టపాసుల వ్యాపారం తుస్..!
ABN , First Publish Date - 2020-11-16T05:27:37+05:30 IST
వెలుగుల రంగేళి దీపావళిపై ఈ ఏడాది కరోనా ప్రభావం పడింది. పిల్లా, పెద్దా తేడా లేకుండా ఊరూవాడా ఉత్సాహంగా జరుపుకునే పండుగ సందడి తగ్గింది.

భారీగా పడిపోయిన
దీపావళి అమ్మకాలు
తగ్గిన బాణసంచా మోతలు
కరోనా ప్రభావం, ప్రభుత్వ ఆంక్షలతో
పరిమితంగానే పండుగ
వెలుగుల రంగేళి దీపావళిపై ఈ ఏడాది కరోనా ప్రభావం పడింది. పిల్లా, పెద్దా తేడా లేకుండా ఊరూవాడా ఉత్సాహంగా జరుపుకునే పండుగ సందడి తగ్గింది. ఒకవైపు వైరస్ భయం, మరోవైపు ప్రభుత్వ ఆంక్షలతో ప్రజలు బాణ సంచా ‘మోత’లకు దూరంగా ఉన్నారు. తారాజువ్వలు కాల్చడానికే పరిమితమయ్యారు. దీంతో టపాసుల అమ్మకాలు భారీగా పడిపోయాయి. గతేడాదితో పోలిస్తే సగం కూడా జరగ లేదు. దీంతో వ్యాపారం తుస్సుమంది. గతంలో రూ. 4 కోట్ల మేర జరిగే విక్రయాలు ఈసారి రూ. 2 కోట్లకు పడిపోయాయి. వ్యాపారులు భారీగా నష్టపోయారు. అదేసమయంలో దుకాణాలకు లైసెన్స్‌ల పేరుతో భారీగా ముడుపులు పుచ్చుకున్న అధికారుల జేబులు మాత్రం జిగేల్‌మన్నాయి.
ఒంగోలు (కార్పొరేషన్), నవంబరు 15 : దీపావళి అంటేనే వెలుగులు, బాణ సంచా మోతలు. దీపకాంతులతోపాటు, ఢాం..ఢాంలు. కానీ ఈసారి జిల్లాలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. గతంలో పోల్చుకుంటే ఇంటింటా టపాసుల మోత తగ్గింది. పండుగను ప్రజలు పరిమితంగానే జరుపుకున్నారు. సాధారణంగా దీపావళికి పది రోజుల ముందు నుంచే అంతా సందడి కనిపిస్తుంది. బాణ సంచా విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ఏటా జిల్లావ్యాప్తంగా రూ. కోట్లలో అమ్మకాలు జరుగుతుంటాయి. కానీ ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది కరోనా ప్రభావంతో టపాసుల విక్రయాలపై స్పష్టత కరువైంది. చివరి రెండు రోజులు మాత్రమే విక్రయాలకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో రెండు రోజులైనా మంచి వ్యాపారం ఉంటుందన్న ఆశతో వ్యాపారులు అనుమతుల కోసం భారీగా ముడుపులు చెల్లించారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రభుత్వం బాణ సంచా అమ్మకాలపై ఆంక్షలు విధించడం, వాటిని కాల్చుకునే సమయాన్ని కుదించడం, వర్షాలు, అదిరిపోయే ధరలు ఇత్యాధి కారణాలతో ప్రజలు కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి చూపలేదు. కొనుగోలు చేసిన వారు కూడా గతం కన్నా బడ్జెట్‌ను భారీగా తగ్గించారు. తౌజండ్ వాలాలు, లక్ష్మీ బాంబులు వంకాయ బాంబులతో భారీ మోతలకు దూరంగా ఈ ఏడాది తారాజువ్వలు, చిచ్చుబుడ్లు, వెన్నముద్దలు, రంగుల విరజిమ్మే తాళ్లు, భూ చక్రాలను మాత్రమే కాల్చి పండుగ సరదా తీర్చుకున్నారు.
