అ(న)ధికార విభజన

ABN , First Publish Date - 2020-03-12T08:18:04+05:30 IST

అధికారం కోసం అధికార పార్టీ నాయకులు రకరకాల ఎత్తులు, వ్యూహాలతో ముందుకుపోతున్నారు.

అ(న)ధికార విభజన

ఐదేళ్లకు ఇద్దరు ఎంపీపీలు రెండు నియోజకవర్గాలలో సర్దుకున్నారు


మార్కాపురం, మార్చి 11: అధికారం కోసం అధికార పార్టీ నాయకులు రకరకాల ఎత్తులు, వ్యూహాలతో ముందుకుపోతున్నారు. నిబంధనల మేరకు ఐదేళ్లుగా నిర్ణయించిన కాలాన్ని సగంగా విభజించి నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పంచేస్తున్నారు. ఐదేళ్ల ఎంపీపీ పదవీకాలాన్ని రెండున్నరేళ్లు ఒకరికి, మిగిలిన రెండున్నరేళ్లు మరొకరికి అని రహస్య ఒప్పందాలు చేసి సర్దుబాటు చేస్తున్నారు. స్వపక్షంలో అసంతృప్తివాదులకు పదవులను కట్టబెట్టి తమ పబ్బం గడుపుకొంటున్నారు. ఈ వ్యవహారం మార్కాపురం రెవెన్యూ డివిజన్‌లోని రాష్ట్ర విద్యాశాఖామంత్రి సురేష్‌ నియోజకవర్గమైన ఎర్రగొండపాలెం నియోజకవర్గం, మార్కాపురం నియోజకవర్గంలో చోటుచేసుకుంది.


త్రిపురాంతకం మండలంలో..

మంత్రి ఆదిమూలపు సురేష్‌ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో త్రిపురాంతకం మండలం రాజకీయంగా ఎప్పుడూ వివాదాలకు కేంద్రమే. ఈ మండలంలో వైసీపీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలలో ఈ విషయం బహిర్గతమైంది. ఎంపీపీ స్థానం ఓసీ జనరల్‌కు రిజర్వయింది. ఈ స్థానానికి పోటీ చేసేందుకు మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కోట్ల సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు శింగారెడ్డి పోలిరెడ్డిలు పోటీపడ్డారు. ఆళ్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు కూడా. పోలిరెడ్డి తన బంధువైన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో మంత్రి సురేష్‌పై ఒత్తిడి కూడా తీసుకువచ్చాడు.


చివరకు మంత్రి సురేష్‌ వారి ముగ్గురి మధ్య సమోధ్య సాధించడంలో విజయం సాధించారు. దానికి ఎంపీపీ పదవీ కాలాన్ని రెండుగా విభజించాడు. ఐదేళ్ల పదవీకాలంలో మొదటి రెండున్నరేళ్లు కోట్ల సుబ్బారెడ్డి, తర్వాత రెండున్నరేళ్లు ఆళ్ల ఆంజనేయరెడ్డి ఎంపీపీగా పనిచేసేందుకు రాతపూర్వక ఒప్పందాలు సైతం చేసుకున్నట్లు తెలిసింది. శింగారెడ్డి పోలిరెడ్డి భవిష్యతులో సహకరిస్తామనే మంత్రి సురేష్‌ హామీ మేరకు పోటీ నుంచి విరమించుకున్నారు. 


కోట్లకు 13... ఆళ్లకు 5...

త్రిపురాంతకం మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అందులో ఎంపీపీ పదవిని పంచుకున్న ఇరువురు నాయకులలో కోట్ల సుబ్బారెడ్డి 13 మంది ఎంపీటీసీ గెలుపునకు, ఆళ్ల ఆంజనేయరెడ్ది ఐదుగురు ఎంపీటీసీల అభ్యర్థుల గెలుపునకు అవసరమైన ఆర్థిక ఆసరా కల్పించాలన్న నిబంధనను మంత్రి సురేష్‌ వారి ముందు ఉంచినట్లు వైసీపీ వర్గాల సమాచారం. అందుకు అంగీకరించిన వారు ఆ పనులలో నిమగ్నమయ్యారు.


మార్కాపురం నియోజకవర్గంలో...

త్రిపురాంతకం మండల మాదిరి పరిస్థితే మార్కాపురం మండలంలోనూ నెలకొంది. మార్కాపురం ఎంపీపీ పదవి ఓసీ(మహిళ)కు కేటాయించారు. ఈ పదవికి వెన్నా హనుమారెడ్డి, జవ్వాజి వెంకటరెడ్డి, బండి కృష్ణారెడ్డి, పోరెడ్డి చెంచిరెడ్డిలు ఆశించారు. ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి ఇద్దరికి అవకాశం కల్పించారు. అదీ పదవీకాలాన్ని రెండుగా విభజించారు. రెండున్నరేళ్లు ప్రకారం బండి కృష్ణారెడ్డి భార్య లక్ష్మీదేవి, పోరెడ్డి చెంచిరెడ్డి భార్య అరుణలకు అవకాశం కల్పించారు. జవ్వాజి రంగారెడ్డి పోటీ చేసేందుకు తన సొంత ఎంపీటీసీ స్థానం ఇడుపూరు ఎస్సీలకు రిజర్వు అయింది. వెన్నా హనుమారెడ్డి తర్లుపాడు జడ్పీటీసీగా ఒంగోలులో బుధవారం నామినేషన్‌ వేశారు. 


లాటరీ ఎవరిని వరిస్తుందో...?

మార్కాపురం ఎంపీపీ స్థానాన్ని రాజీపడి పదవీకాలాన్ని పంచుకున్న నాయకుల్లో ముందెవరు పదవిని చేపట్టబోతున్నారనేది  ప్రశ్న. దీనికి సీనియర్‌ రాజకీయ నాయకుల ఇచ్చిన సలహా లాటరీ. ఎన్నికల అనంతరం ఫలితాలు వెలువడిన తర్వాత బండి కృష్ణారెడ్డి, పోరెడ్డి చెంచిరెడ్డిల మధ్య లాటరీ తీస్తారు. లాటరీ ఎవరిని వరిస్తే వారే మొదట ఎంపీపీ పదవిని అధిరోహిస్తారు. 


Updated Date - 2020-03-12T08:18:04+05:30 IST