బీసీల సదస్సుకని వెళితే... భోజనం వికటించి..

ABN , First Publish Date - 2020-12-18T05:20:43+05:30 IST

ప్రభుత్వం గురువారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి బీసీల సదస్సులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భోజనం చేస్తూ మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామ వలంటీర్‌ మృతిచెందాడు.

బీసీల సదస్సుకని వెళితే... భోజనం వికటించి..
మృతి చెందిన గోపు బ్రహ్మం

గొట్టిపడియకు చెందిన వలంటీర్‌ మృతి

 అతనితోపాటు మరొకరికి అస్వస్థత


మార్కాపురం, డిసెంబర్‌ 17: ప్రభుత్వం గురువారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి బీసీల సదస్సులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భోజనం చేస్తూ మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామ వలంటీర్‌ మృతిచెందాడు. తెలిసిన సమాచారం మేరకు.. మార్కాపురం మండలం గొట్టిపడియకు చెందిన గోపు బ్రహ్మం(24) అమరావతికి బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌, సభ్యుల ప్రమాణ స్వీకారానికి వైసీపీ గ్రామ నాయకులతో కలిసి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో బ్రహ్మంకు ఎక్కిళ్లు వచ్చి అక్కడే కింద పడ్డాడు. దీంతో పక్కనే వైసీపీ గ్రామ నాయకులు మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ వైద్యశాలకు అతనిని తీసుకువెళ్లారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సదస్సులో పెట్టిన భోజనం వికటించడం వల్లే ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వైద్యుల నివేదిక వస్తేనే మృతికి కారణం తెలిసే అవకాశం ఉంది. బ్రహ్మం మృతిచెందిన సమాచారాన్ని తెలుసుకున్న మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి ఎన్‌ఆర్‌ఐ వైద్యశాలకు వెళ్లి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. బ్రహ్మం కుటుంబసభ్యులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా బ్రహ్మం స్నేహితుడు గ్రామానికి చెందిన దొండపాటి రవితో పాటు మరో మరొకరికి కూడా వాంతులైనట్లు తెలిసింది. వారిని గుంటూరు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారు కోలుకున్నట్లు తెలిసింది. బ్రహ్మం మృతదేహాన్ని గురువారం రాత్రికి స్వగ్రామానికి చేర్చారు. మృతుడు ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు. ఇంకా వివాహం కాలేదు. తల్లిదండ్రులు, ఒక సోదరి ఉంది. వారిది పేద కుటుంబం. బ్రహ్మం మృతి విషయం తెలిసి గొట్టిపడియ గ్రామంలో విషాదం నెలకొంది.

Updated Date - 2020-12-18T05:20:43+05:30 IST