-
-
Home » Andhra Pradesh » Prakasam » farmars agitation in new acts
-
రైతు ఉద్యమంపై నిర్బంధమా ?
ABN , First Publish Date - 2020-12-15T06:01:06+05:30 IST
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను అణిచివేసేందుకు కేంద్రప్రభుత్వం చేపట్టిన నిర్బంధ చర్యలను మానుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.

ఒంగోలు బీఎ్‌సఎన్‌ఎల్ కార్యాలయం వద్ద
వామపక్ష, రైతుసంఘాల ధర్నా
చర్చిసెంటర్‌లో మానవహారం
ఒంగోలు(కలెక్టరేట్), డిసెంబరు 14 : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను అణిచివేసేందుకు కేంద్రప్రభుత్వం చేపట్టిన నిర్బంధ చర్యలను మానుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా ఐఏకేఎ్‌ససీసీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బీఎ్‌సఎన్‌ఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాకు రైతు సంఘం జిల్లాకార్యదర్శి పమిడి వెంకటరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు ఉరితాడుగా మారుతున్న వ్యవసాయచట్టాలను మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకోకపోవడం దుర్మార్గంగా ఉందన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ చట్టాలను ఉపసంహరించుకొనే వరకు రైతు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకుడు డీవీఎన్ స్వామి మాట్లాడుతూ రైతులకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదన్నారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రం చేసే చట్టాల వల్ల రాష్ట్రాల హక్కులు హరించుకుపోతున్నాయన్నారు. అనంతరం చర్చిసెంటర్‌లో మానవహారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, రైతు, వివిధ పార్టీల నాయకులు చుండూరి రంగారావు, పెంట్యాల హనుమంతరావు, వడ్డె హనుమారెడ్డి, వి బాలకోటయ్య, ఎస్‌కే మాబు, జయంతిబాబు, కే ఆంజనేయులు, ఆర్ వెంకట్రావు, ఎస్.లలితకుమారి, కే నాంచార్లు, కే హనుమంతరావు, కోటేశ్వరరావు, వల్లంరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.