ఇంటర్‌ విద్యార్థులకు జిల్లాస్థాయి ఆన్‌లైన్‌ తరగతులు

ABN , First Publish Date - 2020-08-18T12:18:42+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ , ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్సు, ఆర్ట్సు విద్యార్థులకు ..

ఇంటర్‌ విద్యార్థులకు జిల్లాస్థాయి ఆన్‌లైన్‌ తరగతులు

ఒంగోలువిద్య, ఆగస్టు 17 : జిల్లాలోని ప్రభుత్వ , ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్సు, ఆర్ట్సు విద్యార్థులకు జిల్లాస్థాయి ఆన్‌లైన్‌ తరగతులను సోమవారం ఇంటర్మీడియట్‌ బోర్డు ఆర్‌ఐఓ వి.వి. సుబ్బారావు ప్రారంభించారు. స్థానిక అంజయ్య రోడ్డులోని ఏకేవీకే జూనియర్‌ కళాశాలలో ఒక తరగతి గదిలో తాత్కాలికంగా వీడియో తెర ఏర్పాటు చేసి అక్కడ నుంచే పాఠాలను లైవ్‌లో  ప్రసారం చేస్తున్నారు. వారం రోజులుగా కేవలం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే పరిమితమైన ఆన్‌లైన్‌ పాఠాలు సోమవారం నుంచి ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. 


కళాళాల వారీగా గ్రూపులు 

ప్రభుత్వ,ఎయిడెడ్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను కళాశాలల వారీగా వాట్సప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. జూమ్‌ యాప్‌ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలు అందించడంతో పాటు వాట్స్‌పగ్రూపులకు కూడా పాఠాలను అందుబాటులోకి తెచ్చారు. రోజూ ఉదయం సైన్సు విద్యార్థులకు 9 నుంచి 12 గంటలవరకు, మధ్యాహ్నం ఆర్ట్స్‌ విద్యార్థులకు 2 నుంచి 5 గంటలకు పాఠాలు బోధిస్తారు. 


మొదటి సంవత్సరం విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులకు ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సు నిర్వహించనున్నట్లు ఆర్‌ఐఓ చెప్పారు.ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు చెల్లించిన వారందరిని ఉత్తీర్ణులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈనేపథ్యంలో వీరందరికి ఆయా సబ్జెక్టులపై అవగాహన కల్పించేందుకు బ్రిడ్జికోర్సు నిర్వహిస్తామని ఆర్‌ఐఓ  తెలిపారు. 


Updated Date - 2020-08-18T12:18:42+05:30 IST