రైతులపై డీజిల్ బండ
ABN , First Publish Date - 2020-07-10T10:50:13+05:30 IST
రైతులపై డీజిల్ బండ

వ్యవసాయ పనులపై పెనుభారం
ట్రాక్టర్ల వినియోగం పెరగడంతోనే..
దున్నకం నుంచి ప్రతి పనికీ
అదనం డిమాండ్
అడిగితే ఆయిల్ పెరిగిందని సమాధానం
నెలకు రూ.12.50కోట్ల అదనపు భారం
ఆందోళనలో అన్నదాతలు
డీజిల్‌కు రాయితీ ఇవ్వాలని వినతి
పెరగడమే కానీ తగ్గడం అనే మాట లేకుండా దూసుకుపోతున్న పెట్రో ధరలు రైతులకు చుక్కలు చూపెడుతున్నాయి. డీజిల్ ధరల మోత వ్యవసాయరంగంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. నెల వ్యవధిలోనే లీటర్‌పై రూ.10కిపైగా పెరగడంతో ఆ భారం అన్నిరంగాలపై చూపుతోంది. సాగు భారంగా మారుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో సాగు ఊపందుకుంది. వ్యవసాయ పనుల్లో ఆధునిక యంత్రాల వినియోగం పెరిగిన నేపథ్యంలో ఆయిలే కీలకం. అసలే కరోనా కాలం.. ఆపై ధరల భారంతో అన్నదాతలు అల్లాడుతున్నారు. ట్రాక్టర్లతో సొంత వ్యవసాయం చేసుకునే పెద్ద రైతులకు పెట్టుబడులు పెరిగిపోతుండగా సన్న, చిన్నకారు రైతులకు యంత్రాలతో పనిచేయించడం గగనంగా మారింది. ప్రతి పనికి డీజిల్ లింక్‌తో ట్రాక్టర్ల వారు రేట్లు పెంచేస్తుండటంతో వ్యవసాయం చేయాలా.. వదిలేయాలా అన్న స్థితికి చేరుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి డీజిల్‌ను రాయితీపై అందజేయాలని రైతులు కోరుతున్నారు.
అద్దంకి, జూలై 9 : పెట్రో ధరలు మండుతున్నాయి. పెట్రోల్‌తో పోటీపడుతూ డీజిల్ ధర చుక్కలనంటింది. సరిగ్గా ఖరీఫ్ సీజన్ ప్రారంభ సమయంలో ధర పెరుగుదల వ్యవసాయంపై పెనుభారం మోపినట్లైంది. గడిచిన 34రోజుల వ్యవధిలో డీజిల్‌పై రూ.10.71 పెరిగింది. మే 4న డీజిల్ ధర రూ.68.29 ఉండగా ప్రస్తుతం రూ.79కు చేరింది. జిల్లాలో 20వేలకుపైగా ట్రాక్టర్లు ఉన్నాయు. దీంతో ఒక్కో ట్రాక్టర్‌కు రోజుకు సరాసరిన రూ.200 నుంచి రూ.250 అదనపు భారం పడుతుంది. ఒక్కో ట్రాక్టర్‌కు నెలకు సరాసరిన 600లీటర్ల డీజిల్ వినియోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం వర్షాలు పడి పనులు ప్రారంభం అవుతుండటంతో డీజిల్ వినియోగం మరింత ఎక్కువగా ఉంది. సొంత అవసరాలకు ట్రాక్టర్లు వినియోగించుకునే రైతులకు ఎకరా గొర్రు తోలకానికి 5 లీటర్లు వినియోగించినా రూ.54 అదనంగా భారం పడుతోంది. నాగలి దుక్కులకు అయితే ఎకరాకు రూ.110 నుంచి రూ.130 అదనపుభారం పడుతుంది. బాడుగలకు అయితే ఎకరాకు రూ.100 నుంచి రూ.200కుపైగా అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి.
సాగు మరింత భారం
పంట సాగు చేసిన పొలంలో రోటోవేటర్ ద్వారా చదును చేసేందుకు గతంలో గంటకు రూ.1000 కాగా ప్రస్తుతం పెంచారు. ట్రాలీ తోలకం ద్వారా ఎరువు, మట్టి తరలింపునకు గతంలో ఒక్కో ట్రిప్పునకు దూరాన్ని బట్టి రూ.250 నుంచి రూ.500 కాగా, ప్రస్తుతం ఒక్కో ట్రిప్పునకు రూ.50 నుంచి రూ.100 పెంచారు. రోజు మొత్తం మీద 10 ట్రిప్పుల తోలకం జరిగినా అదనంగా రూ.500 నుంచి వెయ్యి చెల్లించాల్సిన పరిస్థితి. వరి కోత మిషన్‌కు గతంలో గంటకు రూ.1700 కాగా వచ్చే ఏడాది పెంచి వసూలే చేసే అవకాశం కనిపిస్తుంది. డీజిల్ ధరల ప్రభావంతో రైతు నాలుగైదు ఎకరాల సాగు చేసినా అదనంగా రూ.10 వేల ఖర్చు పెరుగుతుంది. సాగు మరింత భారం కానుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులకు వినియోగించే ట్రాక్టర్లకు డీజిల్‌పై రాయితీ కల్పించాలని రైతులు కోరుతున్నారు.