిగి ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది ఆ భూమిని ఇతరుల పేర్లకు మార్చారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటంతో కోర్టును ఆశ్రయించారు. రికార్డుల తారుమారు చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అప్పటి వీఆర్వో ఆనందరావుపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని జిల్లా, మండల స్థాయి అధికారులకు ఉత్తర్వులు అందాయి. 


దర్శి రెవెన్యూ గ్రామంలోని 241/5 సర్వేనెంబర్‌లోని 4.90 ఎకరాల భూ మి రికార్డుల ప్రకారం పట్టాభూమిగా ఉన్నప్పటికీ గతంలో జరిగిన రికార్డుల క్రమబద్ధీకరణలో అధికారులు సిబ్బం ది గయాల్‌భూమిగా నమోదు చేశా రు. ఆ భూమికి చెందిన హక్కుదారులు రికార్డులు సవరించుకునేందుకు రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. 


రిటైర్డ్‌ ఉద్యోగి భూమిని ఇతరులకు హక్కు కల్పిస్తూ రికార్డుల్లో ఎ క్కించారు. ఆ భూమిని తన పేరుపై మార్చుకునేందుకు ఆ రిటైర్డ్‌ ఉద్యోగి నానా ఇబ్బంది పడుతున్నారు. దీంతో అతను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టును ఆశ్రయించారు. 


రాజంపల్లిలో పలువురికి హక్కు కలిగిన భూమి ని చెరువు భూమిగా రికార్డుల్లో ఎక్కించటంతో క్రమబద్ధీకరించుకునేందుకు ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ భూమిని రికార్డుల్లో క్రమబద్ధీకరించేందుకు కొందరు అధికారులు లక్షల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ ఆ రైతులకు న్యాయం జరగలేదు. వారు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. 

Updated Date - 2020-06-06T09:40:22+05:30 IST