-
-
Home » Andhra Pradesh » Prakasam » enumaration
-
కొలిక్కిరాని ఎన్యూమరేషన్
ABN , First Publish Date - 2020-12-07T05:02:25+05:30 IST
జిల్లాలో నివర్ తుఫాన్ పంట నష్టాల గణన (ఎన్యూమరేషన్) కొలిక్కి రాలేదు. ఈనెల 4వ తేదీకి గ్రామ స్థాయిలో ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించినా ఇంత వరకూ సగం ప్రాంతాల్లో కూడా జరగని పరిస్థితి నెలకొంది.

ముందుకు సాగని ప్రక్రియ
ఇంకా నీటిలోనే చాలా
ప్రాంతాల్లో పంటలు
సాంకేతిక సమస్యలు అధికం
కౌలు రైతులకు ఈ-క్రాప్ కష్టాలు
ఒంగోలు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నివర్ తుఫాన్ పంట నష్టాల గణన (ఎన్యూమరేషన్) కొలిక్కి రాలేదు. ఈనెల 4వ తేదీకి గ్రామ స్థాయిలో ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించినా ఇంత వరకూ సగం ప్రాంతాల్లో కూడా జరగని పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ సిబ్బందికి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో పంటలు ఇంకా నీటిలోనే ఉండటం, వర్షాల నాటికి అనేక చోట్ల రబీ పంటల ఈ-క్రాప్ నమోదు కాకపోవడం, కౌలు రైతుల పేర్లు ఖరీఫ్ పంటల ఈ-క్రాప్ బుకింగ్ జాబితాల్లో లేకపోవడంతో గణనలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.
రైతులకు అపార నష్టం
నివర్ తుఫాన్ జిల్లాలోని రైతులకు అపార నష్టం కలిగించింది. గతనెల 25నుంచి 28వతేదీ వరకూ నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురవడంతో పత్తి, వరి, మిర్చి, పొగాకు, మినుము, కంది వంటి అనేక ప్రధాన పంటలు ధ్వంసమయ్యాయి. దాదాపు లక్షా 50వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తుండగా, లక్షా 6వేల హెక్టార్లలో నష్టం జరిగి ఉండవచ్చని అధికార యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది. తక్షణం ఎన్యూమరేషన్ పూర్తిచేసి ఈనెలాఖరుకు పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు నిర్థిష్ట షెడ్యూల్ ప్రకటించారు. ఆ ప్రకారం ఈనెల 4 నాటికి గ్రామస్థాయిలో ఎన్యూమరేషన్ పూర్తి చేసి 5న గ్రామాల్లోని ఆర్‌బీకేలలో జాబితాను ప్రచురించాలి. లోపాలు ఉంటే 6న రైతులు మండల వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకెళ్లవచ్చు. వాటిని పరిష్కరించి 8వ తేదీ నాటికి జేడీఏ కార్యాలయానికి తుది జాబితా పంపాలి.
కొలిక్కిరాని ప్రక్రియ
క్షేత్రస్థాయిలోనే ఎన్యూమరేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. చాలా ప్రాంతాల్లో పంట పొలాల్లో ఇంకా వర్షపు నీరు ఉంది. అక్కడికి వెళ్లే దారులన్నీ బురదమయంగా ఉండటంతో రోడ్లు, డొంకలకు దగ్గరలో ఉన్న పొలాలకు తప్ప దూరంగా ఉండే వాటికి సిబ్బంది వెళ్లలేకపోతున్నారు. మరోవైపు సాంకేతిక సమస్యలు కూడా అధికంగానే ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది, రైతుల్లో అవగాహన లేమికూడా సమస్యగా తయారైంది. మారిన నిబంధనల ప్రకారం గత ఏడాది నుంచే పంటసాగు సమయంలో ఈ-క్రాప్ బుకింగ్ చేసుకున్న వారికే విపత్తుల సమయంలో పరిహారం, పంట అమ్మకాల సమయంలో జాబితాలో స్థానం లభిస్తుంది. అయితే ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు సంబంధించి చాలాచోట్ల ఈ-క్రాప్‌బుకింగ్ సక్రమంగా జరగలేదు. కౌలు రైతులకూ సమస్య వచ్చిపడింది. అప్పట్లో భూ యజమానులు పేర్లతో క్రాప్ బుకింగ్ చేశారు. ప్రస్తుతం చాలా చోట్ల వారు అందుబాటులో లేకపోగా, కౌలు రైతు పేరు నమోదు సాధ్య పడటం లేదు.
సగం కూడా పూర్తికాని రబీ పంటల ఈ-క్రాప్ నమోదు
రబీ సాగు అక్టోబరు నుంచి ప్రారంభం కాగా చాలాప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాటి ఈ-క్రాప్ బుకింగ్ సగం కూడా కాలేదు. అలాంటి చోట్ల ప్రస్తుతం తొలుత ఈ-క్రాప్ బుకింగ్, తర్వాత ఎన్యూమరేషన్ చేయాల్సి వస్తోంది. దీంతో ప్రక్రియ ముందుకు సాగకపోతుండగా పరిహారం అందజేత కూడా ఆలస్యం కానుంది. ఇదిలా ఉండగా చాలాచోట్ల పంటలు పూర్తిగా ధ్వంసమై వాటిని తొలగించి మళ్లీ సాగు చేయాల్సి వస్తుండగా ఎన్యుమరేషన్ జాప్యంతో రైతులు తదుపరి పనులు చేసుకోలేకపోతున్నారు. కాగా జిల్లాలో ఎన్యుమరేషన్ తీరుపై జేడీఎ డాక్టర్ పీవీ శ్రీరామమూర్తి స్పందిస్తూ షెడ్యూల్ ప్రకారం ఎన్యుమరేషన్ పూర్తికి వ్యవసాయశాఖ యంత్రాంగం మొత్తం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టిందన్నారు. ఈనెల 10 నాటికి ప్రక్రియ పూర్తి కావచ్చన్నారు.
