మృత్యువులోనూ వీడని బంధం.. రోడ్డు ప్రమాదంలో స్నేహితులు దుర్మరణం

ABN , First Publish Date - 2020-10-03T20:29:08+05:30 IST

మృత్యువులోనూ వారు స్నేహబంధం వీడలేదు. కలిసిమెలిసి ఉండే వారు కలిసే వెళ్లిపోయారు. ద్విచక్ర వాహనంపై వస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మండలంలోని శాంతినగర్‌ వద్ద శుక్రవారం

మృత్యువులోనూ వీడని బంధం.. రోడ్డు ప్రమాదంలో స్నేహితులు దుర్మరణం

బైక్‌పై వస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం

ఇద్దరూ నెల్లూరు వాసులు  


శాంతినగర్‌/గుడ్లూరు(ఆంధ్రజ్యోతి) : మృత్యువులోనూ వారు స్నేహబంధం వీడలేదు. కలిసిమెలిసి ఉండే వారు కలిసే వెళ్లిపోయారు. ద్విచక్ర వాహనంపై వస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మండలంలోని శాంతినగర్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు పట్టణంలోని వేదాయపాలెం ఎస్సీ కాలనీకి చెందిన పూచి శ్రీనివాసులు(47), పడారపల్లికి చెందిన పద్మరాజు ప్రసాద్‌(45) స్నేహితులు. శ్రీనివాసులు మోటారు సైకిల్‌ మెకానిక్‌గా, ప్రసాద్‌ ఎలక్ర్టీషియన్‌గా పనిచేస్తున్నారు. 


ఇద్దరు షాపులు కూడా పక్కపక్కనే ఉన్నాయి. ఎక్కడికైనా వారు కలిసి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు భార్య ఇటీవల పుట్టిల్లు అయిన ఉలవపాడు మండలంలోని రామాయపట్నంకు వచ్చింది. దీంతో శ్రీనివాసులు అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి స్నేహితుడు ప్రసాద్‌తో కలిసి శ్రీనివాసులు ద్విచక్ర వాహనంపై రామాయపట్నం బయల్దేరాడు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో శాంతినగర్‌ ఓవర్‌ బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న లారీని వారి బైక్‌ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎస్సై మల్లికార్జున ఘటనా స్థలానికి చేరుకుని మృతుల వివరాలు సేకరించారు. నెల్లూరుకు చెందిన లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-10-03T20:29:08+05:30 IST