బంగారం పేరుతో బురిడీ

ABN , First Publish Date - 2020-10-24T11:36:28+05:30 IST

సంచార జీవనం చేస్తూ లంకెబిందెలు దొరి కాయని మోసపు మాటలు చెప్పి బంగారం పేరుతో అమాయికులకు బురిడీ వేసే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

బంగారం పేరుతో బురిడీ

అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు 

ముగ్గురు అరెస్టు, ఒకరు పరారీ 

రూ. 6లక్షల సొత్తు స్వాధీనం 

ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌ వెల్లడి


ఒంగోలు (క్రైం), అక్టోబరు 23 : సంచార జీవనం చేస్తూ లంకెబిందెలు దొరి కాయని మోసపు మాటలు చెప్పి బంగారం పేరుతో  అమాయికులకు బురిడీ వేసే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వద్ద రూ.6లక్షల నగదు, నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.


వివరాలను ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌ వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. వైఎస్సార్‌ కడప జిల్లా వీరబల్లి మండలం శిఖారిపాలెంకు చెందిన గోవిందు కల్యాణ్‌, కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లా శ్రీనివాసపురం తాలూకా రాయ లపాడులోని హాకిపికి కాలనీకి చెందిన జనాఫ్‌ శివయ్య, చిక్‌బళ్లాపూర్‌ జిల్లా గౌరీ బిగనూర్‌ తాలూకా ఎర్రపోతు నహళ్లీ గ్రామానికి చెందిన గౌరప్పతో పాటు, కర్ణాటకకే చెందిన అనిల్‌  అలియాస్‌ రాజు కడప జిల్లా శికారిపాలెం గ్రామంలో నివాసం ఉంటున్నారు. వీరు నలుగురు కర్ణాటక, అంధ్రా, తెలం  గాణ రాష్ట్రాలలో అనేక మోసాలకు పాల్పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో సం చారజీవనం చేస్తూ బంగారపు పూత వేసిన నకిలీ వస్తువులను ఇచ్చి రూ.ల క్షలు దండుకొని మకాం మార్చుతుంటారు..  


బయటపడింది ఇలా.. 

తాళ్లూరు మండలం నాగంబొట్లవారిపాలెంకు చెందిన బొజ్జా ఆదాం కారు డ్రైవర్‌గా పనిచేస్తూ ఒంగోలు నగరంలోని కమ్మపాలెంలో నివాసం ఉం టున్నాడు. గత నెలలో తన స్వగ్రామంలో కౌజు పిట్టలు తక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు తెలుసుకుని అక్కడకు వెళ్లి వాటిని కొనుగోలు చేశాడు. ఈ సందర్భంగా కౌజు పిట్టలు విక్రయిస్తున్న అనిల్‌ అలియాస్‌ రాజు అతడిని పరిచయం చేసుకున్నాడు. ఆదాం ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నాడు. వారం తరువాత  ఆదాంకు రాజు ఫోన్‌ చేశాడు. తన అన్న ఎక్స్‌కవేటర్‌ ఆపరేటర్‌ అని, ఇటీవల తవ్వకాలలో లంకెబిందెలు దొరికాయని, అందులో దొరికిన బం గారాన్ని తక్కువ ధరకు ఇస్తామని చెప్పాడు.


గత నెల 27న రాజు ఒంగోలు ఏబీఎం కళాశాల ఆవరణలో ఆదాంను కలిసి బంగారపు పూసల దండ చూపించి ఇలాంటివి రెండు కిలోలు ఉన్నాయని, మొత్తం రూ. 7లక్షలకు ఇస్తామని నమ్మించాడు. అక్కడ రూ.లక్ష అడ్వాన్సు కూడా తీసుకున్నాడు. బంగారం మొత్తం ఇచ్చేందుకు చిత్తూరు జిల్లా పలమనేరుకు ఈ నెల 1న రావాలని చెప్పాడు. దీంతో ఆదాం కారులో పలమనేరు వెళ్లాడు. అక్కడ గోవింద నాయక్‌ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ప్లాస్టిక్‌ కవరులో ఉన్న పూసల దండలను ఇచ్చి ముందుగా అనుకున్న ప్రకారం రూ.6లక్షలు తీ సుకున్నారు.


ఊరు బయటకు వచ్చిన ఆదాం బంగారాన్ని పరిశీలించి అవి నకిలీ పూసల దండలుగా నిర్ధారించుకున్నాడు. తాను మోసపోయానని గుర్తించి ఒంగోలు వచ్చి టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోసానికి పాల్పడిన గోవిందుకల్యాణ్‌ నాయక్‌, శివయ్య, గౌరప్పలను గురువారం మధ్యాహ్నం అనంతపురం జిల్లా సరిహద్దులో ఒంగోలు టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. వారి నుంచి రూ. 6లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. మరో వ్యక్తి పరారయ్యాడని చెప్పారు. ఈ ముఠా కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో అనేక మోసాలకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని డీఎస్పీ చెప్పారు. 

Updated Date - 2020-10-24T11:36:28+05:30 IST