ఎవరిదారి వారిదే
ABN , First Publish Date - 2020-08-12T11:32:18+05:30 IST
జిల్లాలో లాక్డౌన్ అమలులో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపం కనిపిస్తోంది.

ఆంక్షల అమలులో సమన్వయ లోపం
కొన్ని చోట్ల కఠినం,
మరికొన్ని చోట్ల ఉదాసీనం
ఒంగోలు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో లాక్డౌన్ అమలులో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపం కనిపిస్తోంది. ఒక విధానం అంటూ లేకుండాపోయింది. ఆంక్షలు ఒక్కో చోట ఒక్కో విధంగా అమలవుతున్నాయి. పోలీస్, మునిసిపల్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, సిబ్బంది ఇందులో కీలకం కాగా ఎవరికి వారు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల కఠినంగా ఉంటున్న అధికారులు, మరికొన్ని చోట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. లాక్డౌన్ వల్ల వైర్సవ్యాప్తి నివారణ సాధ్యమైతే కేసులు ఉధృతి అధికంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా కఠినంగా అమలు చేయాలి. అలా కాదు అనుకుంటే సాధారణ ప్రజలు, రోజువారీ కూలీలు, వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చేసి కరోనా పరీక్షలు, వైద్య సేవలు విస్తృతం చేయాలి. అందుకు విరుద్ధంగా ఒక్కో చోట ఒక్కో రకంగా స్థానిక అఽధికారులు తోచినట్లు వ్యవహరిస్తున్నారు.
జిల్లా కేంద్రమైన ఒంగోలులో దాదాపు పక్షం రోజులపాటు వ్యాపారాలకు అనుమతించిన అధికారులు తిరిగి మంగళవారం నుంచి లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. నిత్యావసరాలకు ఉదయం 6 నుంచి 9 వరకే అవకాశం ఇచ్చారు. చీరాలలో మధ్యాహ్నం 12 గంటల వరకూ వ్యాపారాలకు అనుమతిస్తున్నారు. మార్కాపురం పట్టణంలో దాదాపు 45 రోజులు కఠినంగా ఆంక్షలు అమలు చేసిన అధికారులు ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల వరకు సడలించారు. శ్రావణమాసం కావడం, పెళ్లిల్లు ఉండటంతో తీవ్ర రద్దీ నెలకొంటోంది. అదే సమయంలో కందుకూరు పట్టణంలో సంపూర్ణ లాక్డౌన్ అమలవుతోంది. ఉదయం మూడు గంటల పాటు కూరగాయాలు, పాల విక్రయాలకు మాత్రమే సడలింపునిస్తున్నారు. ఇతరత్రా కార్యకలాపాలన్నీ నిలిపివేయడంతోపాటు, పట్టణంలోకి ఇతర ప్రాంతాల వాహనాలను కూడా రానీయకుండా బైపాస్ నుంచి పంపించి వేస్తున్నారు.
గిద్దలూరు నియోజకవర్గంలో సోమవారం నుంచి శుక్రవారం వరకూ మధ్యాహ్నం 12 గంటల దాకా దుకాణాలకు అనుమతించి తర్వాత మూసి వేయిస్తున్నారు. శని, ఆదివారాలు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కనిగిరి, పర్చూరులలో మరో వారం లాక్డౌన్ పొడిగించారు. అద్దంకిలో 12 గంటల వరకు సడలింపు ఉండగా మేదరమెట్ల, బల్లికురవలలో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. చీమకుర్తి, కొండపి, సింగరాయకొండ, వేటపాలెం, పామూరు, వైపాలెం తదితర ప్రాంతాలతో పాటు అత్యధిక మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాల్లో ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే అధికారుల నియంత్రణ చాలాప్రాంతాలలో అంతంత మాత్రంగానే ఉంటోంది. ఇలా ఒక విధానం లేకుండా లాక్డౌన్ అమలు వల్ల కేసుల ఉధృతి తగ్గకపోగా ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.