కరోనా.. వైద్యానికి భరోసా

ABN , First Publish Date - 2020-04-14T11:02:17+05:30 IST

కరోనా పాజిటివ్‌ రోగులు పెరుగుతున్న నేపథ్యంలో రిమ్స్‌లోనే ఈ పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం తగిన

కరోనా.. వైద్యానికి భరోసా

వారంలోపే రిమ్స్‌లో ర్యాపిడ్‌ టెస్టులు ప్రారంభం

రోజుకు వంద మందికి పరీక్షించే అవకాశం

కోవిడ్‌ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ల ఏర్పాటు

కరోనా రోగుల సేవలకు 42 మంది వైద్యులు, 100మంది నర్సులు 

ఐసోలేషన్‌ వార్డుల్లో 5 వేల పడకలు ఏర్పాటుకు సన్నాహాలు

ప్రయివేట్‌ లాడ్జీల్లో కూడా ఐసోలేషన్‌ పడకలు

రెడ్‌జోన్లలో ఇంటికే సరుకులు


కరోనా ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పాజిటివ్‌ కేసులు పెరిగినా అందరికీ వైద్యం అందించే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఐదువేల పడకలతో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.


రిమ్స్‌తోపాటు నాలుగు ప్రయివేట్‌ వైద్యశాలలతో పాటు సీహెచ్‌సీల్లో కూడా ఐసోలేషన్‌ వార్డులను సిద్ధం చేస్తున్నారు. అలాగే ప్రయివేట్‌ లాడ్జిలను కూడా స్వాధీనం చేసుకునేందుకు అధికారులు దృష్టిసారించారు. ఇప్పటికే మరుగుదొడ్లు ప్రత్యేకంగా ఉన్న గదులు ఉన్న లాడ్జిలను అధికారులు గుర్తించారు. వాటిలో కూడా ఐసోలేషన్‌ వార్డులను సిద్ధం చేయనున్నారు. అలాగే కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వీడీఆర్‌ఎల్‌ మిషన్‌ను ప్రభుత్వం రిమ్స్‌కు పంపించగా సోమవారం దీన్ని అమర్చారు. వారంలో ఇక్కడి నుంచే పరీక్షలు నిర్వహిస్తారు.


ఒంగోలు నగరం, ఏప్రిల్‌ 13: కరోనా పాజిటివ్‌ రోగులు పెరుగుతున్న నేపథ్యంలో రిమ్స్‌లోనే ఈ పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. వీడీఆర్‌ఎల్‌ మిషన్‌ను ఇప్పటికే ప్రభుత్వం రిమ్స్‌కు పంపించగా సోమవారం దీన్ని అమర్చారు. అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి వచ్చే సోమవారం నుంచి పరీక్షలను ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు చేసేస్తున్నారు. రోజుకు 100మంది స్వాబ్‌ల ఫలితాలను ఈ మిషన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో పాజిటివా లేక నెగటివ్‌నా అనే విషయాన్ని ఒక్కరోజులోనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనిపై పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే కొంత మంది సిబ్బందికి శిక్షణ కూడా ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలు అన్ని పూర్తిచేసి వచ్చే సోమవారం నుంచి ఇక్కడే పరీక్షలు  చేసేందుకు సిద్ధమవుతున్నారు. 


వెంటిలేటర్లు.. కొరత తీర్చేందుకు చర్యలు

జిల్లాలో ప్రస్తుతం కోవిడ్‌ ఆసుపత్రులుగా ఉన్న రిమ్స్‌, కిమ్స్‌, సంఘమిత్ర, నల్లూరి, వెంకటరమణ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ల కొరత ఉంది. సీరియస్‌ రోగులకు వెంటిలేటర్లను తప్పని సరిగా అమర్చాలి. రిమ్స్‌లో కూడా కేవలం పది వెంటిలేటర్లే ఉన్నాయి. దీంతో జిల్లాలో అవసరమైన మేరకు వెంటిలేటర్లను ఏర్పాటుచేసే దిశగా కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. ప్రయివేట్‌ వైద్యశాలల్లో కూడా వెంటిలేటర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. వీటిలో కూడా ప్రభుత్వమే వెంటిలేటర్లు సదుపాయాన్ని కల్పించే దిశగా చర్యలు చేపట్టారు. 


