రూ. 109.42 కోట్ల పంటల బీమా మంజూరు

ABN , First Publish Date - 2020-06-26T10:56:49+05:30 IST

రెండేళ్లుగా పెం డింగ్‌లో ఉన్న పంటల బీమా నష్టపరిహారం చెల్లింపునకు లైన్‌ క్లియర్‌ అయింది.

రూ. 109.42 కోట్ల  పంటల బీమా మంజూరు

నేటి నుంచి రైతు ఖాతాలకు జమ

జిల్లాలో 1.06 లక్షల మందికి లబ్ధి


ఒంగోలు, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి) : రెండేళ్లుగా పెం డింగ్‌లో ఉన్న పంటల బీమా నష్టపరిహారం చెల్లింపునకు లైన్‌ క్లియర్‌ అయింది. దీనివల్ల జిల్లాలోని లక్షా ఆరువేల మందికిపైగా రైతులకు సుమారు రూ. 109.42 కోట్లు పెండింగ్‌ బీమా పరిహారం అందనుంది. జిల్లాలో 2018-19 రబీ సీజన్‌లో తీవ్ర కరువుతో శనగ, మినుము, జొన్నవంటి పంటలు దెబ్బతిన్నాయి. ఆయా పంటలకు చెల్లించే ప్రీమియంలో రైతులు కొంత భాగం చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించేవి. అయితే అప్పట్లో తన వాటాను రాష్ట్రప్రభుత్వం బీమా కంపెనీకి చెల్లించకపోవడంతో పంటలు దెబ్బతిన్న రైతులకు రెండేళ్లుగా పరిహారం అందలేదు.


కాగా ప్రస్తుత ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వాటాను చెల్లించడంతో ప్రస్తుతం అప్పట్లో పంటలు నష్టపోయిన రైతులకు బీమా కంపెనీ పరిహారం ఇస్తున్నది. అలా జిల్లాలో 1,06,065 మంది రైతులకు సుమారు రూ. 109.42 కోట్ల మేర పరిహారం అందనుంది. అందులోగరిష్ఠంగా 38,436 మంది శనగ రైతులకు రూ. 61.48 కోట్లు, 34,242 మంది జొన్న రైతులకు రూ. 24.76 కోట్లు, 18,402 మంది మినుము రైతులకు రూ. 14.15 కోట్లు అందనుండగా మరో ఆరు రకాల పంటలకు సంబంధించి మరో 15వేల మంది రైతులకు దాదాపు రూ. 9 కోట్లు అందనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తరుపున శుక్రవారం సీఎం జగన్మోహన్‌ రెడ్డి లాంఛనంగా రైతులకు ఈ మొత్తాలు అందజేతను ప్రారంభించనున్నారు.

Updated Date - 2020-06-26T10:56:49+05:30 IST