-
-
Home » Andhra Pradesh » Prakasam » four vehicles dhee
-
బండి ముందు బండి.. వరుసగా మూడింటిని ఢీకొట్టి
ABN , First Publish Date - 2020-12-28T00:46:52+05:30 IST
ఒకదాని ముందు ఒకటి.. ఆ ఒకటి ముందు మరొకటి.. ఆ మరొకటి ముందు ఇంకొకటి.. ఇలా వాహనాలు వరుసగా ఢీకొని బీభత్సం సృష్టించాయి.

చీరాల-కారంచేడు రోడ్డులో టూరిస్టు బస్, కార్లు, ఆటో ఢీ
పలువురు మహిళలకు తీవ్రగాయాలు
తప్పిన పెను ప్రమాదం
రెండు కార్లు, ఒక ఆటో ధ్వంసం
క్షతగాత్రులను చీరాల ఏరియా వైద్యశాలకు తరలింపు
ఒకదాని ముందు ఒకటి.. ఆ ఒకటి ముందు మరొకటి.. ఆ మరొకటి ముందు ఇంకొకటి.. ఇలా వాహనాలు వరుసగా ఢీకొని బీభత్సం సృష్టించాయి. దడదడమంటూ.. పెళపెళమంటూ శబ్ధాలతో, వాహన శకలాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించాయి. చీరాల-కారంచేడు రోడ్డులో రొంపేరు వద్ద వరుసగా టూరిస్ట్ బస్, కారు, మరోకారు, ఆటో ఢీకొన్నాయి. అయితే ఇంత భారీ ప్రమాదం జరిగినా ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారికే బలమైన గాయాలయ్యాయి.
కారంచేడు(పర్చూరు), డిసెంబరు 27 : హైదరాబాద్‌కు చెందిన టూరిస్టులు 21 మంది ఓ బస్‌లో చీరాల బీచ్‌కు శనివారం రాత్రి వచ్చారు. రాత్రంతా అక్కడే గడిపి ఆదివారం ఉదయం తిరుగుప్రయాణమయ్యారు. ఆ బస్ కారంచేడు సమీపంలోని రొంపేరు బ్రిడ్జి సమీపంలోకి రాగానే పర్చూరు వైపు ముందు వెళుతున్న కారును అతివేగంగా ఢీకొట్టింది. ఆ కారు దాని ముందు వెళుతున్న మరో కారును ఢీకొట్టగా.. ఆ కారు ముందు వెళ్తున్న ఆటోను ఢీకొంది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలుకాగా, మిగిలిన వాహనాలలో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సుతోపాటు రెండు కార్లు, ఆటో నుజ్జనుజ్జయ్యాయి. క్షతగ్రాత్రులను హుటాహుటినా 108 వాహనాల్లో చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై అహ్మద్ జానీ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
తప్పిన పెనుప్రమాదం
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తే బీభీత్సంగా ఉంది. టూరిస్టు వాహనంలో 21 మంది చీరాల బీచ్‌లో రాత్రంతా ఉండి సముద్ర స్నానాలు చేసి ఆదివారం తిరుగుపయనమయ్యారు. ఆ క్రమంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో బస్సు, రెండు కారులు, ఒక ఆటో తీవ్రంగా దెబ్బతినడంతో రోడ్డుపై పడిన అద్దాల ముక్కలు, వాహనాల నుంచి ఊడిపడిన శకలాలతో ఆ ప్రాంత అంతా భయానకంగా మారింది.
రహదారిపై నిలిచిన వాహనాలు
వాహనాలు ఒకదానికొకటి ఢీకొని రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవటంతో కారంచేడు-చీరాల రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను నియంత్రించారు.

