టైరు బండ్లకు ఇసుక ఉచితం ఉత్తదే...!

ABN , First Publish Date - 2020-07-15T10:14:48+05:30 IST

నూతన ఇసుక పాలసీలో భాగంగా టైరు బండ్లకు ఉచితంగా ఇసుక తోడుకోవచ్చు అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట ..

టైరు బండ్లకు ఇసుక  ఉచితం ఉత్తదే...!

నిబంధనలు రాలేదంటున్న గ్రామ సచివాలయాల ఉద్యోగులు

ప్రభుత్వ హామీ మాటలకే పరిమితం అంటున్న తోలకందారులు

ఇబ్బందులు పడుతున్న చీరాల పరిధిలో నిర్మాణదారులు


చీరాల, జూలై 14 : నూతన ఇసుక పాలసీలో భాగంగా టైరు బండ్లకు ఉచితంగా ఇసుక తోడుకోవచ్చు అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట గ్రామ స్థాయిలో ఏమాత్రం అమలు కావడంలేదు. రెక్కల కష్టంతో బండ్ల మీద ఇసుక తోలుకుంటూ పొట్టనింపుకునే బడుగుల బాధలు అన్నీఇన్నీ కావు. చీరాల నియోజకవర్గంలో కళ్లెదురు ఇసుక ఉన్నా తోలుకోలేని దుస్థితి. ప్రభుత్వ నిబంధనల మేరకు యంత్రాలతో తవ్వకాలకు సైతం అనుమతిలేదు. దీంతో ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. పాఠశాలల్లో నాడు, నేడు పనులకు కూడా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. 


ఎద్దుల బండ్లకు ఇసుక ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు కార్యరూపం దాల్చలేదు. సచివాలయాల్లో తమపేరు నమోదు చేసుకుని నిర్ణీత కాలవ్యవధిలో టైరుబండ్లు వారు ఇసుకను ఉచితంగా పొందవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. సచివాలయాలకు వెళ్లిన వారికి చేదు అనుభవం ఎదురవుతుంది. తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని ఉద్యోగులు చెబుతుండటంతో తెల్లముఖం వేయాల్సి వస్తుంది.


ఆధిపత్య పోరు..

ఆధిపత్య పోరుతో ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాల అనుమతులకు గండి పడింది. స్థానికంగా ఉన్న వనరుల దృష్ట్యా ఇక్కడ ఇసుకకు కొరతే ఉండదు. చినగంజాం, వేటపాలెం మండలాలకు చెందిన అధికారపార్టీ వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈక్రమంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఒకరి గురించి ఒకరు అధికారులకు ఉప్పందించిన క్రమంలో ఆ తవ్వకాలు ఆగాయి. ఆ తరువాత ట్రాక్టర్లు ద్వారా కూడా ఇసుక తరలించేందుకు అనుమతులు లేకుండా తవ్వకాలు నిలిపివేశారు. ఈ క్రమంలో ఎక్కడన్నా అక్రమంగా ఇసుక తరలిస్తుంటే పోలీసులు పట్టుకుని వాహనాలను సీజ్‌ చేస్తున్నారు.


భూయజమానులు అంగీకరిస్తారా

చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలో లభ్యమయ్యే ఇసుక నాణ్యమైంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో స్థానికంగా ఇసుక అందుబాటులో లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు భూయజమానులు అంగీకరించే పరిస్థితిలో లేరు. 


ప్లాస్టింగ్‌కు పనికిరాని ఇతర ప్రాంతాల ఇసుక 

ఇతర ప్రాంతాల్లో ఉన్న అధీకృత రీచ్‌లలో లభ్యమయ్యే ఇసుక ప్లాస్టింగ్‌కు పనికిరాదు. ఆ ఇసుకను ఉపయోగించాలంటే జల్లించాలి. అలా చేయటం వలన సగానికి సగం ఇసుక మాత్రమే వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం పాఠశాలల్లో జరుగుతున్న నాడు, నేడు పనులకు సంబంధించి దిగుమతి అవుతున్న ఇసుకలో నాణ్యత ఉండటంలేదు. ఈ క్రమంలో టైరుబండ్లకు ఉచితం, ట్రాక్టర్లకు నిర్ణీత నిబంధనలతో ఇసుక లభ్యతకు సంబంధించి ప్రభుత్వం నిర్ధిష్టమైన ఉత్తర్వులు  ఇవ్వాల్సిన అవసరం ఉంది. తద్వార ఈ ప్రాంతంలో ఇసుకకు కొరత లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-07-15T10:14:48+05:30 IST