వైద్యులు... వైద్య సిబ్బంది నియామకం

పరిస్థితులు ఎలా ఉన్నా .. అందుకు తగ్గట్టుగా దీటుగా సమస్యను ఎదుర్కొనేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 100మంది నర్శింగ్‌ సిబ్బందిని నియమించుకుని వారి సేవలను కరోనా నియంత్రణకు వినియోగిస్తున్న అధికారులు తాజాగా కరోనా రోగులకు సేవలు అందించేందుకు 42 మంది వైద్యులను గుర్తించారు. వీరు ఏ సమయంలోనైనా యుద్ధప్రాతిపదికన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్య సిబ్బంది ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌నర్సులను తగినంత మందిని నియమించుకునేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ అందింది. 


రెడ్‌జోన్‌ ఏరియాల్లో ఇంటికే సరుకులు

ప్రభుత్వం జిల్లాలో గుర్తించిన రెడ్‌జోన్‌లలో నిత్యావసరాలను ఇంటికే అందించే ఏర్పాట్లు చేస్తోంది. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలు, పాజిటివ్‌ రోగులతో సన్నిహితంగా మసలిన వారి వివరాలను ఇప్పటికే సిద్ధం చేశారు. వీరిని ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా ఉంచేందుకు రెడ్‌జోన్‌ ఏరియాల్లో ఇంటికే సరుకులు పంపించేందుకు చర్యలు చేపట్టారు. ఒంగోలు ఇస్లాంపేట, గోపాలనగరంలోని అనుమానితులకు అక్కడే స్వాబ్‌ సేకరించి పరీక్షల కోసం పంపిస్తున్నారు. వైద్య సిబ్బందిని, వైద్యులను అక్కడే ఉంచి సేవలు అందిస్తున్నారు. ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు లాక్‌డౌన్‌ను పగడ్బందీగా అమలుచేస్తున్నారు.

 

అంగన్‌వాడీల సేవలు

కరోనా నియంత్రణలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు, సీడీపీఓల సేవలను కూడా వినియోగించుకోవాలని నిర్ణయించారు. వీరితో కమిటీలను ఏర్పాటుచేశారు. సూపర్‌వైజర్లతో మండలంలో కమిటీలు ఏర్పాటుచేశారు. ఇప్పటికే గ్రామ వలంటీర్లు సర్వే చేసి గ్రామాల్లో కరోనా సోకేందుకు అవకాశం ఉన్న హైరిస్కు వ్యక్తులను గుర్తించారు. ఇలా గుర్తించిన వారిని ఉదయం, సాయంత్రం పరీక్షించే బాధ్యతలను అంగ న్‌వాడీలకు అప్పగించారు. వలంటీర్లు సర్వే చేసి వారి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ వివరాలను ప్రకారం ఆయా ప్రాంతాల్లోని అంగన్‌వాడీలు ఇంటింటికీ తిరిగి హైరిస్కు వ్యక్తుల పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుంది.


41తో ఆగిన పాజిటివ్‌ కేసులు

కాగా జిల్లాలో గత రెండు రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. 41 పాజిటివ్‌ కేసులు ఉండగా ఈ రెండు రోజుల్లో ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదు. దీంతో అధికారులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా రిమ్స్‌లో, కిమ్స్‌లో ఉన్న పాజిటివ్‌ రోగుల పరిస్థితి నిలకడగా ఉంది. కొంతమంది కోలుకుంటుండగా , మరి కొంతమంది రోగులు పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి.  

Updated Date - 2020-04-14T11:02:17+05:30 IST