రూ. 2 కోట్ల మేర పడిపోయిన వ్యాపారం
కరోనా ప్రభావం బాణసంచా వ్యాపారంపై తీవ్రంగా పడింది. గతంలో ప్రతి దీపావళి పండుగకు పది రోజుల్లో రూ. 4 కోట్ల మేర బాణ సంచా వ్యాపారం జరిగేది. జిల్లాలోని ఒంగోలులో ముగ్గురు, కందుకూరు, కొండపి, చీరాలలో ఒక్కో పెద్ద హోల్‌సేల్ ట్రేడర్లు ఉన్నారు. వీరు విశాఖలోని ఎక్స్‌ప్లోజర్స్ శాఖ నుంచి అనుమతి తీసుకొని వ్యాపారం చేస్తుంటారు. ఇక జిల్లా కలెక్టర్ ఇచ్చే అనుమతితో ఒంగోలు, మార్కాపురం, చీరాల, కందుకూరు తదితర పట్టణాల్లో 50 మంది వరకూ హోల్‌సేల్ వ్యాపారులు ఉన్నారు. వీరి వద్ద బాణ సంచా కొనుగోలు చేసి దీపావళి సమయంలో రిటైల్‌గా అమ్మకాలు చేసే దుకాణాలు 750 వరకూ ఉంటాయి. వీరందరి ద్వారా దీపావళి సీజన్ పది రోజుల్లో రూ. 4కోట్ల మేర టపాసుల వ్యాపారం జరిగేది. కానీ ఈ ఏడాది సగానికి పైగా పడిపోయింది. టపాసుల అమ్మకాలకు రెండు రోజులు మాత్రమే గడువు ఇవ్వడం, జిల్లా మొత్తం మీద రిటైల్‌గా అమ్ముకునేందుకు 70 షాపులకు మాత్రమే అనుమతులు ఇవ్వడంతో వ్యాపారం పూర్తిగా పడిపోయింది. అంతే కాకుండా ప్రతి సంవత్సరం హోల్‌సేల్ ట్రేడర్లు ఏటా శివకాశి నుంచి స్వయంగా కొనుగోలు చేసి అమ్మకాలు జరపగా, కరోనా ప్రభావంతో కేవలం ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లింపులు, ఆయా టపాసుల పేర్లు, సంఖ్య మాత్రమే తెలియజేయడంతో తాము చేసిన అర్డర్‌లో హెచ్చు తగ్గుల వలన నష్టపోయినట్లు వ్యాపారులు చెప్తున్నారు.
లైసెన్సు మంజూరుకు భారీగా ముడుపులు
దీపావళి టపాసుల విక్రయాల దుకాణాలకు అనుమతులిచ్చేందుకు అధికారులకు భారీగా ముడుపులు పుచ్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దుకాణాలు ఏర్పాటు చేయదల్చిన వారు ముందుగా మునిసిపల్, పోలీసు, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ యంత్రాంగం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించి మునిసిపాలిటీ/కార్పొరేషన్‌కు రూ. 10వేలు, పోలీసు శాఖకు రూ. 5వేలు, రెవెన్యూకు రూ. 5వేలు, అగ్నిమాపక శాఖకు రూ. 10వేలు చొప్పున చలనా రూపంలో చెల్లించాలి. అయితే కొన్ని శాఖల అధికారులు అదనంగా భారీ మొత్తంలో వసూలు చేసి అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు రిటైల్ షాపుల వద్ద ఆయా శాఖల సిబ్బంది వసూళ్ల పర్వం కొనసాగింది. సంబంధిత కార్యాలయ క్షేత్రస్థాయి ఉద్యోగులు తమదైనీ శైలిలో ఎలాంటి రశీదులు ఇవ్వకుండా ఒక్కో దుకాణం నుంచి అదనంగా రూ. 500 వరకు వసూలు చేశారు. మామూళ్ళు ముట్టజెప్పినా వారు కోరిన మందులు ఉచితంగా చేతికి అందించక తప్పలేదు. దీంతో వ్యాపారులు తాము పెట్టిన పెట్టుబడికి ఆదాయం కన్నా, అసలులుకే ఎసరు రావడంతో ఉసూరుమంటున్నారు. మొత్తంగా ఈ ఏడాది దీపావళి వ్యాపారం తుస్ మనిపించగా, మునిసిపల్, రెవిన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ ఉద్యోగులకు మాత్రం కాసుల మోత మోగించింది.
