-
-
Home » Andhra Pradesh » Prakasam » Disease of Coimbendu
-
కోయంబేడు దడ
ABN , First Publish Date - 2020-05-18T10:34:53+05:30 IST
చెన్నైలోని కోయంబేడు లింకు అటు అధికారులకు, ఇటు ప్రజలకు దడపుట్టిస్తోంది.

జిల్లా నుంచి 100 మంది వరకూ అక్కడి
మార్కెట్‌కు వెళ్లి వచ్చినట్లు గుర్తింపు
ఇప్పటికి 50 మందికే పరీక్షలు
వారిలో ముగ్గురికి పాజిటివ్
ఒంగోలు నగరం, ఏప్రిల్ 17 : చెన్నైలోని కోయంబేడు లింకు అటు అధికారులకు, ఇటు ప్రజలకు దడపుట్టిస్తోంది. శనివారం వెలుగు చూసిన మూడు కరోనా పాజిటివ్ కేసులు అక్కడితో సంబంధం ఉన్నవని తేలడంతో యంత్రాంగం ఉలిక్కిపడింది. కట్టడి చర్యలకు ఉపక్రమించింది. చెన్నైలో కేసులు నమోదైన వెంటనే అక్కడికి వెళ్లి వచ్చిన వారిని గుర్తించే పనిని అధికారులు చేపట్టారు. అలాంటి వారు వంద మంది ఉన్నట్లు తేల్చారు. వారిలో ఇప్పటి వరకూ 50 మందికే పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మిగిలిన సగం మందికి ఇంకా పరీక్షలు చేయకపోవడం, గుర్తించాల్సిన వారు కూడా ఇంకా ఉండటం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.
జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కోయంబేడు మార్కెట్‌కు కూరగాయలు, పండ్లు రవాణా జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో కొత్తపట్నం, గుడ్లూరు, ఉలవపాడు, మార్టూరు, కనిగిరి, బేస్తవారపేట తదితర మండలాలకు చెందిన 100 మంది వరకూ ఇటీవల అక్కడికి వెళ్లి వచ్చారు. వారిలో వ్యాపారులతో పాటు లారీ డ్రైవర్లు, క్లీనర్లు కూడా ఉన్నారు. వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. వీరిని ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇంకా కొంత మందిని గుర్తించాల్సి ఉం టుందని అధికారులు అంటున్నారు. ఇంకా కోయంబేడు నుంచి వచ్చిన వారి ఫలితాలు రావాల్సి ఉంది.
క్వారంటైన్‌కు అనుమానితులు.. వారిలో ఎనిమిది నెలల పాప
కోయంబేడు లింకుతో శనివారం కొత్తపట్నం మండలం రాజుపాలెంలో రెండు, ఒంగోలు కమ్మపాలెంలో ఒక కేసు నమోదైంది. ఇందులో కమ్మపాలేనికి చెందిన వ్యక్తి ఒంగోలు రూరల్ మండ లం కరవది గ్రామంలో ఆరుగురిని కలిసినట్లు తెలిసింది. దీంతో వారిని కూడా క్వారంటైన్‌కు తరలించారు. రాజుపాలెంలో వెలు గు చూసిన రెండు పాజిటివ్ కేసుల ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉన్న 16 మందిని క్వారంటైన్‌లో చేర్చారు. వీరిశ్వాబ్‌లు తీసి వీఆర్‌డీఎల్ పరీక్షలు చేయగా 14 మంది ఫలితాలు వెల్లడయ్యాయి. అందరికీ నెగటివ్ రిపోర్టు వచ్చింది. రాజుపాలెంలో పాజిటివ్ వచ్చిన ఒక వ్యక్తికి ఎనిమిది నెలల పాప ఉంది. పాప ను కూడా క్వారెంటైన్‌కు తరలించి పరీక్షలు చేయగా నెగటివ్ అని తేలింది. దీంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
వైద్య సిబ్బంది సర్వే
కొత్తపట్నం మండలం రాజుపాలెం, ఒంగోలు నగరం కమ్మపాలెంలో పాజిటివ్ కేసులు నమోదు కావటంతో ఈ ప్రాంతా ల్లో ఆదివారం వైద్య సిబ్బంది సర్వే నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి అనుమానితులను గుర్తించే పని చేపట్టారు. జిల్లా కేంద్రం నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు రాజుపాలెం గ్రామాన్ని సందర్శించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు.